
బాధితుడు రైతు కావలి తిప్పేస్వామి
రాయదుర్గం రూరల్: వ్యవసాయ పెట్టుబడుల కోసం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను రైతుకు తెలపకుండా కార్పొరేషన్ అధికారులు వేలం వేసేశారు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కాశీపురం గ్రామానికి చెందిన రైతు కావలి తిప్పేస్వామి వ్యవసాయ పెట్టుబడుల కోసం తన భార్య నాగలక్ష్మి బంగారు నెక్లెస్‌ను 2013లో కార్పొరేషన్ బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ప్రతి ఏటా వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నాడు. 2017 ఆగస్టు నుంచి వడ్డీ చెల్లించలేదు. 2018 జూన్ ఐదో తేదీన అసలు, వడ్డీ చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసు పంపించారు. కానీ రైతుకు జూలై 15న నోటీసు అందింది. జూలై 16న బ్యాంకుకు వచ్చి గోల్డ్‌లోన్ ఖాతాకు రూ.4వేల వడ్డీ చెల్లించి రెన్యూవల్ రసీదు తీసుకున్నాడు.
కానీ అదే నెల 20 వతేదీన బ్యాంకు వారు బంగారు నెక్లెస్‌ను బహిరంగవేలంలో రూ.29,200కు విక్రయించేశారు. ఈ విషయం రైతు తిప్పేస్వామికి తెలియదు. రుణం తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తానని, తన బంగారును ఇవ్వాలని వారం రోజుల నుంచి బ్యాంకు చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతుంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. గట్టిగా అడిగితే మీ బంగారాన్ని గత సంవత్సరం ఆగస్టులోనే వేలం వేసేశామని చెప్పడంతో రైతు గుండెలపై బండరాయి వేసినంత పనైంది. బంగారాన్ని వేలం వేసే ఉద్దేశ్యం ఉన్నప్పుడు తనవద్ద నుంచి వడ్డీ మొత్తంలో రూ.4వేలు ఎలా కట్టించుకున్నారని ప్రశ్నిస్తున్నాడు. బ్యాంకు అధికారులు చేసిన తప్పిదాలకు తాము బలైపోయామని బాధితుడు కావలి తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కోర్టుకు వెళతానని చెప్పాడు.
ఈ విషయంపై రాయదుర్గం కార్పొరేషన్‌బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జయరాంను వివరణ కోరగా ఈ విషయం జరిగినప్పుడు తాను లేనన్నారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకునే హక్కు ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment