సమష్టి మంత్రం...విజయ సూత్రం
♦ అన్ని విభాగాల్లో అదరగొట్టిన భారత్
♦ విదేశీ పిచ్‌లపై కూడా రాణించాలి
ధర్మశాల టెస్టులో విజయానికి కావాల్సిన రెండు పరుగులను పూర్తి చేసిన అనంతరం లోకేశ్ రాహుల్ విజయ గర్వంతో గాల్లోకి ఎగిరి ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ సింహనాదం చేశాడు. ఈ సిరీస్ ఎలాంటి స్థితిలో ముగిసిందో అర్ధం చేసుకోవడానికి ఇది చాలేమో? 2005 యాషెస్ సిరీస్ అనంతరం అంత ఉద్విగ్నంగా జరిగిన సిరీస్ ఇదే అని విశ్లేషకులు చెబుతున్న మాట. వివాదాలు.. కవ్వింపు చర్యలు.. ఫిర్యాదులు.. ఆసీస్ మీడియా ఎదురుదాడి.. టీమిండియా కెప్టెన్ ఘాటైన సమాధానాలు.. అంతకుమించి అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుంచుకునే రీతిలో ఇరు జట్ల ఆటగాళ్ల వీరోచిత ప్రదర్శన.. వెరసి భారత, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను రెండు కొదమ సింహాల సమరంగా వర్ణించవచ్చు.
సాక్షి క్రీడా విభాగం :
గతేడాది సెప్టెంబర్ 22న భారత జట్టు స్వదేశంలో తమ టెస్టు సీజన్‌కు తెర లేపింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు కోహ్లి సేన న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లతో ఆడింది. అన్నింటిని క్లీన్‌స్వీప్ చేసి ఆస్ట్రేలియాకు గట్టి సవాల్ విసిరింది. దీనికి తగ్గట్టుగానే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు అంతా భారత్‌నే ఫేవరెట్‌గా చెప్పుకున్నారు. క్లీన్‌స్వీప్ ఖాయం.. అది 4–0తోనా లేక 3–0తోనా తేలాల్సి ఉంది అని లెక్కలేశారు. కానీ సిరీస్ ప్రారంభమయ్యాక భారత్ విజయం అంత సులువు కాదని తేలిపోయింది. పుణేలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ స్పిన్ దెబ్బకు భారత్ అనూహ్యంగా కుదేలైపోయింది. స్పిన్నర్ ఒకీఫ్ ఏకంగా 12 వికెట్లతో రెచ్చిపోవడంతో భారత్ అత్యంత అవమానకర రీతిలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో 105, 107 పరుగులకు ఆలౌటైంది.
ఫలితంగా 333 పరుగులతో దారుణ ఓటమి. సర్వత్రా ఎదురైన విమర్శలను తట్టుకున్న కోహ్లి బృందం ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా జట్టు కోలుకున్న తీరు ప్రశంసనీయం. సమష్టి మంత్రాన్ని జపిస్తూ ఏకంగా సిరీస్‌నే దక్కించుకుంది. మొత్తం 25 వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా ఏకంగా ప్రపంచ టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్ బౌలర్‌గా మారాడు. ఉమేశ్ యాదవ్ 17 వికెట్లతో భారత పిచ్‌లపై పేసర్ కూడా ఎక్కువ వికెట్లు తీయగలడని చాటి చెప్పాడు. ఈ సిరీస్‌లో భారత్ ఆందోళన పడిన విషయం ఒక్క కోహ్లి ఫామ్ గురించే. విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా బ్యాటింగ్‌లో అదరగొట్టారు. కరుణ్ నాయర్ మాత్రం తనకు లభించిన అవకాశాన్ని సొమ్ము చేసుకోలేకపోయాడు.
బెంగళూరులో భళా..
నాలుగు టెస్టుల సిరీస్‌లో బెంగళూరు మ్యాచ్ భారత్‌కు కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఈ రెండో టెస్టులో భారత్ పోరాడిన తీరు అపూర్వం. స్పిన్నర్ నాథన్ లయన్ ఎనిమిది వికెట్లతో దాడి చేయడంతో తొలి రోజే భారత్ 189 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా 92 పరుగులతో అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 188 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన ఆసీస్ కచ్చితంగా 2–0తో సిరీస్‌లో పైచేయి సాధిస్తుందనే అనుకున్నారు. అయితే ఆ జట్టును భారత్ అద్భుత రీతిలో అడ్డుకుని 112 పరుగులకు కుప్పకూల్చగలిగింది. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో.. అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరేసి వికెట్లతో చెలరేగి సిరీస్ సమం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
వివాదాలూ ఇక్కడి నుంచే..
సిరీస్‌లో అసలైన వేడి కూడా ఈ టెస్టు నుంచే ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో తన అవుట్‌పై స్టీవ్ స్మిత్ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఆసీస్ జట్టు మోసంతో ఆడుతోందని భారత జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. అయితే ఇరు జట్ల మధ్య ఈ వివాదం సమసిపోయినా అటు ఆసీస్ మీడియా మాత్రం కోహ్లిపై దుమ్మెత్తి పోసింది. కోహ్లిని ఏకంగా ట్రంప్‌తో పోలుస్తూ రోజుకో కథనాలు వండివార్చింది. దీనికి అతను కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇక రాంచీలో పుజారా డబుల్ సెంచరీ, సాహా సెంచరీతో విజయం ముంగిట నిలిచినా హ్యాండ్స్‌కోంబ్, షాన్ మార్‡్ష ఓపిగ్గా క్రీజులో నిలిచి మ్యాచ్ ‘డ్రా’గా ముగించారు.
కోహ్లి లేకున్నా...
చివరి టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లి గాయంతో బరిలోకి దిగకున్నా అజింక్యా రహానే జట్టును నడిపించిన తీరు ప్రశంసలందుకుంది. స్వయంగా కోహ్లి సైతం అతడి కెప్టెన్సీని పెవిలియన్‌లో కూర్చుని ఆస్వాదించినట్టు చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్టు బౌలర్లను మారుస్తూ ఆసీస్‌ను దెబ్బతీయగలిగాడు. తనలోని భావోద్వేగాలను బయటపెట్టకుండా మరో ‘మిస్టర్ కూల్’గా జట్టును విజయం వైపు నడిపించగలిగాడు. జడేజా ఆల్‌రౌండ్ షోతో పాటు లోకేశ్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ షార్ట్ పిచ్ బంతులతోనూ భయపెట్టగలనని నిరూపించాడు. ఇక కోహ్లి స్థానంలో బరిలోకి దిగిన ‘చైనామన్ స్పిన్నర్’ కుల్దీప్ యాదవ్ సంచలన అరంగేట్ర ప్రదర్శన చేశాడు. నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పరాజయానికి బాటలు వేశాడు.
ఇక విదేశాల్లోనూ వణికించాలి!
స్వదేశంలో జరిగిన 13 టెస్టుల్లో 10 మ్యాచ్‌లు గెలవడంతో పాటు నాలుగు సిరీస్‌లనూ దక్కించుకున్న భారత్... ఇక విదేశీ పిచ్‌లపై అదరగొట్టాల్సి ఉంది. అప్పుడే ఈ విజయాలకు సార్థకత లభించినట్టు అవుతుంది. నిజానికి సొంతగడ్డపై మనకు లభించే అనుకూల పరిస్థితులను సొమ్ము చేసుకుని గెలవడం బాగానే కనిపిస్తుంది. కానీ విదేశాలకు వెళ్లి అక్కడ సిరీస్‌లు నెగ్గితే లభించే గౌరవమే వేరు. అందునా టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్‌గా ఉన్న జట్టుపై ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇప్పటికీ ఆసీస్, దక్షిణాఫ్రికాలో భారత్ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. మున్ముందు ఇదే జోరుతో టీమిండియా ఆ లోటు తీరుస్తుందని ఆశిద్దాం.