మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. మూడు టీ20ల భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత కుల్దీప్(5/24) బౌలింగ్ ముందు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తేలిపోగా.. అనంతరం లోకేశ్ రాహుల్(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) పరుగుల ప్రవాహం కొనసాగించాడు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఏడు పరుగుల స్కోర్ బోర్డు వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్(4) విల్లే బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి స్కోర్ బోర్డు పరిగెత్తించారు. ఆరంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై రాహుల్ ఎదురుదాడికి దిగగా, రోహిత్ శర్మ ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలోనే 27 బంతుల్లోనే రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 123 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడిని రషీద్ విడదీశాడు. రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) వెనుదిరగటంతో కెప్టెన్ కోహ్లితో కలిసి లక్ష్యాన్ని రాహుల్ పూర్తి చేశాడు. రాహుల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో మరో పది బంతులు మిగిలుండగానే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే, రషీద్ తలో వికెట్ సాధించారు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంతరం జాసన్ రాయ్ (30; 20 బంతుల్లో 5ఫోర్లు) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరో వైపు ఐపీఎల్ హీరో జోస్ బట్లర్(69; 46 బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఆకాశమే హద్దుగా బౌలర్లపై దాడి చేశాడు. దీంతో పది ఓవర్లలకే స్కోర్ 77 పరుగులు దాటింది.
కుల్డీప్ కూల్చేశాడు.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చేలరేగుతుండంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న సమయంలో బంతి అందుకున్న కుల్డీప్ మాయ చేశాడు. హేల్స్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్.. 14 ఓవర్లో మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ధోని మాస్టర్ కీపింగ్‌తో ఏకంగా ఈ ఓవర్‌లో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్‌లో మోర్గాన్(8), బెయిర్ స్టో(0), రూట్(0) వెనుదిరగడంతో ఇంగ్లండ్ కష్టాల్లోపడింది. మరో వైపు వికెట్లు పడుతున్నా బట్లర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. చివర్లో డేవిడ్ విల్లీ (29; 15 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్‌కు పనిచెప్పడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ రెండు, హార్దిక్ ఒక్క వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment