
సరి సమానంగా..!
తొలి రోజు భారత్ 319/6
లోకేశ్ రాహుల్ సెంచరీ
రాణించిన రోహిత్, కోహ్లి
శ్రీలంకతో రెండో టెస్టు
టాస్ గెలిచారు కానీ 12 పరుగులకే 2 వికెట్లు... భారీ భాగస్వామ్యం దక్కింది కానీ ఇన్నింగ్స్‌లో తడబాటు... మరో రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు వచ్చాయి కానీ ఆఖరి ఓవర్‌లో వికెట్ నష్టం... రెండో టెస్టు తొలి రోజు భారత్ పరిస్థితి ఇది. ముగ్గురు బ్యాట్స్‌మెన్ రాణించి, ముగ్గురు విఫలమైన చోట కోహ్లిసేన చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. రెండో రోజు లోయర్ ఆర్డర్ కూడా తలా ఓ చేయి వేస్తే భారత్ మరింత మెరుగైన స్థితిలో నిలుస్తుంది. మరోవైపు ప్రత్యర్థికి 300కు పైగా పరుగులు చేసే అవకాశం ఇచ్చినా... ఆరు వికెట్లు లంకకు ఊరటనిచ్చాయి. మొత్తానికి సంగక్కర చివరి టెస్టు తొలి రోజే ఆసక్తికర మలుపులతో సాగింది.
కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టును భారత్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. గురువారం ఇక్కడి సారా ఓవల్ మైదానంలో ఆరంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 87.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (190 బంతుల్లో 108; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ (132 బంతుల్లో 79; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫామ్‌లోకి రాగా... విరాట్ కోహ్లి (107 బంతుల్లో 78; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి బంతికి రోహిత్ అవుట్ కాగా... వృద్ధిమాన్ సాహా (19 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నాడు. రాహుల్, కోహ్లి మూడో వికెట్‌కు 164 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో ప్రసాద్, హెరాత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
తొలి సెషన్ తడబడిన భారత్
ఓవర్లు: 26
పరుగులు: 97
వికెట్లు: 2
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. గాయంతో సిరీస్‌కు దూరమైన ధావన్ స్థానంలో విజయ్ జట్టులోకి రాగా... హర్భజన్, ఆరోన్‌లను తప్పించి బిన్నీ, ఉమేశ్‌లకు అవకాశం ఇచ్చారు. మ్యాచ్ నాలుగో బంతికే దమ్మిక ప్రసాద్ షాక్ ఇచ్చాడు. విజయ్ (0)ను ఎల్బీగా అవుట్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనూహ్యంగా మూడో స్థానంలో బరిలోకి దిగిన రహానే (4)ను కూడా ప్రసాద్ పెవిలియన్ పంపించడంతో భారత్ స్కోరు 12/2కు చేరింది. ఈ దశలో రాహుల్, కోహ్లి కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 11 పరుగుల వద్ద గల్లీలో ముబారక్ క్యాచ్ వదిలేయడంతో రాహుల్ బతికిపోయాడు. ఆరంభంలో పేస్‌కు అనుకూలించిన పిచ్ ఆ తర్వాత సాధారణంగా మారిపోవడంతో వీరిద్దరు స్వేచ్ఛగా ఆడారు. లంచ్ సమయానికి ఈ జోడి 85 పరుగులు జోడించింది.
రెండో సెషన్ నిలకడగా భాగస్వామ్యం ఓవర్లు: 27, పరుగులు: 109, వికెట్లు: 1
లంచ్ తర్వాత వరుసగా తొలి మూడు ఓవర్లలో మూడు ఫోర్లు కొట్టి రాహుల్ జోరు ప్రదర్శించాడు. కోహ్లి కూడా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కోహ్లి 63 బంతుల్లో, రాహుల్ 94 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఎట్టకేలకు భారీ భాగస్వామ్యం తర్వాత హెరాత్ ఈ జంటను విడదీశాడు. స్లిప్‌లో మ్యాథ్యూస్ చక్కటి క్యాచ్ పట్టడంతో కోహ్లి వెనుదిరిగాడు. ఐదో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ ఆరంభంలోనే హెరాత్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేశాడు.
మూడో సెషన్ ఆకట్టుకున్న రోహిత్
(ఓవర్లు: 34.2, పరుగులు: 113, వికెట్లు: 3)
విరామం అనంతరం రెండో ఓవర్లోనే రాహుల్ సెంచరీ (180 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇది రెండో శతకం. అయితే ఆ తర్వాత ఎక్కువ సేపు నిలబడలేకపోయిన రాహుల్, చమీరా బౌలింగ్‌లో హుక్‌షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. నాలుగో వికెట్‌కు రాహుల్, రోహిత్ 55 పరుగులు జత చేశారు. సింగిల్స్ ఎక్కువగా తీసిన రోహిత్, 93 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు ‘రక్షకుడు’గా శ్రీలంక చేరిన స్టువర్ట్ బిన్నీ (10) ఆకట్టుకోలేకపోయాడు. ఈ దశలో సాహా, రోహిత్‌కు అండగా నిలిచాడు. అయితే భాగస్వామ్యం 52 పరుగులకు చేరిన అనంతరం చివరి ఓవర్లో రోహిత్ ఎల్బీగా అవుటయ్యాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (ఎల్బీ) (బి) ప్రసాద్ 0; రాహుల్ (సి) చండీమల్ (బి) చమీరా 108; రహానే (సి) కరుణరత్నే (బి) ప్రసాద్ 4; కోహ్లి (సి) మ్యాథ్యూస్ (బి) హెరాత్ 78; రోహిత్ (ఎల్బీ) (బి) మ్యాథ్యూస్ 79; బిన్నీ (సి) చమీరా (బి) హెరాత్ 10; సాహా (బ్యాటింగ్) 19; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (87.2 ఓవర్లలో 6 వికెట్లకు) 319.
వికెట్ల పతనం: 1-4; 2-12; 3-176; 4-231; 5-267; 6-319.
బౌలింగ్: ప్రసాద్ 20-5-72-2; మ్యాథ్యూస్ 10.2-4-17-1; చమీరా 13-0-59-1; హెరాత్ 21-2-73-2; కౌశల్ 23-2-82-0.