కార్డిఫ్: తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత జట్టు శుక్రవారం ఇక్కడ జరుగనున్న రెండో టి20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కుల్దీప్ స్పిన్ మాయకు రాహుల్ సుడిగాలి ఇన్నింగ్స్ తోడవడంతో మొదటి మ్యాచ్‌లో అలవోకగా గెలుపొందిన కోహ్లిసేన అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. పటిష్టంగా కనిపించినప్పటికీ... టీమిండియాను ఎదుర్కోలేక చతికిలపడ్డ ఆతిథ్య ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు యత్నించనుంది. ఈ వేదికపై ఇంగ్లండ్ గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలి చింది. కార్డిఫ్ పిచ్ కాస్త నెమ్మదైనది కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు తక్కువే.
స్పిన్నర్ల జోరు... బ్యాట్స్‌మెన్ హోరు...
వేదికతో సంబంధం లేకుండా పిచ్ ఎలాంటిదైనా తన స్పిన్‌ను ఎదుర్కోవడం ఎంత కష్టమో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నిరూపించాడు. అతడి ఊరించే బంతులను భారీ షాట్‌లుగా మలచాలనుకున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మూల్యం చెల్లించుకున్నారు. ప్రధాన పేసర్ భువనేశ్వర్ భారీగా పరుగులిచ్చినా... హార్దిక్, ఉమేశ్ తప పని సమర్థవంతంగా నిర్వర్తించారు. బ్యాటింగ్ విషయానికొస్తే కొంత కాలంగా తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న రాహుల్... సెంచరీతో తనను తప్పించలేని పరిస్థితి కల్పించాడు. ఓపెనర్లు రోహిత్, ధావన్, మిడిలార్డర్‌లో కోహ్లి, ధోని, రైనా, పాండ్యా చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు తిరుగుండదు. మరోవైపు భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ తమ సామర్థ్యం మేరకు రాణించాలని భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment