తిరుమల శ్రీవారి ఆలయంలో నామాల గొడవ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో నామాల గొడవ... ముదురుతోంది. ప్రతి శుక్రవారం ములవిరాట్‌కు అభిషేకం, నిజపారద్శకం కాగానే... అర్చకులు ఏకాంతంగా స్వామివారిని అలంకరిస్తారు. అలకరణకు ముందుగా స్వామివారి నామాన్ని పచ్చకర్పూరం, కస్తూరితో తీర్చిదిద్దుతారు. అయితే ఈ నామాలను ఊర్ధ్వపుండ్రాలుగా కాకుండా రూపంలో మార్పు చేస్తున్నట్లు పెదజీయంగారు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నిఘా పెట్టిన అధికారులు శ్రీవారి సేవల్లో నిర్లక్ష్యం జరుగుతోందని గుర్తించారు. ఈ అపచారానికి రమణదీక్షితులు కుమారుడు రాజేష్ దీక్షితులే బాధ్యులని భావించి అతడిని ఆరు నెలలపాటు శ్రీవారి అభిషేకం సేవల నుంచి దూరం చేశాయి.
దీనిపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులపై ఉన్నతాధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులను సంప్రదించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అవగాహన లేనివారు చెప్పిన మాటలు వినడం మంచిది కాదన్నారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంపై సంఘ విద్రోహ శక్తుల ముప్పు ఉందని రమణ దీక్షితులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీటీడీలో కొంతమంది కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. శ్రీవారి నామాలలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. నామాల వివాదంపై న్యాయపోరాటం చేస్తామని రమణదీక్షితులు తెలిపారు.