భారత్ రెండో ఇన్నింగ్స్ 231/3
ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా
రోహిత్ శర్మ, కోహ్లి అర్ధ సెంచరీలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 ఆలౌట్
రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీ
టిమ్ సౌతీ మెరుపు ఇన్నింగ్స్
అనూహ్య తడబాటు నుంచి కోలుకున్న టీమిండియా... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఎదురీదుతోంది. బ్యాటింగ్‌కు అనువుగా మారిన బెంగళూరు పిచ్‌పై ప్రత్యర్థి భారీ స్కోరు చేయగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిస్తున్నారు. రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ, టిమ్ సౌతీ సమయోచిత ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ రాణించింది. రోహిత్, కోహ్లి, సర్ఫరాజ్ అర్ధ శతకాలతో టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది. మూడో రోజు ఇన్నింగ్స్ చివరి బంతికి విరాట్ కోహ్లిను అవుట్ చేసి న్యూజిలాండ్ పైచేయి సాధించగా... కోహ్లి పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కాలంటే మిగిలిన బ్యాటర్లు విశేషంగా రాణించాల్సి ఉంటుంది.
బెంగళూరు: తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గట్టిగానే పోరాడుతోంది. ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కిన ఈ మ్యాచ్‌లో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. 356 పరుగులతో వెనుకబడి శుక్రవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి (70; 8 ఫోర్లు, ఒక సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 70 బ్యాటింగ్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 52; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... యశస్వి జైస్వాల్ (35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 125 పరుగులు చేయాలి.
క్రీజులో ఉన్న సర్ఫరాజ్‌తోపాటు ఇంకా రావాల్సిన కేఎల్ రాహుల్, పంత్, జడేజా, అశ్విన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ కోలుకోవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 180/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 91.3 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (157 బంతుల్లో 134; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు. మాజీ కెపె్టన్ టిమ్ సౌతీ (73 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రచిన్‌కు అండగా నిలిచాడు.
చివరి బంతికి కోహ్లి అవుట్...
తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ భారత టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడింది. యశస్వి, రోహిత్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చడంతో టీమిండియాకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాక జైస్వాల్ అవుట్ కాగా... కాసేపటికి అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్ కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఎజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లాయి.
మరోసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి చకచకా పరుగులు చేస్తూ... ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కోహ్లి 70 బంతుల్లో ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో చివరి బంతికి కోహ్లి అవుటవ్వడంతో భారత జట్టుకు నిరాశ తప్పలేదు.
ఆ భాగస్వామ్యం లేకుంటే...
భారత సంతతి ఆటగాడు రచిన్... కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది.
మిచెల్ (18), బ్లండెల్ (5), ఫిలిప్స్ (14), హెన్రీ (8) విఫలమవడంతో కివీస్ జట్టు 233/7తో నిలిచింది. కాసేపట్లో కివీస్ ఆలౌట్ కావడం ఖాయమే అనుకుంటే... సౌతీ సహకారంతో రచిన్ రెచ్చిపోయాడు. ఎనిమిదో వికెట్‌కు 137 పరుగులు జోడించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
4 టెస్టు క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) ముందున్నారు. ఓవరాల్‌గా ఈ మైలురాయి దాటిన 18వ ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధించాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 15; కాన్వే (బి) అశి్వన్ 91; యంగ్ (సి) కుల్దీప్ (బి) జడేజా 33; రచిన్ (సి) (సబ్) జురేల్ (బి) కుల్దీప్ 134; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 18; బ్లండెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 5; ఫిలిప్స్ (బి) జడేజా 14; హెన్రీ (బి) జడేజా 8; సౌతీ (సి) జడేజా (బి) సిరాజ్ 65; ఎజాజ్ (ఎల్బీ) కుల్దీప్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (91.3 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–67, 2–142, 3–154, 4–193, 5–204, 6–223, 7–233, 8–370, 9–384, 10–402. బౌలింగ్: బుమ్రా 19–7–41–1, సిరాజ్ 18–2–84–2, అశ్విన్ 16–1–94–1, కుల్దీప్ 18.3–1–99–3, జడేజా 20–1–72–3.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లండెల్ (బి) ఎజాజ్ 35; రోహిత్ (బి) ఎజాజ్ 52; కోహ్లి (సి) బ్లండెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (బ్యాటింగ్) 70; ఎక్స్ ట్రాలు 4; మొత్తం (49 ఓవర్లలో 3
వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231. బౌలింగ్: సౌతీ 7–1–22–0; హెన్రీ 11–1–52–0; రూర్కే 11–1–48–0; ఎజాజ్ 12–2–70–2; ఫిలిప్స్ 8–1–36–1.
Comments
Please login to add a commentAdd a comment