అడిలైడ్‌లో 36 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత కూడా భారత జట్టు ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవగలిగింది. ఆపై స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్టులో పరాజయం పాలైన తర్వాత కూడా మళ్లీ కోలుకొని ప్రత్యర్థిని చిత్తు చేసింది. కింద పడిన ప్రతీసారి మరింత బలంగా పైకి లేవడం భారత్‌కు కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు దీనిని చేసి చూపించిన టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై దానిని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్‌లో గెలుపు తర్వాత లీడ్స్‌లో ఓటమిని ఆహ్వానించిన కోహ్లి సేన... గత మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి అమితోత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం.
లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కీలక దశకు చేరుకుంది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా... మరో టెస్టు గెలిస్తే ఏ జట్టుకైనా సిరీస్ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. ఈ నేపథ్యంలో ఓవల్ మైదానంలో నేటి నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. లీడ్స్ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసం పెరగ్గా... గత మ్యాచ్ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్ దృష్టి పెట్టింది.
అశ్విన్ ఆడతాడా!
భారత్ తుది జట్టుకు సంబంధించి ఒకే ఒక అంశంపై చర్చ సాగుతోంది. గత మూడు టెస్టుల్లో అవకాశం దక్కని సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను ఓవల్‌లో ఆడిస్తారా చూడాలి. కోహ్లి మాటల ప్రకారం చూస్తే నలుగురు పేసర్లలో ఎవరికైనా విశ్రాంతి ఖాయం. ఫామ్‌ను చూసుకుంటే ఇషాంత్ శర్మనే పక్కన పెట్టే అవకాశం ఉంది. అతని స్థానంలోనే అశ్విన్ రావాలి. ఓవల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటం, ఇదే మైదానంలో కొద్ది రోజుల క్రితం కౌంటీ మ్యాచ్ ఆడిన అశ్విన్ 7 వికెట్ల తో చెలరేగడం అతని అవకాశాలను పెంచుతోంది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ నలుగురు పేసర్లను ఆడించడంపై ఆసక్తి చూపిస్తే మాత్రం బ్యాటింగ్ కూడా చేయగల శార్దుల్‌కు చోటు ఖాయం.
బౌలర్‌గా పెద్దగా ప్రభావం చూపకపోయినా, జడేజా బ్యాటింగ్ నైపుణ్యం కారణంగా అతడిని తప్పించి అశ్విన్‌ను తీసుకునే అవకాశాలు తక్కువ. ఆంధ్ర ఆటగాడు విహారికి స్థానంపై కూడా ఆసక్తి నెలకొంది. ఆరో బ్యాట్స్‌మన్ తనకు అవసరం లేదని కోహ్లి పదే పదే చెబుతుండటంతో విహారి అవకాశాలకు దెబ్బ పడుతోంది. సిడ్నీ టెస్టు గాయం నుంచి కోలుకున్న తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ మొదలు ఇప్పటి వరకు విహారి మరో మ్యాచ్ ఆడలేకపోయాడు. పుజారా మళ్లీ ఫామ్‌లోకి రాగా, కోహ్లి కూడా లయ అందుకున్నాడు. లార్డ్స్‌లో అర్ధ సెంచరీ మినహా మిగతా సిరీస్‌లో విఫలమైనా... వైస్ కెప్టెన్ రహానేను తప్పించే సాహసం చేయకపోవచ్చు. 2018 పర్యటనలో ఓవల్ టెస్టుతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పంత్ ఇప్పుడైనా రాణించాల్సి ఉంది.
ఓపెనర్లు రోహిత్, రాహుల్ శుభారంభం ఇస్తుండటం భారత్‌కు సానుకూలాంశం.
వోక్స్‌కు అవకాశం...
సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకోరాదని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. కెప్టెన్ రూట్ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ భీకర ఫామ్‌లో ఉండి జట్టును నడిపిస్తున్నాడు. రూట్‌ను నిలువరించడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గత టెస్టులో చాలా కాలం తర్వాత ఇంగ్లండ్‌కు బర్న్స్, హమీద్ రూపంలో ఓపెనింగ్ కలిసి రావడంతో పాటు పునరాగమనంలో మలాన్ కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ పటిష్టంగా మారింది. వ్యక్తిగత కారణాలతో బట్లర్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో బెయిర్‌స్టో కీపింగ్ చేయనుండగా... ఒలీ పోప్ బ్యాట్స్‌మన్ స్థానాన్ని భర్తీ చేస్తాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా మొయిన్ అలీ కీలకం కానున్నాడు. ముగ్గురు పేసర్లు జోరులో ఉండగా ఒక కీలక మార్పు ఖాయమైంది. వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ స్థానంలో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ బరిలోకి దిగుతాడు. కరన్‌తో పోలిస్తే వోక్స్ బౌలింగ్‌లో పదును ఎక్కువగా ఉండటంతో ఇంగ్లండ్ పేస్ దళం మరింత
పటిష్టంగా మారింది.
తుది జట్లు అంచనా
భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, రోహిత్, పుజారా, రహానే, పంత్, జడేజా, శార్దుల్/అశ్విన్, బుమ్రా, సిరాజ్, షమీ/ఉమేశ్. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, హమీద్, మలాన్, పోప్, బెయిర్‌స్టో, అలీ, వోక్స్, ఒవర్టన్, రాబిన్సన్, అండర్సన్.
పిచ్, వాతావరణం
భారత్ తరహాలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఆపై స్పిన్‌కు సహకరిస్తుంది. వాతావరణం పొడిగా, వేడిగా ఉండనుంది. వర్షసూచన లేదు.
1971లో ఇంగ్లండ్‌పై తొలి టెస్టు విజయం తర్వాత భారత్ ఇప్పటి వరకు ఓవల్‌లో మళ్లీ గెలవలేదు.
3 మ్యాచ్‌లు ఓడిన జట్టు మరో 5 ‘డ్రా’ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment