కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపల్ షాపులు
ఎమ్మినూరు పట్టణ నడిబొడ్డున సోమప్ప సర్కిల్‌లో మున్సిపల్ క్యాంటీన్‌ను లీజుకు తీసుకొన్న ఓ టీడీపీ నేత మున్సిపాలిటీకి జీఎస్టీతో కలిపి రూ.27వేలు అద్దె చెల్లిస్తున్నాడు. దానిని పార్టులుగా విభజించి రెండు బట్టల దుకాణాలు, ఓ హోటల్, రెండు డబ్బా అంగళ్లు, స్ట్రీట్ వ్యాపారాలకు సబ్‌లీజుకిచ్చి నెలనెల రూ.1.5 లక్షలకుపైగా అదనపు ఆదాయం పొందుతున్నాడు. సుమారు రూ.20 లక్షలకుపైగా అడ్వాన్సు రూపంలో పొందాడు.
కూరగాయల మార్కెట్‌గేటు దగ్గర ఓ బడావ్యక్తి మున్సిపల్ షాపును లీజుకు తీసుకొని మున్సిపాలిటీకి నెలకు రూ.4,300 అద్దె చెల్లిస్తున్నాడు. అదే షాపును రెండు పార్టులుగా విభజించి సబ్‌లీజుకివ్వటంతో ఆ వ్యక్తికి నెలకు రూ.65 వేలకుపైగా ఆదాయం అందుతోంది. ఇలా బినామిలతో మున్సిపల్ షాపులను తమ గుప్పెట్లో ఉంచుకున్నవారు 40 శాతంపైగానే ఉన్నట్లు మున్సిపల్ అధికారుల పరిశీలనలో తేలింది. మున్సిపల్ షాపుల్లో బినామిలదే అగ్రతాంబూలం.
కర్నూలు, ఎమ్మిగనూరు: లీజు గడువు ముగిసిన షాపుల వేలాలు వేసేందుకు ఎమ్మిగనూరు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు శుక్రవారం వేలాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజకీయ, వ్యాపార దళారులకు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకొనేందుకు పావులు కదిపినట్లు సమాచారం. గతంలో తక్కువ అద్దెకు లీజు దక్కించుకొని సబ్ లీజులకిచ్చి మున్సిపల్ ఆదాయానికి గండికొట్టిన వ్యక్తులకే మళ్లీ షాపులు దక్కేలా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అందుకు నజరానాగా రూ.1.2 కోట్లకుపైగా దళారులు వసూలు చేసినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ఇందులో మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కూడా వాటా ఉందనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.
రూ.లక్షకు తగ్గిన గుడ్‌విల్..
ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని ఏ,బీ,సీ బ్లాక్‌లలోని 49 షాపులకు, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్‌లలోని 19 షాపులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. 25 ఏళ్ల లీజుగడువు పూర్తయిన ఏ, బీ, సీ బ్లాక్‌లోని షాపులకు మళ్లీ వేలాలు నిర్వహించాలని 2007లోనే మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ షాపుల లీజుదారులు హైకోర్టులో కేసు నడిపారు. ఇటీవల మున్సిపల్ అధికారులను కలసి తాము కేసు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు వారు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వటంతో అధికారులు షాపులకు వేలాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే రాజకీయ, వ్యాపార దళారులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకొనేందుకు పావులు కదిపారు. మొదట్లో రూ.2 లక్షలను గుడ్‌విల్ పాటగా చూపుతూ వేలాలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయం భారీగా పెరుగుతోందని అందరూ భావించారు. కానీ రాజకీయ దళారులు పైరవీలు చేయటంతో రూ.2 లక్షల గుడ్‌విల్ రూ. లక్షకు తగ్గిపోయింది. సుమారు రూ.68 లక్షలు మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ప్రవేటు వ్యుక్తుల షాపుల లీజు, మున్సిపల్ షాపుల సబ్‌లీజులే రూ.30 వేలకు పైగానే ఉన్నా అధికారులు మాత్రం పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వేలాల్లో మున్సిపల్ షాపులకు మాత్రం రూ.2,000 నుంచి రూ.13,200 వరకు అద్దె నిర్ణయించారు.
వేలంపాట దక్కాలంటేఅదనంగా రూ.2 లక్షలు!
‘మున్సిపాలిటికీ చెల్లించాల్సిన గుడ్‌విల్‌ను రూ.లక్ష తగ్గించామని, షాపుల లీజులను కూడా నామినల్ రేట్లకే మార్చామని’ చెబుతూ దళారులు వసూళ్ల పర్వానికీ తెరలేపినట్లు తెలుస్తోంది. ‘వేలంపాట రోజు ఎవరిషాపు వారికే దక్కేలా ఏర్పాట్లు జరిగాయని, ఎవరైనా పోటీపడితే మున్సిపల్ అధికారులు వేలాలు వాయిదావేస్తూ పోతారని, ఎవరూ రాని సందర్భం చూసి మీకే షాపులు వచ్చేలా ఏర్పాట్లు జరిగాయంటూ ’ పేర్కొంటుండటం పట్టణంలో హాట్‌టాపిక్ అయ్యింది. ఇందుకుగాను రూ.2 లక్షలు అదనంగా ఇవ్వాలని, అన్నీ తామే చూసుకొంటామని వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. కాగా ఇంటెలిజెన్సు, ఎస్‌బీ, ఏసీబీ అధికారులు సైతం అక్రమ వసూళ్ల పర్వాన్ని ఆరాతీసి ఉన్న తాధికారులకు సమాచారం అందించడంతో మున్సిపల్ అధికారుల్లో ఆందోళన మొదలైంది.
నేడు మున్సిపల్‌షాపులకు వేలాలు
ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 68 షాపులకు శుక్రవారం వేలంపాట నిర్వహిస్తున్నారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ.లక్ష గుడ్‌విల్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆయా షాపుల లీజు అద్దెను మున్సిపల్ అధికారులు ముందుగానే నిర్ణయించారు.
అక్రమ వసూళ్లతో సంబంధం లేదు
మున్సిపల్ షాపులకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నాం. ఆశావాహులు ఎవరైనా వేలంపాటలో పాల్గొనవచ్చు. రాజకీయ దళారులు బయటచేపట్టే అక్రమ వసూళ్లతో తమకు సంబంధంలేదు. – జి.రఘునాథ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment