మరో ‘రాహుల్‌’ గా మారే ప్రయత్నంలో.. | KL Rahul shine as India fight back with 126-runs | Sakshi
Sakshi News home page

మరో ‘రాహుల్‌’ గా మారే ప్రయత్నంలో..

Published Mon, Mar 13 2017 10:25 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

మరో ‘రాహుల్‌’ గా మారే ప్రయత్నంలో..

మరో ‘రాహుల్‌’ గా మారే ప్రయత్నంలో..

రాటుదేలుతున్న లోకేశ్‌ రాహుల్‌   
రెండో టెస్టు విజయంలో ప్రధాన పాత్ర  
కీలక ఆటగాడిగా ఎదుగుతున్న వైనం


ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు లోకేశ్‌ రాహుల్‌ ట్విట్టర్‌లో ఏదో సరదా పోస్టు పెట్టాడు. దానిపై ఒక అభిమాని ‘ఇదంతా సరే, పరుగులు ఎలా చేయాలో దానిపై దృష్టి పెట్టు’ అని కామెంట్‌ చేశాడు. సాధారణంగా ఇలాంటివాటిపై స్పందించి రచ్చ చేసుకోవడం ఆటగాళ్లకు ఇష్టం ఉండదు. కానీ అంతకు ముందు మ్యాచ్‌లో పోరాడి అర్ధ సెంచరీ చేసిన ఈ వ్యాఖ్య రాహుల్‌కు ఆగ్రహం తెప్పించినట్లుంది. వెంటనే ‘నువ్వు వచ్చి మాకు నేర్పించు. పరుగులు ఎలా చేయాలో నీకు బాగా తెలుసేమో’ అని ఘాటుగా బదులిచ్చాడు. ఆ తర్వాత జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

సొంత మైదానంలో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో అర్ధసెంచరీ సాధించిన మూడు ఇన్నింగ్స్‌లు కూడా చూస్తే అతను చేసిన పరుగులే కాదు, సందర్భం, ఆడిన షాట్లు కూడా వాటి విలువను పెంచుతాయి. ఈ విషయంలో పేరులోనే కాదు తన మార్గదర్శి కూడా అయిన దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను అతను గుర్తుకు తెచ్చాడు. మున్ముందు కూడా భారత టెస్టు జట్టు విజయాల్లో ఓపెనర్‌గా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్న రాహుల్, అందు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

(సాక్షి క్రీడా విభాగం):  దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో లోకేశ్‌ రాహుల్‌ తన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అప్పటికే రాహుల్‌ ద్రవిడ్‌లాంటి టెక్నిక్‌తో దేశవాళీలో అద్భుత ప్రదర్శనతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అతనిపై అందరి దృష్టీ ఉంది. కానీ అనూహ్యంగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ చెత్త షాట్‌లు ఆడి తన వికెట్‌ను పారేసుకున్నాడు. బంగారు అవకాశాన్ని అతను వృథా చేసుకున్నాడని అంతా విమర్శించారు. ఈ మ్యాచ్‌ తర్వాత రాహుల్‌ చిన్ననాటి కోచ్‌ శామ్యూల్‌ జైరాజ్‌కు తన మిత్రుడు ఒకరినుంచి ‘నీ కుర్రాడిని వెళ్లి ఐపీఎల్‌ ఆడుకోమని చెప్పు’ అని వ్యంగ్యంగా ఒక మెసేజ్‌ వచ్చింది.

అయితే చిన్నప్పటినుంచి రాహుల్‌ గురించి తెలిసిన కోచ్, తన కుర్రాడిపై నమ్మకముంచాడు. అడిలైడ్‌లో జరిగిన తర్వాతి టెస్టులోనే ఈ మంగళూరు అబ్బాయి సెంచరీ సాధించి తన అసలు సత్తాను ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌ తర్వాత మూడు ఫార్మాట్‌లలో కూడా నిలకడగా రాణిస్తూ వచ్చిన లోకేశ్, ఇప్పుడు ఓపెనర్‌గా భారత టెస్టుకు గొప్ప ఆరంభాలు ఇవ్వడంలో బిజీ అయిపోయాడు. టెక్నిక్‌పరంగా, కష్టాల్లో ఉన్నప్పుడు నైతికంగా కూడా రాహుల్‌ ద్రవిడ్‌ ఇచ్చిన మద్దతు అతని ఎదుగుదలలో కీలకంగా మారితే... విమర్శలు వచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ అండగా నిలిచి అవకాశాలిచ్చిన మరో కర్ణాటక దిగ్గజం, భారత కోచ్‌ అనిల్‌ కుంబ్లే పోషించిన పాత్ర కూడా చాలా ఉంది.

అతివృష్టి... అనావృష్టి...
రెండో టెస్టులోనే సెంచరీ సాధించినా రాహుల్‌ కెరీర్‌ అంత తొందరగా ఊపందుకోలేదు. ఒక మ్యాచ్‌లో భారీ స్కోరు సాధిస్తే మరో మ్యాచ్‌లో కనీసం 20 పరుగులు కూడా చేయకుండా ఘోరంగా విఫలమవుతూ రావడమే అందుకు కారణం. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు రాహుల్‌ టెస్టుల్లో నాలుగు సెంచరీలు సాధించాడు. ఇవన్నీ కలిపి 575 పరుగులు అయితే... మిగిలిన 17 ఇన్నింగ్స్‌లు కలిపి అతను చేసింది 232 పరుగులే! అంటే నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement