ఆసీస్ గడ్డపై వాళ్లను ఓడిస్తాం
ముంబై: ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో దూకుడుగా, సానుకూల దృక్పథంతో ఆడతామని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. కంగారూల జట్టును వారి సొంత గడ్డపై ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ‘మా టెస్టు ఆటగాళ్ల సామర్థ్యంపై నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు ఈ సిరీస్‌పై దృష్టిపెట్టారు. వాళ్ల అనుభవాలను ఉపయోగించి ఆసీస్‌లో సవాళ్లను ఎదుర్కొంటారు. సానుకూల క్రికెట్ ఆడటం మా మొదటి ప్రాధాన్యత.
ఆ తర్వాత దూకుడుతో మా సత్తా ఏంటో చూపెడతాం. ఇలాంటి తరహా మైండ్‌సెట్‌ను కలిగి ఉండటమే మా ఉద్దేశం. వెనుకబడిపోయినప్పుడు పుంజుకోవడానికి ప్లాన్ బి, సిలు కూడా మా వద్ద ఉన్నాయి’ అని ఆస్ట్రేలియా బయలుదేరే ముందు కోహ్లి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. రెగ్యులర్ కెప్టెన్ ధోని వేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో డిసెంబర్ 4 నుంచి 8 వరకు బ్రిస్బేన్‌లో జరిగే తొలి టెస్టుకు కోహ్లి భారత్‌కు సారథ్యం వహిస్తాడు.
తుది జట్టుపై ఆలోచన లేదు
టెస్టుల కోసం సరైన జట్టును ఎంపిక చేసుకోవడం చాలా ప్రధానమైందని చెప్పిన విరాట్ తుది జట్టు గురించి ఎక్కువగా ఆలోచించడం లేదన్నాడు. ప్రపంచకప్‌కు ముందు ఆసీస్ టూర్ ఆడటం కలిసొస్తుందన్నాడు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇది దోహదం చేస్తుందన్నాడు. 2012లో మాదిరిగానే ఈసారి కూడా వ్యక్తిగతంగా రాణించేందుకు తాను కృషి చేస్తానన్నాడు.
టెస్టు జట్టుకు నాయకత్వం వహించాలన్న తన కల ఫలించనుందని కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. మైదానం వెలుపల జరుగుతున్న పరిణామాలను ఆటగాళ్లు పట్టించుకోవడం లేదని, తమ దృష్టంతా కేవలం ఆటపైనేనని చెప్పాడు. ప్రతికూల మైండ్‌సెట్ కంటే సానుకూల ఆలోచనలతో టూర్ మొదలుపెడితే ఆటపై ఎక్కువగా దృష్టిపెట్టొచ్చన్నాడు.
18 మందితో పర్యటనకు వెళ్తే ఆటగాళ్లు ఎవరైనా గాయపడినా ఇబ్బంది ఉండదన్నాడు. మరోవైపు ప్రత్యర్థులను చూసి భయపడేకంటే ఆసీస్ పర్యటనను ఆస్వాదించాలని టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి సూచించారు. భార్యకు ఆరోగ్యం బాగాలేనందున ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న కోచ్ డంకన్ ఫ్లెచర్ నేరుగా ఆస్ట్రేలియాలో జట్టుతో కలుస్తారు.