England vs India 2nd Test, Day 1, Highlights: KL Rahul, Rohit Sharma Put India In Commanding Position - Sakshi
Sakshi News home page

Ind Vs Eng: రోహిత్‌ జోరు.. రాహుల్‌ హుషారు

Published Fri, Aug 13 2021 4:50 AM | Last Updated on Fri, Aug 13 2021 9:04 AM

KL Rahul, Rohit Sharma Put India In Commanding Position - Sakshi

రెండో టెస్టుపై కూడా చినుకులే! ఆట వానతో ఆలస్యమై, ఆరంభమైంది. తర్వాత రోహిత్‌ శర్మ జోరు మొదలైంది. చూడచక్కని స్ట్రోక్స్‌తో అతని బౌండరీలు భారత స్కోరు బోర్డును  పరుగెత్తించాయి. లోకేశ్‌ రాహుల్‌తో కలిసి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. అతను అవుటయ్యాక మరో ఓపెనర్‌ రాహుల్‌ పరుగుల బాధ్యత తీసుకున్నాడు. సెంచరీతో తొలిరోజు భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశాడు. రెండో రోజు మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా భాగమైతే  భారీ స్కోరు ఖాయమవుతుంది.  

లండన్‌: చినుకులు పడ్డాయి... నెమ్మదించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ వికెట్లను ఎంచక్కా పడగొట్టొచ్చు అనుకున్న ఇంగ్లండ్‌ ఎత్తుగడ పారలేదు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రూట్‌ నిర్ణయం బెడిసికొట్టింది. భారత ఓపెనర్లు జోరు ప్రత్యర్థి ఆశల్ని, అవకాశాల్ని దెబ్బతీశాయి. పట్టుదలగా క్రీజ్‌లో నిలిచిన లోకేశ్‌ రాహుల్‌ (248 బంతుల్లో 127 నాటౌట్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్‌ శర్మ (145 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ స్కోరుకు పునాది వేశాడు వీళ్లిద్దరు ఇంగ్లండ్‌ బౌలర్లపై అవలీలగా పరుగులు చేయడంతో భారత్‌ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు రహానే (1 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. భారత తుది జట్టులోకి శార్దుల్‌ స్థానంలో ఇషాంత్‌ను తీసుకోగా... అశ్విన్‌ మళ్లీ పెవిలియన్‌కే పరిమితమయ్యాడు.  

కష్టంగా మొదలై...
భారత ఓపెనర్లు ఆరంభంలో పరుగులు చేసేందుకు కష్టపడ్డారు. రోహిత్, రాహుల్‌ ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. అలా మొదటి పది ఓవర్లలో ఓపెనింగ్‌ జోడి 11 పరుగులే చేయగలిగింది. 13వ ఓవర్లో తొలిసారి బంతి బౌండరీ లైను దాటింది. 8 ఓవర్లు వేసిన అండర్సన్‌ కేవలం 11 పరుగులే ఇచ్చాడు. అయితే భారత్‌ పుంజుకునేందుకు స్యామ్‌ కరన్‌ బౌలింగ్‌ దోహదం చేసింది. అనుభవజ్ఞుడైన అండర్సన్‌ బౌలింగ్‌లో డిఫెన్స్‌ ఆడిన రోహిత్‌... స్యామ్‌ను చితగ్గొడుతూ ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టాడు. వర్షం అంతరాయం కల్పించడంతో 18.4 ఓవర్ల వద్ద ఆట ఆగింది. అప్పటికి భారత్‌ స్కోరు 46/0. వర్షం ఆగకపోవడంతో లంచ్‌ విరామం ప్రకటించారు.  

రోహిత్‌ ఫిఫ్టీ
రెండో సెషన్‌లోనూ భారత్‌ హవానే కొనసాగింది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ ఆటలో వేగం పెంచాడు. ఆఫ్‌ స్టంప్‌పై పడిన బంతులను జాగ్రత్తగా ఆడిన ఈ ఓపెనర్‌... గతి తప్పిన బంతులకు తన స్ట్రోక్‌ ప్లే దెబ్బ రుచి చూపించాడు. రాహుల్‌ మాత్రం ఓపిగ్గా నిలబడ్డాడు. ఆచితూచి ఆడుతూ సహచరుడి వేగాన్ని ఆస్వాదించాడు. రోహిత్‌ 8 బౌండరీలతో అర్ధసెంచరీ (83 బంతుల్లో) అధిగమించాడు. అనంతరం మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో చెలరేగిన రోహిత్,  హుక్‌షాట్‌తో సిక్సర్, పుల్, లాఫ్టెడ్‌ షాట్లతో బౌండరీలు రాబట్టాడు. జట్టు 100 పరుగుల్లో రోహిత్‌వే 75 పరుగులు కావడం విశేషం. మరోవైపు వంద బంతులాడినా ఒక్క ఫోర్‌ కొట్టని రాహుల్‌... ఎట్టకేలకు మొయిన్‌ అలీ ఓవర్లో సిక్సర్‌తో తొలిసారి బంతిని బౌండరీ దాటించాడు. అజేయంగా సాగిపోతున్న ఓపెనింగ్‌ జోడీని అండర్సన్‌ విడదీశాడు. సెంచరీ ఊపుమీదున్న రోహిత్‌ను బోల్తా కొట్టించడంతో 126 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

రాహుల్‌ సెంచరీ
క్రీజులోకి వచ్చిన చతేశ్వర్‌ పుజారా (9) మళ్లీ విఫలమయ్యాడు. కెప్టెన్‌ కోహ్లి జత కలిశాక రాహుల్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 157/2 స్కోరు వద్ద టీ విరామానికి వెళ్లారు. ఆఖరి సెషన్లో అండర్సన్‌ బౌలింగ్‌లోనూ బౌండరీలు కొట్టడం ద్వారా రాహుల్‌ స్కోరు పెంచే బాధ్యత తన భుజాన వేసుకున్నాడు.  కోహ్లినేమో జాగ్రత్తపడ్డాడు. పది బంతులాడాకే ఖాతా తెరిచిన కోహ్లి తొలి బౌండరీ కోసం 48 బంతులు ఆడాల్సి వచ్చింది. ఈ జోడీ క్రీజులో కుదురుకోవడంతో భారత్‌ మరో వికెట్‌ కోల్పోకుండా 200 మార్క్‌ను దాటింది.

తొలి టెస్టులో పూర్తి చేయలేకపోయిన సెంచరీని రాహుల్‌ ‘క్రికెట్‌ మక్కా’లో చేశాడు. అలీ, మార్క్‌వుడ్, రాబిన్సన్‌ల బౌలింగ్‌ల్లో యథే చ్ఛగా ఫోర్లు కొట్టాడు. వుడ్‌ బౌలింగ్‌లో థర్డ్‌ మ్యాన్‌ దిశగా బాదిన బౌండరీతో 212 బంతుల్లో రాహుల్‌ శతకం పూర్తి చేసుకున్నాడు. 80 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ కొత్త బంతి తీసుకుంది. ఈ బంతి విరాట్‌ వికెట్‌ బలిగొంది. రాబిన్సన్‌ బౌలింగ్‌లో కోహ్లి (42; 3 ఫోర్లు) అవుటవడంతో 117 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) అండర్సన్‌ 83; రాహుల్‌ (నాటౌట్‌) 127; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్‌ 9;  కోహ్లి (సి) రూట్‌ (బి) రాబిన్సన్‌ 42; రహానే (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (90 ఓవర్లలో 3 వికెట్లకు) 276.
వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267.
బౌలింగ్‌: అండర్సన్‌ 20–4–52–2, రాబిన్సన్‌ 23–7–47–1; స్యామ్‌ కరన్‌ 18–1–58–0 మార్క్‌వుడ్‌ 16–1–66–0, మొయిన్‌ అలీ 13–1–40–0.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement