పంత్‌కు పిలుపు | Kuldeep makes it, maiden Test call-up for Pant | Sakshi
Sakshi News home page

పంత్‌కు పిలుపు

Published Thu, Jul 19 2018 12:37 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

 Kuldeep makes it, maiden Test call-up for Pant - Sakshi

దేశవాళీ క్రికెట్‌లో ‘భారత గిల్‌క్రిస్ట్‌’గా గుర్తింపు తెచ్చుకున్న రిషభ్‌ పంత్‌ను సెలక్టర్లు టెస్టులకు తగిన ఆటగాడిగా గుర్తించారు. భవిష్యత్తుపై దృష్టి సారిస్తూ ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అతడికి తొలిసారి అవకాశం కల్పించారు. అటు టి20ల్లో, ఇటు వన్డేల్లో కూడా ఇంగ్లండ్‌ పని పట్టిన కుల్దీప్‌ యాదవ్‌ను ఊహించినట్లుగానే టెస్టు టీమ్‌లో కొనసాగించగా... రోహిత్‌ శర్మ ఇక టెస్టులకు పనికి రాడని సెలక్టర్లు తేల్చేశారు. గాయాలు, వ్యక్తిగత సమస్యలతో కొంత కాలంగా ఆటకు దూరమైన షమీ తిరిగి జట్టులోకి రాగా, భువనేశ్వర్‌ ఫిట్‌నెస్‌పై అనిశ్చితి కొనసాగుతుండటం కీలక సిరీస్‌కు ముందు ఆందోళన కలిగించే అంశం.   

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల కోసం భారత జట్టును సెలక్టర్లు బుధవారం ఎంపిక చేశారు. టీమిండియా తరఫున 4 టి20  మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ విధ్వంసక బ్యాట్స్‌మన్, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు తొలిసారి టెస్టు టీమ్‌లో చోటు దక్కడమే తాజా ఎంపికలో కొత్తగా చెప్పుకోదగ్గ అంశం. రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ప్రత్యామ్నాయంగా అతనికి ఈ అవకాశం దక్కింది. అఫ్గానిస్తాన్‌తో టెస్టు ఆడిన మరో సీనియర్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఇప్పటికే జట్టులో భాగంగా ఉన్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కూడా ఉన్నాడు. కుల్దీప్‌ కూడా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో భారత జట్టుతో పాటే ఉన్నా తుది జట్టులో అతనికి చోటు దక్కలేదు. టెస్టు స్పెషలిస్ట్‌లు రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా తిరిగి రావడంతో ఇంగ్లండ్‌ గడ్డపై ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌ ఆడుతుందా అనేది ఆసక్తికరం. టెస్టు రెగ్యులర్‌ పేసర్లు ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లు జట్టులో కొనసాగగా... మొహమ్మద్‌ షమీ పునరాగమనం చేశాడు. ఐపీఎల్‌లో కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడిన షమీ ఆ తర్వాత యోయో టెస్టులో విఫలం కావడంతో అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ యోయో పాస్‌ కావడంతో అతనికి మార్గం సుగమమైంది. శార్దుల్‌ ఠాకూర్‌ కూడా స్థానం నిలబెట్టుకున్నాడు.  

స్థానం నిలబెట్టుకున్న నాయర్‌...  
సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ టెస్టు కెరీర్‌కు సెలక్టర్లు దాదాపు ‘ది ఎండ్‌’ కార్డ్‌ వేసినట్లే. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టులో స్థానం దక్కని రోహిత్‌ను ఆ తర్వాత అఫ్గాన్‌తో మ్యాచ్‌కు కూడా ఎంపిక చేయలేదు. ప్రస్తుత ఇంగ్లండ్‌ పర్యటనలో సాధించిన రెండు సెంచరీలు టెస్టు జట్టులో చోటుకు పనికి రాలేదు. మిడిలార్డర్‌లో కరుణ్‌నాయర్‌ తన స్థానం నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం నాయర్‌ భారత ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లోనే మ్యాచ్‌లు ఆడుతున్నాడు.  

తొలి టెస్టుకు బుమ్రా దూరం... 
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గాయపడి టీమ్‌కు దూరమైన జస్‌ప్రీత్‌ బుమ్రా రెండో టెస్టు సమయానికి కోలుకుంటాడని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. అయితే భువనేశ్వర్‌ కుమార్‌ గాయం ఆందోళన కలిగిస్తోంది. అతడి పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారని, టెస్టు జట్టులోకి తీసుకోవాలా లేదా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న భువీ పూర్తిగా కోలుకోకుండానే మూడో వన్డే బరిలోకి దిగినట్లు సమాచారం. ఇప్పుడు అది మరింత తీవ్రంగా మారితే పూర్తిగా సిరీస్‌కు దూరం కావచ్చు. 2014 పర్యటనలో 19 వికెట్లతో భువీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. 

రిషభ్‌ ఆడగలడా..!
దేశవాళీ క్రికెట్‌లో ప్రత్యర్థి బౌలర్లను చితక్కొట్టిన తీరు 21 ఏళ్ల రిషభ్‌ పంత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వెంటనే అవకాశాలు తెచ్చిపెట్టింది. రెండేళ్ల క్రితం ఒకే సీజన్‌ రంజీ ట్రోఫీలో మెరుపు ట్రిపుల్‌ సెంచరీతో పాటు 48 బంతుల్లోనే సెంచరీ సాధించినా... సుదీర్ఘ ఫార్మాట్‌కు సంబంధించి అతను ఇంకా ఓనమాల దశలోనే ఉన్నాడనేది క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయం. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చెప్పుకోదగ్గ మ్యాచ్‌లు ఆడని పంత్‌ వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం కూడా ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉందని వారు అంటున్నారు. ప్రస్తుతం భారత ‘ఎ’ తరఫున ఆడుతున్న పంత్‌... నిజానికి నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి చాయిస్‌ కీపర్‌ కూడా కాదు. మొదటి మ్యాచ్‌లో శ్రీకర్‌ భరత్‌ కీపింగ్‌ చేశాడు. గత ఏడాది దక్షిణాఫ్రికా ‘ఎ’ పర్యటనలో ఘోరంగా విఫలమైన పంత్, 2017–18 రంజీ సీజన్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అతని వయసు చాలా చిన్నదే కాబట్టి మున్ముందు అవకాశాలు దక్కవచ్చని అంతా భావించారు. అయితే ఇప్పుడు కార్తీక్‌కు బ్యాకప్‌గా మరో కీపర్‌ అవసరం ఉండటంతో పంత్‌ను ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా సీనియర్‌ పార్థివ్‌ పటేల్‌కు అవకాశం ఇచ్చారు. ఇదే ఏడాది ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉండటంతో మళ్లీ వెనుదిరిగి చూడకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పంత్‌ ఎంపిక జరిగింది. మొత్తంగా పంత్‌ ఎంపికతో సెలక్టర్లు సాహసం చేసినట్లే. 22 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 54.16 సగటుతో 1625 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, మురళీ విజయ్,  రాహుల్, పుజారా, రహానే, కరుణ్‌ నాయర్, దినేశ్‌ కార్తీక్, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్, జడేజా, కుల్దీప్, ఇషాంత్, షమీ, ఉమేశ్, బుమ్రా, శార్దుల్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement