భారీ స్కోర్ల మ్యాచ్‌లో బ్యాట్లు శివాలెత్తాయి. బౌలర్లు విలవిల్లాడారు. ప్రేక్షకులేమో పరుగుల విలయానికి కళ్లప్పగించారు. మొదట గేల్ చితగ్గొడితే, రాహుల్ శతక్కొట్టాడు. పంజాబ్‌కు భారీస్కోరు అందించారు. తర్వాత ముంబైని కెప్టెన్ పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విజయం దిశగా నడిపించాడు. చివర్లో ఉత్కంఠ రేకెత్తినా... ముంబై లక్ష్యాన్ని పూర్తిచేసింది.
ముంబై: ప్రత్యర్థి జట్టులో ఇద్దరి మెరుపులపై ఒకే ఒక్కడి (పొలార్డ్) విధ్వంసం పైచేయి సాధించింది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 3 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (64 బంతుల్లో 100; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా... క్రిస్ గేల్ (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు.
హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసి గెలిచింది. పొలార్డ్ (31 బంతుల్లో 83; 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) రాణించాడు. షమీకి 3 వికెట్లు దక్కాయి. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో సిద్ధేశ్ లాడ్ తుది జట్టులోకి రాగా, పంజాబ్ కూడా ఒక మార్పు చేసింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో కరుణ్ నాయర్‌కు అవకాశమిచ్చింది. నాయర్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్.
గేల్ సుడిగాలి ఫిఫ్టీ
పంజాబ్ ఆట నెమ్మదిగా మొదలైంది. ఓపెనర్లు గేల్, రాహుల్ బ్యాట్ ఝళిపించేందుకు 4 ఓవర్ల సమయం పట్టింది. బెహ్రెన్‌డార్ఫ్ తొలి ఓవర్లో ఒకటే పరుగొచ్చింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో 3, బెహ్రెన్‌డార్ఫ్ మరుసటి ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్‌లో అల్లాడించిన అల్జారి జోసెఫ్ బౌలింగ్‌కు దిగాడు. 4 బంతులు బాగానే వేసినా ఐదో బంతిని రాహుల్ సిక్సర్‌గా మలచడంతో అత్యధికంగా 9 పరుగులు రాగా... నాలుగు ఓవర్లలో పంజాబ్ మొత్తం 20 పరుగులు చేసింది. ఇక ఐదో ఓవరైతే గేల్ శివతాండవంతో నాలుగుసార్లు బంతి బౌండరీని దాటింది. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో మొదట రాహుల్ ఓ పరుగుతీశాడు. తర్వాత గేల్ 6, 6, 0, 4, 6తో ఏకంగా 23 పరుగులొచ్చాయి.
జట్టు స్కోరు ఆరుబంతుల వ్యవధిలోనే 43/0కు చేరుకుంది. అల్జారి బౌలింగ్‌నూ రాహుల్ తేలిగ్గా ఎదుర్కొన్నాడు. 6, 4తో జోరుపెంచాడు. ఓపెనింగ్ ఊపుమీదున్న ఈ దశలో లెగ్‌స్పిన్నర్ రాహుల్ చహర్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో 8వ ఓవర్లో 6 పరుగులే వచ్చాయి. కానీ మరుసటి ఓవర్లో సుడి‘గేల్’ 6, 4, 4 తాకిడితో పరుగుల హోరు పెరిగింది. తొలి సగం (10) ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోని కింగ్స్ 93 పరుగులు చేసింది. 11వ ఓవర్లో భారీ సిక్సర్‌తో గేల్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తయ్యింది. జట్టు స్కోరు వందకు చేరింది. కాసేపటికే రాహుల్ కూడా 41 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. బౌండరీలకు తెగబడుతున్న గేల్ విధ్వంసానికి బెహ్రెన్‌డార్ఫ్ చెక్ పెట్టడంతో 116 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
రాహుల్ తొలి శతకం
గేల్ నిష్క్రమణ తర్వాత పంజాబ్ స్కోరు వేగం తగ్గింది. స్వల్ప వ్యవధిలో మిల్లర్ (7), కరుణ్ నాయర్ (5)లను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. 14 నుంచి 17వరకు నాలుగు ఓవర్లలో పంజాబ్ కేవలం 26 పరుగులే చేసింది. మళ్లీ 18వ ఓవర్ నుంచి పంజాబ్ మెరుపులు మొదలయ్యాయి. బుమ్రా వేసిన ఈ ఓవర్లో కరన్ రెండు వరుస ఫోర్లు కొట్టి ఔట్‌కాగా... రాహుల్ మరో ఔండరీ బాదాడు. 16 పరుగులు లభించడంతో జట్టు స్కోరు 150 దాటింది. ఇక మిగిలింది రెండే ఓవర్లు. రాహుల్ 69 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సెంచరీ ఆశలైతే లేవు. కానీ హార్దిక్ పాండ్యా 19వ ఓవర్లో రాహుల్ ఒక్కసారిగా చెలరేగాడు. 6, 4, 6, 6, సింగిల్‌తో 23 పరుగులు పిండుకున్నాడు. 92 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. ఈ ఓవర్లో మొత్తం 25 పరుగులు లభించాయి. ఆఖరి ఓవర్ తొలి బంతికే రాహుల్ సిక్సర్ బాదాడు. బుమ్రా రెండు బంతుల్ని డాట్‌గా వేశాడు. తర్వాత బంతికి 2 పరుగులు తీసి 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు.
ముంబై తడబాటు
తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు మెరుపు అరంభాన్నిచ్చే ప్రయత్నం చేశాడు సిద్ధేశ్ లాడ్. డికాక్‌తో కలిసి పరుగులవేటకు దిగిన అతను తొలి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో 10 పరుగులు చేశాడు. తర్వాత ఓవర్ వేసిన షమీ కేవలం మూడే పరుగులిచ్చాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను షమీ మరింత కట్టుదిట్టంగా వేశాడు. పరుగు మాత్రమే ఇచ్చి సిద్ధేశ్ (15) ఆట ముగించాడు. దీంతో సూర్యకుమార్ జతయ్యాడు. ఇద్దరు పవర్ ప్లేలో మరో వికెట్ పడకుండా సరిగ్గా జట్టు స్కోరును 50 పరుగులకు చేర్చారు. భారీ లక్ష్యం ముందుండగా... మెరుపుల్లేకుండా సాగుతున్న ముంబై ఇన్నింగ్స్‌ను వరుస ఓవర్లలో కరన్, అశ్విన్ దెబ్బతీశారు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సూర్యకుమార్ (15 బంతుల్లో 21; 4 ఫోర్లు)ను కరన్ ఔట్ చేయగా, మరుసటి ఓవర్లో డికాక్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు)ను అశ్విన్ బోల్తాకొట్టించాడు.
పొలార్డ్ విధ్వంసం
ముంబై తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 65 పరుగులు చేసింది. మిగతా సగం ఓవర్లలో ఇంకా 133 పరుగులు చేయాలి. అంటే ఓవర్‌కు 13 పరుగులకు మించి చేయాల్సిందే. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ పొలార్డ్ బ్యాట్‌కు పనిచెప్పాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కరన్ బౌలింగ్‌లో 6, 4, 6తో 18 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి పొలార్డ్ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి బౌలర్‌కు సమీపంలో ఉన్నా... లేని పరుగుకు ప్రయత్నించి ఇషాన్ కిషన్ (7) రనౌటయ్యాడు. కెప్టెన్‌కు హార్దిక్ పాండ్యా జతయ్యాడు. ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. ఈ జోడి 3 ఓవర్లలో 41 పరుగులు చేసింది. 15 ఓవర్లలో జట్టు స్కోరు 135/5. ఇక ఆఖరి 30 బంతుల్లో ముంబై విజయానికి 63 పరుగులు కావాలి. ఈ దశలో 16వ ఓవర్‌ల్లో పాండ్యా బ్రదర్స్‌ను షమీ పెవిలియన్ చేర్చాడు.
షమీ తొలి బంతికి హార్దిక్ (19; 2 ఫోర్లు), నాలుగో బంతికి కృనాల్ (1) వెనుతిరిగారు. ఇక ముంబై ఆశలు పొలార్డ్‌పైనే పెట్టుకుంది. అల్జారి జోసెఫ్ (15 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి భారీ సిక్సర్లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 22 బంతుల్లోనే (1 ఫోర్, 7 సిక్స్‌లు) అర్ధసెంచరీని పూర్తి చేసుకున్న పొలార్డ్... కరన్ వేసిన 19వ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. 12 బంతుల్లో 32 పరుగులు చేయాల్సి వుండగా... ఈ ఓవర్లో ఫోర్, 2 సిక్స్‌లతో 17 పరుగులు సాధించాడు. ఇక ఆఖరి 6 బంతులకు 15 పరుగులు కావాలి. అంకిత్ రాజ్‌పుత్ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతి నోబాల్ కాగా పొలార్డ్ సిక్సర్‌గా మలిచాడు. మరుసటి బంతి బౌండరీకి వెళ్లింది. దీంతో ఐదు బంతులకు 4 పరుగులు చేస్తే సరిపోతుంది. ఈ దశలో పొలార్డ్ ఔట్ కాగా... ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సివుండగా అల్జారి మిడాన్‌లో షాట్ కొట్టి చకచకా 2 పరుగులు పూర్తి చేయడంతో ముంబై గెలిచింది.
రోహిత్ శర్మకు గాయం
పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు రోజు మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ కుడి కాలి కండరాలు పట్టేశాయి. అతను కోలుకున్నా... ముందు జాగ్రత్తగా ముంబై ఇండియన్స్ అతడికి విశ్రాంతినిస్తూ పంజాబ్‌తో మ్యాచ్‌లో పక్కన పెట్టింది. ఐపీఎల్‌లో రోహిత్ మ్యాచ్‌కు దూరం కావడం ఇది రెండోసారి మాత్రమే. 2011నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రోహిత్ వరుసగా 133 మ్యాచ్‌ల తర్వాత మొదటిసారి బరిలోకి దిగలేదు. అంతకు ముందు దక్కన్ చార్జర్స్ తరఫున ఆడిన మూడేళ్లలో అతను ఒక మ్యాచ్ ఆడలేదు. రోహిత్ స్థానంలో ఈ మ్యాచ్ లో సిద్ధేశ్ లాడ్‌కు అవకాశం దక్కింది. సిద్ధేశ్ తండ్రి దినేశ్ లాడ్...రోహిత్‌కు చిన్ననాటి కోచ్ కావడం విశేషం. 2015 ఐపీఎల్‌లోనే సిద్ధేశ్‌ను తీసుకున్న ముంబై ఇండియన్స్ నాలుగేళ్ల పాటు జట్టుతో ఉంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. అతనికి ఐపీఎల్‌లో ఇదే మొదటి మ్యాచ్.
Comments
Please login to add a commentAdd a comment