PC: IPL
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్... గత సీజన్‌లో కరోనా కారణంగా రెండు వేదికల్లో జరిగింది. ఆటగాళ్లకు కరోనా సోకడంతో కొన్నాళ్లు వాయిదా పడింది టోర్నీ. భారత్‌లో కేసులు తగ్గకపోవడంతో.. యూఏఈలో రెండో అంచెను నిర్వహించారు. దీంతో ఏడాది ప్రథమార్థంలో ముగియాల్సిన లీగ్.. అక్టోబరు వరకు సాగింది. అక్టోబరు 15న చెన్నై సూపర్‌కింగ్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఇక అప్పటి నుంచి మెగా వేలం-2022 ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా? సీజన్ ఎప్పుడు ఆరంభమవుతుంది? అన్న విషయాల గురించి అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చలు సాగిస్తున్నారు. మరోవైపు దేశంలో కరోనా కేసుల నేపథ్యంలో అసలు ఐపీఎల్-2022 ఎడిషన్ అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే కోవిడ్ కేసుల పెరుగుదలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి పలు దేశవాళీ టోర్నీలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అంతేగాక తాజా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగాల్సిన మెగా వేలాన్ని కూడా వారం పాటు ఆలస్యంగా నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అదే సమయంలో క్యాష్ రిచ్ లీగ్‌ను ప్రీ పోన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తాజాగా వదంతులు వ్యాపిస్తున్నాయి. మార్చి 25 నుంచి లీగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందట.
ప్లాన్ బీ లో భాగంగా మరో కోవిడ్ వేవ్ విరుచుకుపడక ముందే లీగ్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ యోచిస్తోందట. అంతేగాక ముంబైలోనే అన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తోందన్నది ఆ వార్తల సారాంశం. దీంతో ఆటగాళ్లు ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా ముంబైలోని మూడు వేదికలు వాంఖడే, సీసీఐ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలోనే మ్యాచ్‌లకు షెడ్యూల్ ఖరారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. బయో బబుల్ నిబంధనలు అమలు చేస్తూ టోర్నీని పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
ఇది ఎంత వరకు నిజం? ఎంత వరకు సాధ్యం?
ఒకవేళ నిజంగానే ఐపీఎల్-2022ను ఏప్రిల్‌లో కాకుండా మార్చిలోనే ఆరంభించాలంటే ముందుగా మెగా వేలాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కర్ణాటకలో తాజా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో హోటళ్లలో గదులు దొరకక ఆక్షన్‌ను వాయిదా వేయాల్సి వస్తోంది. అంతేకాదు వేదికను మార్చే యోచనలో కూడా బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈసారి లీగ్‌లో రెండు కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో చేరనున్న సంగతి తెలిసిందే. వీటిలో గోయెంక గ్రూపు కొనుగోలు చేసిన లక్నో ఎంట్రీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాగా... సీవీసీ క్యాపిటల్‌కు చెందిన అహ్మదాబాద్‌కు మాత్రం ఇంకా మార్గం సుగమం కాలేదు. కొన్ని చట్టపరమైన చిక్కుల నేపథ్యంలో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
అసలే ముంబై..
ఈ ప్రక్రియ పూర్తై.. కొత్త జట్ల ఎంట్రీ ఖరారై... ఆయా టీమ్‌లు ఆటగాళ్లను ఎంచుకోవాలి... ఆ తర్వాతే మెగా వేలం నిర్వహణ... ఇవన్నీ సజావుగా సాగితేనే టోర్నీ ఆరంభమవుతుంది. ఈలోపు కరోనా కేసులు పెరిగితే పునరాలోచన తప్పదు. అంతేకాదు.. మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ ముంబై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ముంబై క్రికెట్ అసోసియేషన్ సిబ్బందిలో 15 మంది కరోనా బారిన పడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ను ప్రీ పోన్ చేయడం, అందునా ముంబైలో నిర్వహించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. మరీ ముఖ్యంగా ఒకవేళ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కఠినమైతే విదేశీ ఆటగాళ్ల రాక, బయో బబుల్ నిర్వహణ కష్టతరమవుతుంది. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment