‘నల్లబంగారం’ ఇక జిగేల్‌! | 200 Coal Blocks Auctions in Five Years Coal India | Sakshi
Sakshi News home page

‘నల్లబంగారం’ ఇక జిగేల్‌!

Published Thu, Jan 2 2020 7:47 AM | Last Updated on Thu, Jan 2 2020 7:47 AM

200 Coal Blocks Auctions in Five Years Coal India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో అపారంగా బొగ్గు నిక్షేపాలు ఉండి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కోల్‌ ఇండియా ఒక్కటీ దేశ అవసరాల్లో అధిక శాతం తీరుస్తోంది. అయినా, అవసరానికంటే ఉత్పత్తి తక్కువగానే ఉంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా దిగుమతుల భారానికి కళ్లెం వేసేందుకు ప్రైవేటు రంగాన్ని ఇందులోకి అనుమతించాలని కేంద్ర సర్కారు లోగడే నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్ల కాలంలో 200 బొగ్గు గనులను (బ్లాకులు) వాణిజ్య ప్రాతిపదికన తవ్వితీసేందుకు వేలం వేయనుంది. గరిష్టంగా 400 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా 2024 నాటికి విద్యుత్‌ సంస్థలు బొగ్గు దిగుమతి చేసుకునే అవసరం ఉండదన్నది అంచనా. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. 

త్వరలోనే వేలం..: పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు గాను మొదటి విడతగా 40 బొగ్గు బ్లాకులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం వేలానికి తీసుకురానుంది. వీటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1–50 మిలియన్‌ టన్నుల మధ్య ఉండనుంది. వాణిజ్య బొగ్గు గనుల వేలానికి సంబంధించి బిడ్డింగ్‌ నిబంధనలను ఈ నెలాఖరుకు విడుదల చేసి, వచ్చే నెలలో భాగస్వాముల అభిప్రాయాలను స్వీకరించనున్నట్టు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వేలానికి వచ్చే బ్లాకుల్లో కొన్నింటి గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 30–50 మిలియన్‌ టన్నుల మధ్య ఉంటుందని తెలిపారు. కొన్ని బ్లాకుల్లో నిల్వల సమాచారం కచ్చితంగా గుర్తించగా, మరికొన్నింటిలో పాక్షికంగానే అది జరిగిందన్నారు. వీటి వల్ల దేశీయంగా బొగ్గు ఉత్పత్తి లోటు కొంత వరకు తీరుతుందన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో 235 మిలియన్‌ టన్నుల బొగ్గు దిగుమతులు జరిగాయి. వీటిల్లో 125 మిలియన్‌ టన్నుల మేర థర్మల్‌ బొగ్గు (54 శాతం) దిగుమతులే కావడం గమనార్హం. ఐరన్, స్టీల్‌ తయారీకి కోకింగ్‌ కోల్‌ అవసరం అవుతుంది. మన దేశంలో కోకింగ్‌ కోల్‌ లభ్యత లేనందున ఐరన్, స్టీల్‌ కంపెనీలకు దిగుమతే మార్గం. కానీ, విద్యుత్‌ తయారీకి వినియోగించే థర్మల్‌ బొగ్గును దిగుమతి చేసుకోకుండా దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవచ్చు.

ఆదాయంలో వాటా..: వేలానికి పరిగణిస్తున్న వాటిల్లో చెండిపడ–1, 2, మదన్‌పూర్‌ నార్త్, ఫతేపూర్, ఫతేపూర్‌ ఈస్ట్, మహానంది, మచ్చకట బ్లాకులు ఉన్నట్టు ఆ అధికారి వెల్లడించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి నిర్దేశిత వాటాను లీజుదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈ బొగ్గు బ్లాకుల ఉత్పత్తిని త్వరగా ఆరంభించేందుకు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనుంది. నాలుగు, ఐదో దశ వేలంలో పరిశ్రమల నుంచి స్పందన ఆశించిన మేర లేదు. దీంతో మాజీ సీవీసీ ప్రత్యూష్‌ సిన్హా సిఫారసుల మేరకు ఆదాయంలో వాటా ప్రాతిపదికన బొగ్గు బ్లాకులను వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేలంలో బొగ్గు గనులు దక్కించుకున్న సంస్థలు, నిర్దేశిత కాల వ్యవధి కంటే ఏడాదిముందే ఉత్పత్తి ప్రారంభిస్తే దానికి ప్రోత్సాహకంగా ఆదాయంలో వాటాను 10% ప్రభుత్వం తగ్గించుకోనుంది.

125 టన్నులకు కోల్‌ ఇండియా ఉత్పత్తి
ప్రభుత్వరంగ సంస్థ కోల్‌ ఇండియా గత ఏడాది కాలంలో 16 బొగ్గు బ్లాకులను సొంతం చేసుకోగా, వీటి సాయంతో సంస్థ ఉత్పత్తి 125 మిలియన్‌ టన్నులకు చేరనుందని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఈ బ్లాకుల్లో ఉత్పత్తి మూడు నుంచి ఆరేళ్లలో ప్రారంభమవుతుందని చెప్పారు. ‘‘2023–24 నాటికి ఒక బిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని చేరుకునేందుకు కంపెనీకి సాయపడుతుంది. ఇటీవలి కేటాయించిన వాటిల్లో కొన్నింటిలో 2–3 ఏళ్లు, ఇతర బ్లాకుల్లో ఉత్పత్తికి మరింత సమయం తీసుకుంటుంది’’ అని కోల్‌ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఈ బ్లాకుల్లో వెలికితీత కార్యకలాపాలను కోల్‌ ఇండియా త్వరగా ప్రారంభించాలని కేంద్రం కోరుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement