రాహుల్ 199
డబుల్ సెంచరీ చేజార్చుకున్న ఓపెనర్
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 391/4
రాణించిన పార్థివ్, కరుణ్ నాయర్
ఇంగ్లండ్‌తో చివరి టెస్టు
ప్రతిభకు, ప్రదర్శనకు అంకెలే కొలమానంగా ఉండే ఆటలో ‘ఒక్క పరుగు’ విలువ ఏమిటో లోకేశ్ రాహుల్‌ను అడిగితే తెలుస్తుంది. తొలి బంతి నుంచి 310 బంతుల వరకు ఏకాగ్రత, పట్టుదలతో అతని ఇన్నింగ్స్ అద్భుతంగా సాగింది. సంయమనం, దూకుడు కలగలిసి చూడచక్కటి షాట్లతో ఆకట్టుకున్న అతను ఒక్కటే ‘చెత్త షాట్‘ ఆడాడు. ఒక్క పరుగుతో డబుల్ సెంచరీ చేజార్చుకున్న దురదృష్టవంతుల జాబితాలో చేరి తనను తాను నిందించుకున్నాడు. గత ఐదు టెస్టు ఇన్నింగ్స్‌లలో కలిపి 104 పరుగులు... గాయం కారణంగా జట్టులోకి వస్తూ పోతూ ఆడిన మ్యాచ్‌లలో పరుగులు చేయలేకపోతున్న ఒత్తిడి... అయినా సరే, రాహుల్ ఆటపై భారత టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకముంచింది. ఇప్పుడు అతను ఒక్క ఇన్నింగ్స్‌తో తన ప్రతిభ ఏమిటో చూపించి ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు.
సిరీస్‌లో తొలిసారి కోహ్లి విఫలం, పుజారా కూడా నిలదొక్కుకోలేకపోయాడు. అయినా సరే రాహుల్ ఇన్నింగ్స్ కారణంగా చివరి టెస్టులోనూ మళ్లీ ఆధిక్యం సాధించే దిశగా భారత్ నిలిచింది. వ్యక్తిగత మైలురాయిని అందుకోలేకపోయినా... 100కు పైగా ఓవర్లు క్రీజ్‌లో నిలిచి అతను చేసిన 199 పరుగుల విలువ అమూల్యం. తొలి వికెట్‌కు పార్థివ్‌తో కలిసి 152 పరుగులు... నాలుగో వికెట్‌కు కరుణ్ నాయర్‌తో కలిసి 161 పరుగులు... రాహుల్ ముందుండి నడిపించిన ఈ రెండు భాగస్వామ్యాలు జట్టును పటిష్టస్థితిలో నిలిపాయి. చేతిలో ఆరు వికెట్లు ఉన్న మన జట్టు కేవలం 86 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. నాలుగో రోజు నాయర్, విజయ్‌లతో పాటు లోయర్ ఆర్డర్ కూడా
చెలరేగితే మ్యాచ్‌ను శాసించవచ్చు.
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ప్రత్యర్థికి భారత్ దీటైన జవాబు ఇచ్చింది. లోకేశ్ రాహుల్ (311 బంతుల్లో 199; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగాడు. రాహుల్ కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ కాగా, భారత గడ్డపై మొదటిది. అతని బ్యాటింగ్‌కు తోడు పార్థివ్ పటేల్ (112 బంతుల్లో 71; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (136 బంతుల్లో 71 బ్యాటింగ్; 6 ఫోర్లు) అర్ధ శతకాలు జట్టును పటిష్ట స్థితిలో నిలిపాయి. ఓవర్‌నైట్ స్కోరు 60/0తో ఆట ప్రారంభించిన భారత్, మూడో రోజు ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో నాయర్‌తో పాటు విజయ్ (17 బ్యాటింగ్) ఉన్నాడు. ఆదివారం ధాటిగా ఆడిన కోహ్లి సేన 88 ఓవర్లలోనే 361 పరుగులు సాధించడం విశేషం.
30 ఏళ్ల తర్వాత...
టెస్టుల్లో 199 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన రెండో భారత బ్యాట్స్‌మన్ రాహుల్. 1986లో కాన్పూర్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టులో మొహమ్మద్ అజహరుద్దీన్ 199 పరుగుల వద్ద రవి రత్నాయకే బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ తర్వాత తాను ఆడిన 83 టెస్టుల్లో అజహర్ ఈ స్కోరును అధిగమించలేకపోగా... కెరీర్‌లో ఒక్క డబుల్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక సెంచరీలు (22) చేసిన ఆటగాడిగా నిలిచాడు. మరో ఏడుగురు బ్యాట్స్‌మెన్ ముదస్సర్ నాజర్, మ్యాథ్యూ ఇలియట్, జయసూర్య, స్టీవ్ వా, యూనిస్ ఖాన్, ఇయాన్ బెల్, స్టీవెన్ స్మిత్ కూడా 199 వద్ద అవుటయ్యారు. ఆండీ ఫ్లవర్, కుమార సంగక్కర మాత్రం చివర్లో సహచరుల అండ లభించక 199 స్కోరు వద్ద నాటౌట్‌గా నిలిచారు.
సెషన్–1: ఓపెనర్ల దూకుడు
రాహుల్, పార్థివ్ రెండో రోజు ఆటను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. ఎక్కడా తడబాటుకు లోను కాకుండా చక్కటి షాట్లతో ధాటిగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. డాసన్ వేసిన వరుస ఓవర్లలో ఒక్కో సిక్సర్ బాది రాహుల్ దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో ముందుగా రాహుల్ 96 బంతుల్లో, ఆ తర్వాత పార్థివ్ 84 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోరుతో 31 ఇన్నింగ్స్‌ల తర్వాత భారత్ తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. అయితే మరింత వేగంగా దూసుకుపోతున్న దశలో ఈ జోడీని విడదీసి అలీ తన జట్టుకు మొదటి వికెట్ అందించాడు. పార్థివ్ ముందుకొచ్చి మిడ్ వికెట్ వైపు ఆడబోగా, బంతి ఎడ్జ్ తీసుకొని కవర్స్ ఫీల్డర్ చేతిలో పడింది. ఈ సెషన్‌లో భారత్ 4 పరుగుల రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఓవర్లు: 28, పరుగులు: 113, వికెట్లు: 1
సెషన్–2: నిలిచిన రాహుల్
లంచ్ తర్వాత మూడో ఓవర్లోనే భారత్ పుజారా (16) వికెట్ కోల్పోయింది. స్టోక్స్ బౌలింగ్‌లో పుజారా స్లిప్‌లో కుక్‌కు క్యాచ్ ఇచ్చాడు. స్టోక్స్ తర్వాతి ఓవర్లో రాహుల్ సింగిల్ తీసి 99కు చేరగా... ఓవర్ త్రో కారణంగా మరో రెండు పరుగులు రావడంతో 171 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అనంతరం కోహ్లి (15) కూడా అరుదైన రీతిలో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సిరీస్ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత కెప్టెన్, బ్రాడ్ వేసిన లెగ్‌కటర్‌ను ఆడటంలో విఫలమై ఎక్స్‌ట్రా కవర్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చాడు. అయితో మరో ఎండ్‌లో మాత్రం రాహుల్ సాధికారికంగా ఆడాడు. కొన్నిసార్లు ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టినా, అతను పట్టుదలగా నిలబడ్డాడు. ఓవర్లు: 26, పరుగులు: 83, వికెట్లు: 2
సెషన్–3: భారత్‌దే పైచేయి
విరామం తర్వాత రాహుల్, అతని కర్ణాటక సహచరుడు నాయర్ కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. తన జోరును కొనసాగిస్తూ రాహుల్ 253 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్‌లో కుక్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన నాయర్, 98 బంతుల్లో కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. కొద్దిసేపటికి అలీ ఓవర్లో వరుస బంతుల్లో ఫోర్, సిక్సర్ కొట్టి రాహుల్ 190ల్లోకి ప్రవేశించాడు. అయితే డబుల్ సెంచరీ ఘనతను అందుకోకుండానే దురదృష్టవశాత్తూ అతను నిష్క్రమించాడు. రషీద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 199కు చేరిన రాహుల్... తర్వాత క్రీజ్‌కు దూరంగా ‘వైడ్’గా వెళుతున్న బంతిని వెంటాడి కవర్ పాయింట్‌లో నేరుగా బట్లర్ చేతుల్లోకి పంపించాడు! తాను చేసిన తప్పుకు రాహుల్ తలపట్టుకోగా, డ్రెస్సింగ్‌రూమ్ నుంచి ‘డబుల్’ను అభినందించేందుకు బయటకు వచ్చిన భారత బృందం మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. గాయం నుంచి కోలుకొని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విజయ్, నాయర్ కలిసి రోజును ముగించారు. ఇన్నింగ్స్‌లో 102వ ఓవర్లో తొలి రివ్యూ కోరిన ఇంగ్లండ్, మరో నాలుగు బంతులకే మరో రివ్యూ కోరి రెండింటినీ వృథా చేసుకుంది. ఓవర్లు: 34, పరుగులు: 135, వికెట్లు: 1