
వరుణుడు కరుణిస్తేనే...
నేటి నుంచి భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్
కొలంబో : శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌కు ముందు భారత్‌కు ఒకే ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. శ్రీలంక ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో ఈ మూడు రోజుల మ్యాచ్ గురువారం నుంచి జరగనుంది. అయితే కొలంబోలో ప్రతి రోజూ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో వరుణుడు కరుణిస్తేనే కోహ్లి సేనకు ప్రాక్టీస్ లభిస్తుంది. మ్యాచ్ జరిగే మూడు రోజూలూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.
శ్రీలంకతో తొలి టెస్టుకు తుది జట్టును ఎంచుకునే విషయంలో భారత్‌కు ఇప్పటికైతే స్పష్టత లేదు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో ఐదుగురు బౌలర్ల వ్యూహం అనుసరించాలనేది కోహ్లి ఆలోచన. అయితే బ్యాటింగ్ విభాగంలో తుది జట్టులో ఎవరు ఉండాలి? ఎవరు ఫామ్‌లో ఉన్నారనే విషయం తెలుసుకోవడానికి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ మంచి అవకాశం. 12 నుంచి శ్రీలంకతో తొలి టెస్టు జరుగుతుంది. ఎన్ని ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొన్నా... పరిస్థితులు, వాతావరణానికి అలవాటు పడాలంటే ఓ మ్యాచ్ ఆడాలి. శిఖర్ ధావన్, మురళీ విజయ్ ఓపెనర్లుగా తుది జట్టులో ఉండటం ఖాయమే అయినా... లోకేశ్ రాహుల్ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పుజారా, రాహుల్‌లకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు తిరిమన్నె సారథ్యం వహిస్తున్నాడు. తరంగ, కుశాల్ సిల్వ, కుశాల్ పెరీరా, గమగే లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఈ జట్టులో ఉన్నారు. కాబట్టి మ్యాచ్ జరిగితే కోహ్లి సేనకు మంచి ప్రాక్టీస్ లభిస్తుంది.
ప్రపంచంలో నిలకడగా టెస్టు విజయాలు సాధించే జట్లన్నీ ఐదుగురు బౌలర్లతోనే ఆడతాయి. బాగా బౌలింగ్ చేయగల ఓ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఉంటే నలుగురు బౌలర్లు సరిపోతారు. కాబట్టి ఐదుగురు బౌలర్ల కోహ్లి ఆలోచన మంచిదే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడగల నైపుణ్యం ఉన్న క్రికెటర్లు జట్టులో ఉన్నారు. కాబట్టి శ్రీలంకతో సిరీస్‌లో విజయంపై ఆత్మవిశ్వాసంతో ఉన్నాం.
-భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
పీతల కూర బాగుంది
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మంగళవారం రాత్రి కొలంబోలో తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని భోజనం తిన్నాడట. శ్రీలంక దిగ్గజాలు మహేళ జయవర్ధనే, కుమార సంగక్కర కలిసి అక్కడ ఓ రెస్టారెంట్ నడుపుతున్నారు. అందులో పీతలతో రకరకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ఈ దిగ్గజాలు ఇద్దరూ కోహ్లికి తమ రెస్టారెంట్‌లో విందు ఇచ్చారు. అందులో తిన్న పీతల కూర అద్భుతమంటూ విరాట్ ట్వీట్ చేశాడు.