బెంగళూరు బ్లాస్టర్స్‌ బోణీ  | Bengaluru Blasters thrash Delhi Dashers 5-2 in Premier Badminton | Sakshi
Sakshi News home page

బెంగళూరు బ్లాస్టర్స్‌ బోణీ 

Published Fri, Dec 29 2017 12:52 AM | Last Updated on Fri, Dec 29 2017 12:52 AM

Bengaluru Blasters thrash Delhi Dashers 5-2 in Premier Badminton - Sakshi

న్యూఢిల్లీ:  ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) మూడో సీజన్‌లో తొలి మ్యాచ్‌తోనే బెంగళూరు బ్లాస్టర్స్‌ బోణీ కొట్టింది. గురువారం ఇక్కడి సిరి ఫోర్ట్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన పోరులో బెంగళూరు 5–2తో ఢిల్లీ డాషర్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఢిల్లీకిది వరుసగా రెండో పరాజయం. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోరులో సిక్కిరెడ్డి– కిమ్‌ స రంగ్‌ (బెంగళూరు) జోడి 15–10, 12–15, 15–11తో అశ్విని పొన్నప్ప– వ్లాదిమిర్‌ ఇవనోవ్‌ (ఢిల్లీ) జంటపై గెలిచి బ్లాస్టర్స్‌కు శుభారంభం అందించింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లో చోంగ్‌ వి ఫెంగ్‌ (బెంగళూరు) 10–15, 15–13, 15–8తో వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (ఢిల్లీ)పై విజయం సాధించాడు. దీంతో బెంగళూరు వరుస విజయాలతో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అనంతరం మహిళల సింగిల్స్‌ను ఢిల్లీ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సుంగ్‌ జి హ్యూన్‌ జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. సుంగ్‌ జి 15–10, 8–15, 15–5తో కిర్‌స్టి గొల్మోర్‌ (బెంగళూరు)పై గెలుపొందడంతో స్కోరు 2–2గా సమమైంది. తర్వాత జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌ను బెంగళూరు ట్రంప్‌గా ఎంచుకోవడంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఫలితం తేలిపోయింది. ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్సన్‌ (బెంగళూరు) 15–11, 15–11తో వరుస గేముల్లోనే తియాన్‌ హువే (ఢిల్లీ)పై గెలుపొందాడు. దీంతో బ్లాస్టర్స్‌ జట్టు 4–2తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్రాధాన్యత లేని పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లోనూ బెంగళూరు జంట మథియాస్‌ బో–కిమ్‌ స రంగ్‌ 15–9, 15–12తో వ్లాదిమిర్‌ ఇవనోవ్‌–ఇవాన్‌ సొజొనోవ్‌ (ఢిల్లీ) జోడిపై నెగ్గింది. నేడు ఇక్కడే జరిగే పోరులో హైదరాబాద్‌ హంటర్స్‌... అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌తో తలపడనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement