కేంద్ర ప్రభుత్వం కోల్ సెక్టార్ నుంచి ఒక లక్ష 75 వేల కోట్లు సంపాదించుకోవాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచి 500 బొగ్గు బ్లాక్‌లను దశల వారీగా వేలం వేస్తూ వస్తున్నది. కార్పొరేట్‌ల చేతుల్లోకి ఇప్పటికే 140కి పైగా బొగ్గు బ్లాకులు వెళ్లిపోయాయి. గత పార్లమెంట్‌లో 303 సీట్లు ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నీ అడ్డుకునే పరిస్థితి విపక్షాలకు లేదు. చర్చకు అవకాశమే లేకుండా ఏకపక్ష నిర్ణయాలను కేంద్రం తీసుకొంది.
అది ప్రవేశపెట్టిన బిల్లుకు అప్పుడు తెలంగాణ ఎంపీలు అందరూ మద్దతు పలికారు. ఇందులో బొగ్గు బ్లాక్‌ల వేలంతో పాటు కోల్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, షేర్‌ల అమ్మకం కీలకంగా పేర్కొనవచ్చు. సింగరేణి సంస్థ కోల్ ఇండియాకు అనుబంధం కాని కారణంగా బతికి పోయింది!
ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం, పెద్ద ఎత్తున సాగుతున్నది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన బీసీసీఎల్ (భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ )లో 25 శాతం పెట్టుబడి ఉపసహరణకు కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోల్ ఇండియా తన 33 శాతం షేర్లను అమ్మేసింది. కేంద్రం నిర్ణయం కారణంగా మరిన్ని షేర్లు ప్రైవేటుపరం కానున్నాయి. ఇదంతా బీసీసీఎల్‌ను అమ్మేసే కుట్రలో భాగమే అనక తప్పదు!
మోదీ మూడో సారి ప్రధాని అయ్యాక తాజాగా దేశంలోని 60 బొగ్గు బ్లాక్‌లకు వేలం వేసే ప్రక్రియ మన తెలంగాణలోనే మొదలు పెట్టారు. గత పార్లమెంట్‌లో ఉన్న మెజారిటీ ఇప్పుడు బీజేపీకి లేకున్నా, మోదీ తన విధానం మాత్రం మార్చుకోలేదనేది కొత్తగా నిర్వహించిన వేలం వల్ల స్పష్టమవుతోంది. గతంలో రామగుండానికి పీఎం నరేంద్ర మోదీ వచ్చినపుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని చెప్పి వెళ్ళారు.
ఇప్పుడు అదే మాట మన బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెబుతున్నారు. అప్పుడు బొగ్గు బ్లాక్‌ల కేటాయించమని డిమాండ్ చేసినా ఏమీ సమాధానం చెప్పలేదు! ‘రైల్వేతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను ఛాయ్ అమ్మాను! నేను రైల్వేను ప్రైవేట్ పరం చేస్తానని కొందరు ప్రచారం చేస్తున్నారు, నేను అలా చేస్తానా?’ అని చెప్పిన పీఎం తర్వాత చేసిన పని ఏమిటో జగమెరిగిన సత్యం! అంతే కాదు అదే పీఎం మోడీ, ‘ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి’ అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. మరి ఏ మాట నమ్మాలి?
కేంద్ర, రాష్ట్రాల వాటాలు ఉన్న ఏకైక సంస్థ సింగరేణి. ఇందులో కేంద్రం వాటా 49 శాతం ఉంది. రాష్ట్ర వాటా 51 శాతం ఉంది. గత 20 ఏండ్లకు పైగా లాభాల్లో నడుస్తూ, 2001– 2002 ఆర్థిక సంవత్సరం నుంచి కార్మికులకు, లాభాల్లో వాటా ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు సంవత్సరాలు మిగులు సర్వీస్ ఉన్న నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్సీడబ్ల్యూఏ) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు అనారోగ్యం పాలై దరఖాస్తు చేసుకుంటే ఇన్వాలిడేషన్ చేసి, డిపెండెంట్‌లకు ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ కూడా సింగరేణే కావడం విశేషం!
ఈ నేపథ్యంలో కేంద్రం ప్రైవేటీకరణ పాలసీ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఇలాంటి విధానాల వల్ల కోల్ ఇండియాలో ఒకప్పుడు 8 లక్షల పైచిలుకు ఉన్న కార్మికుల సంఖ్య 3 లక్షలకూ, సింగరేణిలో 1991లో లక్షకు పైగా ఉన్న కార్మికుల సంఖ్య ఇప్పుడు 43 వేలకూ పడిపోయాయి. కోల్ ఇండియా కూడా మంచి లాభాల్లో ఉంది. అయినా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ బారి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉంది! కోల్ బ్లాక్‌లను కేటాయించకుండా ఉంటే సింగరేణి నష్టాల్లో పడుతుంది. అప్పుడు దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయవచ్చనేది కేంద్రం యోచన కావచ్చు. అందుకే అది బొగ్గు బ్లాక్‌లను కేటాయించడంలేదని చెప్పవచ్చు.
ఈ విషయం మీద మన తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రధాని మోదీతో మాట్లాడుతామన్నారు. మరో వైపు ‘మా బ్లాకులు మాకు ఇవ్వండి’ అని మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లిఖిత పూర్వకంగా కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మేరకు పీఎం మోదీకి లేఖ రాశారు. ఒక వైపు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. 2015 లోని బొగ్గు బ్లాక్‌ల వేలం చట్టం లోనే, 17 (ఏ) సెక్షన్ ప్రకారం సింగరేణికి బొగ్గు బ్లాక్‌లను వేలంలో పాల్గొనకుండానే కేటాయించవచ్చు! ఆ దిశలో కేంద్రం ముందుకు పోతుందని ఆశిద్దాం! అందరం కలిసి సింగరేణిని కాపాడుకుందాం! ఛలో ఆజ్ నహీ తో కల్ నహీ! తెలంగాణ గోదావరి తీరంలోని బొగ్గు నిక్షేపాల మీద సింగరేణికి హక్కు ఉన్నది! – ఎమ్.డి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్, 9951865223.
Comments
Please login to add a commentAdd a comment