ఇరు జట్లు చెరొకటి గెలిచాయి.ఇక గెలవాల్సింది మరొకటి. ఈ ఒక్కటి గెలిచేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి భారత్, ఇంగ్లండ్. రెండు జట్ల లక్ష్యం ఇప్పుడు ట్రోఫీనే. దీంతో నిర్ణాయక మూడో టి20లో
తాడోపేడో తేల్చుకునేందుకు తహతహలాడుతున్నాయి. ఇటు కోహ్లి సేన, అటు మోర్గాన్ బృందం బ్యాటింగ్, బౌలింగ్‌ల్లో సమవుజ్జీగా కనబడుతున్నాయి. దీంతో ఆదివారం రసవత్తర పోరుకు తెరలేవనుంది.
బ్రిస్టల్: నిర్ణాయక మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టి20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో విరాట్ కోహ్లి బృందం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లపైనే ఒత్తిడి ఉంది. తొలి మ్యాచ్‌లో సూపర్ హిట్టయిన కుల్దీప్‌కు రెండో మ్యాచ్ నిరాశనే మిగిల్చింది. అతను ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. చహల్ ఒకటే వికెట్ తీసి పరుగులు బాగానే సమర్పించున్నాడు. బుమ్రా స్థానంలో ఆడుతున్న ఉమేశ్ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు. కానీ పరుగులు ధారాళంగా ఇచ్చుకున్నాడు. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ టచ్‌లోకి రావడంతో భారత్‌కు కష్టాలు తప్పలేదు. ఈ నేపథ్యంలో బౌలర్లు వైవిధ్యంపై దృష్టిసారిస్తేనే ఫలితాలు రాబట్టుకోవచ్చు. బ్యాటింగ్ విషయానికొస్తే కుల్దీప్‌లాగే రాహుల్ పరిస్థితి ఉంది. మాంచెస్టర్‌లో ‘శత’క్కొట్టేసిన ఈ టాపార్డర్ బ్యాట్స్‌మన్ కార్డిఫ్‌లో విఫలమయ్యాడు. ఓపెనర్లూ చేతులెత్తేయడంతో మిడిలార్డర్‌పై భారం పెరిగింది. అయితే సిరీస్‌ను తేల్చే ఈ మ్యాచ్‌లో రోహిత్, ధావన్‌లు తమ ప్రభావం చూపిస్తే పరుగుల ప్రవాహానికి అడ్డు ఉండదు. ప్రత్యర్థి జట్టు సమతూకంగా ఉంది. బ్యాటింగ్‌లో బట్లర్, రాయ్, హేల్స్, బెయిర్ స్టో ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ బట్లర్ ప్రమాదకర బ్యాట్స్‌మన్. ఫిట్‌నెస్‌తో ఉన్న ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఆడించే విషయాన్ని టాస్‌కు ముందు నిర్ణయిస్తామని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. బౌలింగ్‌లో విల్లీ, జేక్ బాల్, ప్లంకెట్‌లు భారత బ్యాటింగ్‌ను దెబ్బతీయగల సమర్థులు. గత మ్యాచ్‌లో వీళ్లంతా తీసింది ఒక్కో వికెటే అయినా... భారత్‌ను పుంజుకోకుండా చేశారు.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, రైనా, ధోని, పాండ్యా, చహల్, కుల్దీప్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, బట్లర్, హేల్స్, రూట్/స్టోక్స్, బెయిర్‌స్టో, విల్లీ, ప్లంకెట్, జోర్డాన్, రషీద్, జేక్ బాల్.
హేల్స్ నిలబెట్టాడు
కార్డిఫ్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది. అలెక్స్ హేల్స్ (41 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరిదాకా నిలబడి ఇంగ్లండ్‌ను సిరీస్‌లో నిలబెట్టాడు. భారత్ తమ ముందుంచిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 44 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు జాసన్ రాయ్ (15), బట్లర్ (14)లను ఉమేశ్ యాదవ్ తక్కువ స్కోర్లకే ఔట్ చేయగా... చహల్ బౌలింగ్‌లో రూట్ (9) బౌల్డయ్యాడు. ఈ దశలో కెప్టెన్ మోర్గాన్ (17), బెయిర్ స్టో (18 బంతుల్లో 28; 2 సిక్సర్లు)లతో విలువైన భాగస్వామ్యాలు జతచేసిన హేల్స్ జట్టును గెలుపుబాట పట్టించాడు. ఈ క్రమంలో అతను 39 బంతుల్లో (3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఉమేశ్ 2, భువీ, చహల్, పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు.
పిచ్, వాతావరణం
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వేసవికాలం కాబట్టి వర్ష సూచన లేదు. పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు ఇది సవాలే!
►సా.గం.6.30 నుంచి సోనీ ఈఎస్‌పీఎన్, సోనీ టెన్–3 చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment