కోహ్లి... మళ్లీ నంబర్‌వన్
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ∙టాప్–10లో ధావన్
లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో కోహ్లి ప్రదర్శన అతడికి ఈ ర్యాంక్‌ను కట్టబెట్టింది. 861 పాయింట్లతో కోహ్లి టాప్ ర్యాంక్‌కు చేరుకోగా... ఫిబ్రవరి నుంచి నంబర్‌వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (847 పాయింట్లు) మూడో స్థానానికి పడిపోయాడు. మూడో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 861 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.
చివరిసారి కోహ్లి గత జనవరిలో కేవలం నాలుగు రోజులు నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. భారత మరో క్రికెటర్ శిఖర్ ధావన్ ఐదు ర్యాంక్‌లు మెరుగు పరచుకుని 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రోహిత్ శర్మ, ధోనీ ఒక్కో స్థానం కోల్పోయి వరుసగా 13వ, 14వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ హాజల్‌వుడ్ తొలిసారి టాప్ ర్యాంక్ సాధించాడు. మరోవైపు ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంటే మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధిస్తుంది.
‘కోహ్లి’ పెయింటింగ్‌కు రికార్డు ధర
బర్మింగ్‌హామ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పదేళ్ల ఐపీఎల్ ప్రస్థానంపై గీసిన ఓ పెయింటింగ్ దిమ్మతిరిగే రేటు పలికింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు సాషా జాఫ్రి రూపొందించిన ఈ చిత్రాన్ని స్థానిక మహిళా పారిశ్రామికవేత్త పూనమ్ గుప్తా 2 లక్షల 90 వేల పౌండ్లు (రూ.2 కోట్ల 37 లక్షలు) వెచ్చించి కొనుగోలు చేశారు. ఇటీవల జరిగిన విరాట్ కోహ్లి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చారిటీ డిన్నర్‌లో పూనమ్ గుప్తా ఈ పెయింటింగ్‌ను కొన్నారు. ప్రస్తుత భారత యువ ఆటగాళ్లు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నారని ఆమె ప్రశంసించారు. మనుషుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోహ్లి ఫౌండేషన్ చేస్తున్న కృషిని అందరూ అభినందించాల్సిందేనని పూనమ్ చెప్పారు.