‘ఢిల్లీ బాయ్స్’ కోహ్లి, గంభీర్ సరదా సంభాషణ
చెన్నై: మైదానంలో దూకుడైన స్వభావానికి వారిద్దరు చిరునామా... ఆటతోనే కాకుండా ప్రత్యర్థులపై మాటలతో దూసుకుపోయేందుకు ఎవరూ వెనుకాడరు... భారత ఆటగాళ్లుగా ఇతర జట్లతో తలపడిన సందర్భాలే కాదు... ఒకరికొకరు కూడా ఆవేశంతో మాటా మాటా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అలాంటివి అభిమానులు చూశారు.
అలాంటివారు ఒకరు ప్లేయర్‌గా, మరొకరు అదే జట్టుకు కోచ్‌గా కలిసి భారత జట్టును నడిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ‘ఢిల్లీ బాయ్స్’ విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్‌ల మధ్య ఆసక్తకర సంభాషణ జరిగింది. తామిద్దరి మధ్య ఏదో వైరం ఉందంటూ మసాలా వార్తలు రాసుకునే వారికి ఈ సంభాషణ తర్వాత అలాంటి అవకాశం ఉండదని వారు ఈ ‘బీసీసీఐ’ వెబ్‌సైట్ రూపొందించిన వీడియోలో చెప్పేశారు.
» మైదానంలో బ్యాటింగ్ సమయంలో దూషణలకు దిగితే అది బ్యాటింగ్‌పై ప్రభావం చూపి అవుటవుతారా లేక మరింత దూకుడుగా ఆడి ఆధిపత్యం ప్రదర్శించవచ్చా అని గంభీర్‌ను కోహ్లి అడిగాడు. దీనిపై గంభీర్ ‘ఇలాంటి తరహా అనుభవాలు నాకన్నా నీకే ఎక్కువగా ఉన్నాయి. నువ్వే బాగా చెప్పగలవు’ అని సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరిశాయి. ‘ఇది తప్పు కాదు. ఇలా చేయవచ్చు అని నాకు మద్దతిస్తావని ఆశించా’ అంటూ కోహ్లి బదులిచ్చాడు. తన విషయంలో ఆ తరహా దూకుడు బాగా పని చేసిందని గంభీర్ అన్నాడు.
» మెదానంలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాల్లో దైవభక్తి బాగా పని చేసిందని ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. తాను న్యూజిలాండ్‌పై నేపియర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న సమయంలో ‘హనుమాన్ చాలీసా’ పారాయణం చేసినట్లు గంభీర్ చెప్పగా... అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసినప్పుడు ‘ఓం నమఃశివాయ’ అంటూ వచ్చానని కోహ్లి వెల్లడించాడు.
» 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన క్షణాల వీడియో చూస్తుండటంతో వీరి సంభాషణ మొదలైంది. ఢిల్లీ గ్రౌండ్‌లో గంభీర్‌ను చూసి తాను ఎలా కెరీర్‌లో ఎదగాలో స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని కోహ్లి చెప్పగా... కెరీర్ ఆరంభంలో కోహ్లి ఆడిన కొన్ని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లపై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. అనంతరం ఈ చర్చ భారత టెస్టు క్రికెట్ వైపు మళ్లింది.
ఒక ఆటగాడి గొప్పతనాన్ని గుర్చించేందుకు టెస్టు క్రికెట్ మాత్రమే అసలైన వేదిక అని ఇద్దరూ అభిప్రాయ పడ్డారు. భారత జట్టు బ్యాటింగ్‌లో చాలా కాలంగా బలంగా ఉందని... అయితే బౌలింగ్‌ను శక్తివంతంగా మార్చి బౌలర్ల ద్వారా మ్యాచ్‌లను గెలిపించిన ఘనత కెపె్టన్‌గా కోహ్లిదేనని గంభీర్ వ్యాఖ్యానించాడు. రాబోయే తరంలో టెస్టులను ఇష్టపడేలా ఆటగాళ్లను ప్రోత్సహించాల్సిన బాధ్యత తమపై ఉందని వీరిద్దరు అభిప్రాయపడ్డారు.
» లక్ష్య ఛేదన అంటేనే తనకు ఇష్టమని, తాను చేయాల్సిన పనిపై స్పష్టత ఉంటుందని కోహ్లి అన్నాడు. ఒక ఆటగాడు సొంత మైలురాళ్ల గురించి ఆలోచించకుండా టీమ్ కోసం ఏం కావాలో ఆలోచిస్తేనే ఛేదన సులువై జట్టుకు విజయాలు లభిస్తాయని గంభీర్ విశ్లేషించాడు. వరల్డ్ కప్ ఫైనల్లో తాను సెంచరీ గురించి ఆలోచించనే లేదని, అవుటైనప్పుడు కూడా ప్రత్యర్థి కోలుకునే అవకాశం ఇవ్వడం పట్ల బాధపడ్డానని గంభీర్ వివరించాడు.
» తర్వాతి అతిథి రోహిత్ శర్మ అయితే ఏం ప్రశ్న వేయాలని గంభీర్ అడగ్గా... ఉదయమే నానబెట్టిన బాదం పలుకులు తిన్నావా లేదా అని అడగాలని (అతని మతిమరపును గుర్తు చేస్తూ)... ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకు రమ్మంటే రాత్రి 11 గంటలకు వస్తాడని కోహ్లి చెప్పడంతో నవ్వులతో సంభాషణ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment