Bangalore blasters
-
ఫైనల్లో బెంగళూరు బ్లాస్టర్స్
సాక్షి, హైదరాబాద్: ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ మిక్స్డ్ డబుల్స్ జంట సిక్కి రెడ్డి–కిమ్ సా రంగ్ అద్భుత ఆటతీరును కనబరిచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–కిమ్ సా రంగ్ ద్వయం 15–12, 13–15, 15–9తో కామిల్లా రైటర్ జుల్–లా చెయుక్ హిమ్ జోడీని ఓడించింది. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో బెంగళూరు బ్లాస్టర్స్ 4–3తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో హైదరాబాద్ హంటర్స్‌తో బెంగళూరు బ్లాస్టర్స్ అమీతుమీ తేల్చుకుంటుంది. అంతకుముందు అహ్మదాబాద్ తరఫున పురుషుల తొలి సింగిల్స్‌లో సౌరభ్ వర్మ... మహిళల ఏకైక సింగిల్స్‌లో తై జు యింగ్ గెలిచారు. బెంగళూరు తరఫున పురుషుల డబుల్స్‌లో మథియాస్ బో–కిమ్ సా రంగ్ జంట... పురుషుల రెండో సింగిల్స్‌లో అక్సెల్సన్ నెగ్గారు. -
బెంగళూర్ 6, ముంబై మైనస్ 1
లక్నో: బెంగళూరు ‘బ్లాస్టింగ్’కు ముంబై రాకెట్స్ తేలిపోయాయి. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మైనస్ పాయింట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ఇక్కడి బాబు బనారసి దాస్ బ్యాడ్మింటన్ అకాడమీలో సోమవారం జరిగిన పోరులో బెంగళూరు బ్లాస్టర్స్ 6– (–1) తేడాతో ముంబైపై అసాధారణ విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, సింగిల్స్ ఇలా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు క్రీడాకారులే సత్తాచాటారు. ప్రత్యర్థి ఆటగాళ్లను వరుసబెట్టి ఓడించారు. మొదట జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–కిమ్ సా రంగ్ జోడి 15–8, 10–15, 15–10తో ఎం.ఆర్.అర్జున్–గ్యాబ్రియెలా స్టొయెవా (ముంబై)పై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో కిర్స్టీ గిల్మోర్ 15–14, 15–8తో బీవెన్ జంగ్ (ముంబై)ను కంగుతినిపించింది. పురుషుల సింగిల్స్‌ను బెంగళూరు ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ 15–6, 15–13తో సన్ వాన్ హో (ముంబై)పై గెలవడంతోనే బెంగళూరు బ్లాస్టర్స్ 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు ప్లేయర్లు పట్టు సడలించకపోవడంతో ముంబైకి కష్టాలు తప్పలేదు. రెండో పురుషుల సింగిల్స్ ముంబైకి ట్రంప్ కాగా ఇందులోనూ సమీర్ వర్మ 15–9, 8–15, 6–15తో చోంగ్ వీ ఫెంగ్ (బెంగళూరు) చేతిలో కంగుతిన్నాడు. చివరి పురుషుల డబుల్స్‌లో మథియాస్ బోయె–కిమ్ సా రంగ్ ద్వయం 9–15, 15–10, 15–14తో లీ యంగ్ డే–బూన్ హియోంగ్ తన్ (ముంబై) జంటపై గెలిచింది. నేడు (మంగళవారం) జరిగే పోరులో అవధ్ వారియర్స్‌తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ తలపడనుంది. -
బెంగళూరు బ్లాస్టర్స్ బోణీ
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్లో తొలి మ్యాచ్‌తోనే బెంగళూరు బ్లాస్టర్స్ బోణీ కొట్టింది. గురువారం ఇక్కడి సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన పోరులో బెంగళూరు 5–2తో ఢిల్లీ డాషర్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్లో ఢిల్లీకిది వరుసగా రెండో పరాజయం. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్ పోరులో సిక్కిరెడ్డి– కిమ్ స రంగ్ (బెంగళూరు) జోడి 15–10, 12–15, 15–11తో అశ్విని పొన్నప్ప– వ్లాదిమిర్ ఇవనోవ్ (ఢిల్లీ) జంటపై గెలిచి బ్లాస్టర్స్‌కు శుభారంభం అందించింది. తర్వాత పురుషుల సింగిల్స్‌లో చోంగ్ వి ఫెంగ్ (బెంగళూరు) 10–15, 15–13, 15–8తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (ఢిల్లీ)పై విజయం సాధించాడు. దీంతో బెంగళూరు వరుస విజయాలతో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం మహిళల సింగిల్స్‌ను ఢిల్లీ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సుంగ్ జి హ్యూన్ జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. సుంగ్ జి 15–10, 8–15, 15–5తో కిర్స్టి గొల్మోర్ (బెంగళూరు)పై గెలుపొందడంతో స్కోరు 2–2గా సమమైంది. తర్వాత జరిగిన రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ట్రంప్‌గా ఎంచుకోవడంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఫలితం తేలిపోయింది. ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ (బెంగళూరు) 15–11, 15–11తో వరుస గేముల్లోనే తియాన్ హువే (ఢిల్లీ)పై గెలుపొందాడు. దీంతో బ్లాస్టర్స్ జట్టు 4–2తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్రాధాన్యత లేని పురుషుల డబుల్స్ మ్యాచ్‌లోనూ బెంగళూరు జంట మథియాస్ బో–కిమ్ స రంగ్ 15–9, 15–12తో వ్లాదిమిర్ ఇవనోవ్–ఇవాన్ సొజొనోవ్ (ఢిల్లీ) జోడిపై నెగ్గింది. నేడు ఇక్కడే జరిగే పోరులో హైదరాబాద్ హంటర్స్... అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో తలపడనుంది. -
బ్యాడ్మింటన్ లీగ్‌లోకి సచిన్
► పీబీఎల్‌లో ‘బెంగళూరు బ్లాస్టర్స్’ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు ►భాగస్వాములుగా నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ బెంగళూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా బ్యాడ్మింటన్ లీగ్‌లోనూ అడుగు పెట్టారు. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ సహ యజమానిగా ఉన్న ఆయన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు బ్లాస్టర్స్ ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నారు. ‘ఫిట్నెస్, నైపుణ్యత, చురుకుదనం కలబోతే బ్యాడ్మింటన్. బెంగళూరు బ్లాస్టర్స్‌లో భాగం అవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. వచ్చే సీజన్లో ఈ జట్టు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను’ అని సచిన్ తెలిపారు. మరోవైపు ఈ ఒప్పదం వివరాలను సహ యజమాని, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడించారు. ‘సచిన్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నేను కలిసి ఓ బృందంగా ఏర్పడి బెంగళూరు జట్టులో పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతానికై తే ఆ మొత్తం ఎంత అనేది చెప్పలేం. కానీ సరైన సయమంలో వెల్లడిస్తాం’ అని నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. అంతగా విజయవంతం కాని బ్యాడ్మింటన్ లీగ్‌లో ప్రవేశించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. క్రీడల్లో అడుగుపెట్టే ప్రతీ పెట్టుబడిదారులకు ఇలాంటి సవాళ్లు మామూలేనని, అరుుతే తాము లాభాల కోసమే ఇందులో అడుగుపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో బ్యాడ్మింటన్ ప్రమాణాలను మరింత పెంచే ఉద్దేశంతోనే దీంట్లోకి వచ్చినట్టు ఆయన చెప్పారు. లీగ్‌లో సచిన్ అడుగుపెట్టడం ఆటగాళ్లకు ప్రేరణగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందని జాతీయ కోచ్ గోపీచంద్ అభిప్రాయపడ్డారు. మీడియా సమావేశంలో సినీ హీరో అల్లు అర్జున్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా పాల్గొన్నారు. పీబీఎల్ జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతుంది.