కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
భారత పేసర్ ఆరోన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లికి తనపై ఎంతో నమ్మకముందని, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ద్వారా దానిని నిలబెట్టుకుంటానని భారత పేసర్ వరుణ్ ఆరోన్ వ్యాఖ్యానించాడు. శ్రీలంకలో ఒక్క టెస్టు మాత్రమే ఆడిన ఆరోన్... ప్రస్తుతం ఇషాంత్ అందుబాటులో లేనందున మొహాలీలో తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ‘కోహ్లికి నాపైనే కాదు. జట్టులో అందరిపై నమ్మకం ఉంది.
ఇది జట్టులోని ఆటగాళ్ల స్థైర్యాన్ని పెంచుతుంది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే అవకాశం ఈ సిరీస్‌లో లభిస్తుందని భావిస్తున్నా’ అని ఆరోన్ అన్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడమనే గొప్ప సవాల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. గతంతో పోలిస్తే ఇప్పడు తన ఫిట్‌నెస్ బాగా మెరుగుపడిందని, గాయాల బారిన పడకుండా ఎలా బౌలింగ్ చేయాలో తెలుసుకున్నానని ఆరోన్ తెలిపాడు.