సంధి కాలం కాదు... సత్తా చాటాల్సిన సమయం! | Head Coach Gautam Gambhir's Press Conference Highlights Before India's Tour To Australia, Check Out More Insights | Sakshi
Sakshi News home page

సంధి కాలం కాదు... సత్తా చాటాల్సిన సమయం!

Published Tue, Nov 12 2024 7:42 AM | Last Updated on Tue, Nov 12 2024 9:14 AM

Head Coach Gautam Gambhir's Press Conference Before India's Tour To Australia

బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌పై గంభీర్‌ ఆశాభావం

సీనియర్లు రాణిస్తారని విశ్వాసం 

తనపై ఒత్తిడి లేదన్న భారత హెడ్‌ కోచ్‌

ఆస్ట్రేలియాకు బయలుదేరిన టీమిండియా  

సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో అనూహ్యంగా చిత్తయిన తర్వాత భారత క్రికెట్‌ జట్టు అతి పెద్ద సమరానికి సిద్ధమైంది. ఐదు టెస్టుల బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా ఆ్రస్టేలియాకు బయలదేరింది. స్వదేశంలో ప్రదర్శన తర్వాత జట్టుపై అంచనాలు తక్కువగానే ఉన్నా... కంగారూ గడ్డపై గత రెండు సిరీస్‌లూ నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించిన తమ ఆటతీరు స్ఫూర్తిగా కొత్త ఆశలు రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఓటమిని మరచి ఆసీస్‌పై సత్తా చాటుతామని హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ చెబుతున్నాడు. రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వచ్చి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తారని అతను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. విరాట్‌ కోహ్లితో కలిపి జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు ముందే ఆ్రస్టేలియాకు చేరుకోగా... కెపె్టన్‌ రోహిత్‌ శర్మ మినహా మిగతా వారంతా సోమవారం బయలుదేరి వెళ్లారు. నవంబర్‌ 22 నుంచి పెర్త్‌లో తొలి టెస్టు జరుగుతుంది.   

ముంబై: భారత జట్టు సంధి దశలో ఉందా లేదా అనే విషయాన్ని తాను పట్టించుకోనని, ప్రస్తుతానికి ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌పైనే తన దృష్టి ఉందని భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పష్టం చేశాడు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌íÙప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరే అంశాన్ని కూడా పట్టించుకోవడం లేదని అతను వ్యాఖ్యానించాడు. కోచ్‌గా తనపై ఎలాంటి ఒత్తిడీ లేదన్న గంభీర్‌ ఆ్రస్టేలియాకు బయలుదేరే ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. విశేషాలు అతని మాటల్లోనే... 

కోచ్‌గా ఒత్తిడి ఎదుర్కోవడంపై... 
న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపై నన్ను విమర్శించ డంలో తప్పు లేదు. వాటిని స్వీకరించేందుకు నేను సదా సిద్ధం. మా ఓటమికి సాకులు వెతకడం లేదు. కివీస్‌ అన్ని రంగాల్లో చాలా బాగా ఆడింది. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియాలో నాపై విరుచుకుపడటంలో అర్థం లేదు. దాని వల్ల మా జీవితాల్లో ఏమైనా తేడా వస్తుందా? నేను ఈ బాధ్యతలు తీసుకున్నప్పుడే చాలా కష్టమైన పని అని తెలుసు. ఒత్తిడి బాగా ఉంటుందనేది కూడా తెలుసు. నా బాధ్యతను నేను నిజాయితీలో నిర్వర్తిస్తున్నా. కాబట్టి ఒత్తిడి నాకు సమస్య కాదు. భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా.  

రోహిత్, కోహ్లి ఫామ్‌పై... 
ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్ల ఫామ్‌పై ఎలాంటి ఆందోళన లేదు. వారిద్దరూ మానసికంగా చాలా దృఢమైన వారు. ఇప్పటికే భారత్‌ తరఫున ఎంతో సాధించిన వారిద్దరు మరిన్ని ఘనతలకు సిద్ధంగా ఉన్నారు. వారిలో ఇంకా ఎంతో తపన మిగిలి ఉంది. దాని కోసం చాలా కష్టపడుతున్నారు. గత సిరీస్‌ వైఫల్యం తర్వాత పరుగులు సాధించాలనే కసి వారిలో కనిపిస్తోంది. దేశం తరఫున వారి అంకితభావాన్ని ఎప్పుడూ ప్రశి్నంచవద్దు. ఇది పూర్తిగా కొత్త సిరీస్‌. కాబట్టి అక్కడ బాగా ఆడి సిరీస్‌ గెలవడమే అందరి లక్ష్యం. 

టీమిండియా సంధి దశపై... 
ఎంతో సాధించాలనే ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో మా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నారు. జట్టుకు సంబంధించి ఇది సంధి కాలం అనే మాటను నేను నమ్మను. బయటి వారు ఎలా అనుకున్నా నేను అలాంటి పదాలను వాడను. పేరు ఏం పెట్టుకున్నా మార్పు అనేది సహజం. గతంలోనూ భారత జట్టులో ఇలాంటివి జరిగాయి కాబట్టి ఇక ముందూ జరుగుతాయి. నా ధ్యాసంతా ప్రస్తుతం ఆ్రస్టేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌పైనే ఉంది. ఇప్పుడు నాకు అన్నింటికంటే అదే ముఖ్యం.  

ఆసీస్‌లో పరిస్థితులపై... 
మా ముందు అన్నింటికంటే పెద్ద సవాల్‌ అక్కడి పరిస్థితులకు అలవాటు పడటమే. వచ్చే పది రోజులు అందుకే చాలా కీలకం. ఈ సమయంలో తగిన విధంగా సన్నద్ధమైతే తొలి మ్యాచ్‌కు ముందు అంతా బాగుంటుంది. గతంలో ఆ్రస్టేలియాలో ఆడిన అనేక మంది అనుభవజు్ఞలు జట్టులో ఉండటం సానుకూలాంశం. వారి అనుభవం యువ ఆటగాళ్లకు కూడా పనికొస్తుంది. ఈ పది రోజులు సన్నాహాలు బాగా సాగితే 22న ఉదయం తొలి బంతి నుంచే చెలరేగిపోయే అవకాశం ఉంటుంది. వారు ఎలాంటి పిచ్‌లు ఇస్తారనేది అనవసరం. మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. పిచ్‌ ఎలా ఉన్నా మా సామర్థ్యానికి తగినట్లు ఆడితే ఎవరినైనా ఓడించగలం.  

జట్టులోని యువ ఆటగాళ్లపై... 
గతాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్లడం అవసరం కాబట్టి అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వీరిని ఎంపిక చేశారు. విజయానికి ఉపయోగపడగలరనే నమ్మకంతో అత్యుత్తమ జట్టునే ఎంపిక చేశాం. వ్యక్తిగత రికార్డులకంటే జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని జూనియర్లకు గట్టిగా చెప్పాను. నితీశ్‌ కుమార్‌ రెడ్డి మంచి ప్రతిభావంతుడు. అవకాశం లభిస్తే అతను సత్తా చాటగలడు. సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు పేసర్లు అలసట లేకుండా ఉండాలనే కారణంతోనే హర్షిత్‌ రాణాను ‘ఎ’ జట్టుతో పంపలేదు. రంజీ ట్రోఫీలో అతను తగినంత బౌలింగ్‌ కూడా చేశాడు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ఐదుగురు పేసర్లూ భిన్నమైన శైలి కలవారు కాబట్టి బౌలింగ్‌లో మంచి పదును ఉంది.   

ఓపెనర్‌గా రాహుల్‌! 
కెప్టెన్  రోహిత్‌ శర్మ తొలి టెస్టు ఆడటంపై ఇంకా సందేహాలు ఉన్నాయి. మ్యాచ్‌ సమయానికే దీనిపై స్పష్టత వస్తుంది. అయితే ఓపెనర్‌గా భారత్‌కు తగినన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని గంభీర్‌ చెప్పాడు. అయితే అభిమన్యు ఈశ్వరన్‌తో పోలిస్తే అనుభవజ్ఞుడైన రాహుల్‌కే అవకాశం దక్కవచ్చని పరోక్షంగా వెల్లడించాడు. ‘అటు ఓపెనర్‌గా, ఇటు మిడిలార్డర్‌లోనూ ఆడగలిగే సామర్థ్యం ఉన్న బ్యాటర్లు ప్రపంచ క్రికెట్‌లో చాలా తక్కువ మంది ఉంటారు. రాహుల్‌ అలాంటి వారిలో ఒకడు. తనకు ఏ బాధ్యత అయినా అప్పగించవచ్చు’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement