విశ్వవిజేత భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలైన స్మృతి మంధనకు (Smriti Mandhana) భారీ షాక్ తగిలింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్-2025లో విశేషంగా రాణించినా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది.
ఇదే ప్రపంచకప్‌లో మంధన కంటే మెరుగ్గా రాణించిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్స్‌లో సెంచరీలతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన లారా కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (814) సాధించి, అగ్రపీఠాన్ని అధిరోహించింది.
గత వారం రెండో స్థానంలో ఉండిన ఆసీస్ స్టార్ బ్యాటర్ ఆష్లే గార్డ్‌నర్ ఓ స్థానం కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది. ప్రపంచకప్‌లో టాప్-3 రన్ స్కోరర్లుగా నిలిచిన లారా, మంధన, గార్డ్‌నర్ ఐసీసీ తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లోనూ అదే స్థానాల్లో నిలవడం గమనార్హం.
ప్రపంచకప్‌లో లారా 9 మ్యాచ్‌ల్లో 571 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. మంధన 9 మ్యాచ్‌ల్లో 434 పరుగులు, గార్డ్‌నర్ 7 మ్యాచ్‌ల్లో 328 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో వీరోచిత శతకం సాధించిన టీమిండియా నంబర్-3 బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందింది. జెమీమా ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ 3 స్థానాలు మెరుగుపర్చుకొని సోఫీ డివైన్‌తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానాన్ని షేర్ చేసుకుంది.
మిగతా భారత ప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ 4, దీప్తి శర్మ 3, రిచా ఘోష్ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 14, 21, 30 స్థానాలకు ఎగబాకారు. భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన ఆసీస్ ప్లేయర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరింది.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. సౌతాఫ్రికా పేసర్ మారిజాన్ కాప్ 2 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకుంది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్, ఆష్లే గార్డ్‌నర్ తలో స్థానం కోల్పోయి 3, స్థానాలకు పడిపోయారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఆష్లే గార్డ్‌నర్‌తో పాటు నాలుగో స్థానాన్ని పంచుకుంది. రేణుకా సింగ్ 19వ స్థానంలో కొనసాగుతుండగా.. శ్రీ చరణి 7 స్థానాలు మెరుగుపర్చుకొని 23వ స్థానానికి చేరింది.
చదవండి: బిగ్‌బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్


