‘ది ఓవల్’ సీమర్ల అడ్డాగా తయారైంది. ప్రతి సెషన్‌లోనూ పేసర్లదే పైచేయి. బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో పాతుకోకుండా వణికిస్తోంది. మొదట ఇంగ్లండ్ పేసర్ల ముందు మన బ్యాట్స్‌మెన్ తలవంచారు. కోహ్లి అర్ధసెంచరీ భారత్‌కు ఊరటనిస్తే... ఆఖరి సెషన్లో శార్దుల్ ఠాకూర్ మెరుపులు భారత్ స్కోరులో జోరును పెంచాయి. ఇదే సెషన్లో భారత సీమర్లు దీటుగా సత్తాచాటారు. కీలకమైన 3 వికెట్లను పడగొట్టి తొలి రోజే టెస్టును రసవత్తరంగా మార్చారు. మరో 8 బంతుల్లో రోజు ముగుస్తుందనగా అద్భుత బంతితో రూట్‌ను బౌల్డ్ చేసిన ఉమేశ్ ఘనంగా ముగించాడు.
లండన్: తొలి 7 ఓవర్లలో భారత్ స్కోరు 28/0... టెస్టులో అది కూడా ఆరంభంలోనే 4 రన్‌రేట్ అసాధారణం. టాస్ గెలిచిన రూట్ నిర్ణయం తప్పనిపించింది. మరో 7 ఓవర్లయ్యాక 14 ఓవర్లలో 28/2. ఇది కూడా అసాధారణమే! వరుసగా ఏడు ఓవర్లను మెయిడిన్లుగా వేసిన ఇంగ్లండ్ సీమర్లు ఓపెనర్ల వికెట్లను పడగొట్టారు. ఇక అక్కడి నుంచి ప్రత్యర్థి పేసర్లు అదరగొట్టారు. తమ నాయకుడి నిర్ణయం సరైందని భారత్‌ను మళ్లీ తొలి రోజే ఆలౌట్ చేశారు. ఏడాది తర్వాత టెస్టు బరిలోకి దిగిన క్రిస్ వోక్స్ (4/55) భారత్ తొలి ఇన్నింగ్స్ కూల్చడంలో కీలకపాత్ర పోషించాడు.
దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (96 బంతుల్లో 50; 8 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్‌ల స్థానాల్లో వచ్చిన శార్దుల్, ఉమేశ్ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్‌ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్‌పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్ (5)ను బౌల్డ్ చేశాడు. హమీద్ (0)ను కీపర్ పంత్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఉమేశ్ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్, కెప్టెన్ రూట్ (21)ను క్లీన్»ౌల్డ్ చేశాడు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 53/3 స్కోరు చేసింది. మలాన్ (26 బ్యాటింగ్), ఒవర్టన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
టాప్ మరోసారి ఫ్లాప్...
మొదటి ఏడు ఓవర్లే మురిపించిన ఓపెనర్లు రోహిత్ శర్మ (11), రాహుల్ (17) అంతలోనే కుదేలయ్యారు. చతేశ్వర్ పుజారా (4) కూడా చేతులెత్తేశాడు. 39 పరుగుల వద్దే టాపార్డర్ ఫ్లాపయింది. కెప్టెన్ కోహ్లి క్రీజులో నిలిచేందుకు ప్రత్యర్థి పేసర్లతో పోరాడుతున్నాడు. ఆశ్చర్యకరంగా జడేజా (10)ను ఐదో స్థానంలో పంపిన ప్రయోగం ఫలించకపోగా, రహానే (14) తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. అయితే మరో ఎండ్‌లో కోహ్లి ఆత్మవిశ్వాసంతో చూడచక్కటి షాట్లు ఆడాడు. 22 పరుగుల వద్ద స్లిప్‌లో రూట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతను, 85 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కోహ్లి 85 బంతుల్లో ఫిఫ్టీ (8 ఫోర్లు) పూర్తి చేసుకున్నాడు. కానీ రాబిన్సన్ భారత కెపె్టన్‌ను అక్కడితోనే ఆపేయగా, పంత్ (9) మళ్లీ విఫలమయ్యాడు. స్కోరు 127/7కు చేరగా ఇక ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే ఈ తరుణంలో శార్దుల్ అనూహ్యంగా చెలరేగాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. వోక్స్ బౌలింగ్‌లో బౌండరీలు బాదగా... ఓవర్టన్, రాబిన్సన్, వోక్స్ ఓవర్లలో చెరో సిక్సర్ కొట్టాడు. 31 బంతుల్లోనే (6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చకచకా అర్ధసెంచరీని సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన ఫిఫ్టీ. విఖ్యాత ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ 30 బంతుల్లో సాధించాడు. ఇటీవల కన్ను మూసిన ప్రముఖ కోచ్ వాసు పరాంజపే (82 ఏళ్లు) మృతికి నివాళిగా కోహ్లి సేన నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) బెయిర్‌స్టో (బి) వోక్స్ 11; రాహుల్ (ఎల్బీ) (బి) రాబిన్సన్ 17; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 4; కోహ్లి (సి) బెయిర్‌స్టో (బి) రాబిన్సన్ 50; జడేజా (సి) రూట్ (బి) వోక్స్ 10; రహానే (సి) అలీ (బి) ఒవర్టన్ 14; పంత్ (సి) అలీ (బి) వోక్స్ 9; శార్దుల్ (ఎల్బీ) (బి) వోక్స్ 57; ఉమేశ్ (సి) బెయిర్‌స్టో (బి) రాబిన్సన్ 10; బుమ్రా (రనౌట్) 0; సిరాజ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (61.3 ఓవర్లలో ఆలౌట్) 191.
వికెట్ల పతనం: 1–28, 2–28, 3–39, 4–69, 5–105, 6–117, 7–127, 8–190, 9–190, 10–191.
బౌలింగ్: అండర్సన్ 14–3–41–1, రాబిన్సన్ 17.3–9–38–3, వోక్స్ 15–6–55–4, ఒవర్టన్ 15–2–49–1.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) బుమ్రా 5; హమీద్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మలాన్ బ్యాటింగ్ 26; రూట్ (బి) ఉమేశ్ 21; ఒవర్టన్ బ్యాటింగ్ 1; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 53.
వికెట్ల పతనం: 1–5, 2–6, 3–52.
బౌలింగ్: ఉమేశ్ 6–1–15–1, బుమ్రా 6–2–15–2, శార్దుల్ 3–1–11–0, సిరాజ్ 2–0–12–0.
కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లలో కలిపి 23 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో సచిన్, సంగక్కర, పాంటింగ్, జయవర్ధనే, కలిస్, ద్రవిడ్ మాత్రమే అతనికంటే ముందున్నారు.
IND Vs ENG 4th Test: పడినా...పడగొట్టారు..!
Published Fri, Sep 3 2021 5:16 AM | Last Updated on Fri, Sep 3 2021 12:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment