పూర్తి స్థాయి సిరీస్ ఓ పరీక్ష!
- శ్రీలంక పర్యటనపై కోహ్లి
- కొత్త వ్యూహాలు ఉన్నాయన్న టెస్టు కెప్టెన్
చెన్నై: ధోని గైర్హాజరులో తొలి రెండు టెస్టులు, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే తొలిసారి ఒక పూర్తి స్థాయి సిరీస్ (3 టెస్టులు)కు అతను నాయకత్వం వహించబోతున్నాడు. అందుకే శ్రీలంకతో జరిగే సిరీస్ తనకో సవాల్‌లాంటిదని, తన సామర్థ్యానికి పరీక్షగా అతను భావిస్తున్నాడు. ఆదివారం భారత టెస్టు జట్టు లంకకు బయల్దేరడానికి ముందు అతను మీడియాతో మాట్లాడాడు. ‘వ్యక్తిగతంగా ఈ సిరీస్ పట్ల చాలా ఉత్కంఠగా ఉన్నాను. గతంలో అనుకున్న అనేక ప్రణాళికలకు పూర్తి సిరీస్‌లో అమలు చేసే అవకాశం ఉంటుంది. ఒక టెస్టులో ఐదు రోజుల్లో మన వ్యూహాలన్నీ వాడలేం. కాబట్టి గత మూడు టెస్టులను బట్టి నా కెప్టెన్సీని అంచనా వేయవద్దు.
నన్ను నేను నిరూపించుకునేందుకు ఇది నాకు మంచి అవకాశం’ అని కోహ్లి అన్నాడు. ఈ సిరీస్‌కు సంబంధించి తన మదిలో అనేక ఆలోచనలు ఉన్నాయని, ఏదైనా ఒక వ్యూహం విఫలమైతే ప్రత్యామ్నాయంగా ప్లాన్ ‘బి’ సిద్ధంగా ఉంటుందన్నాడు. ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయాలంటే ఐదుగురు బౌలర్ల వ్యూహమే సరైనదని, దానికే కట్టుబడి ఉంటానని అతను పునరుద్ఘాటించాడు. ఈ విషయంలో తన బౌలర్ల ఆలోచనలకు అనుగుణంగా ఫీల్డింగ్ ఏర్పాటు చేసి వారికి మద్దతుగా నిలుస్తానన్నాడు. బ్యాటింగ్‌లో 40కు పైగా సగటు ఉన్న అశ్విన్‌ను టెస్టు ఆల్‌రౌండర్‌గా తాను పరిగణిస్తానన్న కోహ్లి...హర్భజన్, భువనేశ్వర్‌లను కూడా ఇదే జాబితాలో చేర్చాడు. మురళీ విజయ్ ఫిట్‌నెస్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదని, తొలి టెస్టులోగా అతను సిద్ధమవుతాడని కెప్టెన్ స్పష్టం చేశాడు.
రెండో ఓపెనర్‌గా రాహుల్, ధావన్ మధ్య పోటీ నెలకొనడంతో ఎలాంటి ఇబ్బందీ లేదని విరాట్ చెప్పాడు. ‘అందరూ ఫామ్‌లో ఉండటం అనేది సమస్యే కాదు. వీరిద్దరు బాగా ఆడుతున్నారు. ఇది మంచి పరిణామమే. తుది జట్టులో ఎవరనేది తర్వాత తేలుతుంది’ అని విశ్లేషించాడు. రోహిత్ శర్మ టెస్టు ప్రదర్శన ఇటీవల గొప్పగా లేకపోయినా...అతను ప్రతిభావంతుడని, మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.
దానర్థం అది కాదు!
మరోవైపు బీసీసీఐ నైతిక విలువల నియమావళిలాంటి ఏ నిర్ణయం తీసుకున్నా ఆటగాళ్లకు మేలు చేస్తుందన్న విరాట్ కోహ్లి... దానిపై వివరంగా వ్యాఖ్యానించేందుకు నిరాకరించాడు. బంగ్లాతో వన్డే సిరీస్ పరాజయంపై అనంతరం ‘మేం ప్రణాళికలను సమర్థంగా అమలు చేయలేకపోయామని’ చేసిన వ్యాఖ్యను తప్పుగా అన్వయించారని కోహ్లి వివరణ ఇచ్చాడు. ఇది ధోనికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యగా అప్పుడు వార్తల్లో నిలిచింది. ‘మేం అంటే అందులో నేను కూడా భాగమేనని అర్థం. అంటే నా తప్పు కూడా ఉందనే కదా. దానిని వక్రీకరించారు. జట్టులో ఎలాంటి విభేదాలూ లేవు’ అని విరాట్ స్పష్టం చేశాడు.