చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడాలని అభిమానులు ఆశిస్తున్నారట!
లండన్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడాలని అభిమానులు ఆశిస్తున్నారట! భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఇదే మాట చెబుతున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే వారి కోరిక నెరవేరుతుందని కూడా అతను అన్నాడు. భారత్–ఇంగ్లండ్ సాంస్కృతిక సంవత్సరపు వేడుకల్లో భాగంగా సోమవారం భారత హైకమిషన్ క్రికెటర్లకు ప్రత్యేక విందు ఇచ్చింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లతో పాటు పలువురు మాజీలు ఫరూఖ్ ఇంజినీర్, దిలీప్ దోషి, స్ట్రాస్, పనెసర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ.. కఠినమైన లీగ్ దశను అధిగమించాం కాబట్టి సెమీస్‌లో ప్రత్యర్థి ఎవరనే విషయం అనవసరమన్నాడు. ‘సెమీఫైనల్లో ప్రత్యర్థి గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టే అవకాశం మాకుంది. ప్రతీ ఒక్కరు భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ జరగాలని కోరుకుంటున్నారు. ఇరు జట్లు బాగా ఆడితే అది సాధ్యమే’ అని విరాట్ అభిప్రాయపడ్డాడు.