BCCI To Start IPL 2022 On March 27th In India, Says Report - Sakshi
Sakshi News home page

IPL 2022: మార్చి 27 నుంచి ఐపీఎల్‌ 2022 సీజన్‌.. ప్రేక్షకులు లేకుండానే!

Published Sat, Jan 22 2022 6:32 PM | Last Updated on Tue, Jan 25 2022 11:00 AM

Reports BCCI Eyeing 27th March Start IPL 2022 Season - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలం సందడి మొదలైంది. 2022 లీగ్‌ కోసం భారత ఆటగాళ్ల మొదలు అసోసియేట్‌ టీమ్‌ల క్రికెటర్ల వరకు అందరూ వేలంలో తామూ భాగం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వేలంలో అవకాశం దక్కించుకునే క్రమంలో తొలి అడుగుగా ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా, 318 మంది విదేశీయులు. ఇందులో గరిష్టంగా ఆస్ట్రేలియానుంచి 59 మంది క్రికెటర్లు ఉన్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా రెండు టీమ్‌లతో మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. కొత్త సీజన్‌కు ముందు నిబంధనల ప్రకారం గరిష్టంగా నలుగురు ఆటగాళ్లనే టీమ్‌ను కొనసాగించే అవకాశం ఉండటంతో భారత జట్టులో రెగ్యులర్‌ సభ్యుల్లో కూడా దాదాపు అందరూ వేలంలోకి రానున్నారు. వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన 896 మంది భారత క్రికెటర్లలో 61 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినవారు ఉన్నారు.

ఈ లిస్ట్‌ను బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంపిస్తుంది. వేలంలో తాము కోరుకుంటున్న ఆటగాళ్లతో వివిధ టీమ్‌లు ఇచ్చే పేర్లను బట్టి తుది జాబితా సిద్ధమవుతుంది. అందులో ఉన్న ఆటగాళ్లకే వేలంలో అవకాశం లభిస్తుంది. ఎనిమిది టీమ్‌లు కలిసి 27 మంది ఆటగాళ్లను, రెండు కొత్త టీమ్‌ను ఎంచుకున్న ఆరుగురు ఆటగాళ్లు కలిపితే జట్ల వద్ద 33 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఒక్కో టీమ్‌కు గరిష్టంగా 25 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేలంలో 217 మంది క్రికెటర్లే చివరకు ఎంపికవుతారు.  

బరిలో వార్నర్, మిచెల్‌ మార్‌ష...
రూ. 2 కోట్ల కనీస విలువతో మొత్తం 49 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆపై వేలంలో వీరికి ఎంత మొత్తం లభిస్తుందనేది ఆసక్తికరం. ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ స్టార్లలో ఒకడు, ఇటీవల టి20 ప్రపంచకప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా నిలిచిన డేవిడ్‌ వార్నర్‌పైనే అందరి దృష్టి నిలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ మిచెల్‌ మార్‌‡్ష కూడా లీగ్‌లో తన అవకాశం కోసం చూస్తున్నాడు. రూ. 2 కోట్ల లిస్ట్‌లో ఉన్న భారత క్రికెటర్లలో శ్రేయస్, ధావన్, ఇషాన్‌ కిషన్, రాయుడులకు మంచి విలువ పలికే అవకాశం ఉంది.

విదేశీ క్రికెటర్లలో కమిన్స్, జోర్డాన్, బౌల్ట్, డి కాక్, డుప్లెసిస్, రబడలకు భారీ డిమాండ్‌ ఖాయం. రూ.1.5 కోట్ల జాబితాలో సుందర్, బెయిర్‌స్టో, మోర్గాన్, హోల్డర్‌...రూ.1 కోటి జాబితాలో నటరాజన్, మనీశ్‌ పాండే, రహానే, షమ్సీలకు ఫ్రాంచైజీలకు ఆకర్షించవచ్చు. ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధం పూర్తి చేసుకున్న పేసర్‌ శ్రీశాంత్‌ కూడా రూ. 50 లక్షల కనీస విలువతో తన పేరు నమోదు చేసుకోవడం విశేషం. తొలి ఐపీఎల్‌ మినహా 2009నుంచి లీగ్‌పై తనదైన ముద్ర వేసి దాదాపు అన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న క్రిస్‌ లీగ్‌ ఈ సారి లీగ్‌నుంచి తప్పుకోవడంతో తన పేరును నమోదు చేసుకోలేదు.

ముంబై, పుణేలలో...
ఐపీఎల్‌–2022ను ఎక్కడ నిర్వహించాలనే అంశంపై శనివారం బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఫ్రాంచైజీలన్నీ భారత్‌లో జరిపితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ప్రేక్షకులను అనుమతించకుండా ముంబై, పుణేలలోనే అన్ని మ్యాచ్‌లు జరపాలనేది ప్రాథమికంగా బీసీసీఐ ఆలోచన. ముంబైలో మూడు పెద్ద మైదానాలు ఉండగా, సమీపంలోనే పుణేలో మరో స్టేడియం ఉండటంతో బయోబబుల్‌ తదితర ఏర్పాట్ల విషయంలో ఎలాంటి సమస్య రాదని వారు చెబుతున్నారు. అయితే భారత్‌లో కరోనా కాస్త తగ్గుముఖం పడితేనే ఇది సాధ్యమవుతుందని... లేదంటే ప్రత్యామ్నాయంగా మళ్లీ యూఏఈనే ఉంచాలని బోర్డు భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే మార్చి 27న ఐపీఎల్‌ మొదలవుతుంది.

చదవండి: KL Rahul: కెప్టెన్సీతో పాటు భారీ మొత్తం ఆఫర్‌ చేసిన లక్నో ఫ్రాంచైజీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement