లక్నో: బెంగళూరు ‘బ్లాస్టింగ్’కు ముంబై రాకెట్స్ తేలిపోయాయి. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మైనస్ పాయింట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది. ఇక్కడి బాబు బనారసి దాస్ బ్యాడ్మింటన్ అకాడమీలో సోమవారం జరిగిన పోరులో బెంగళూరు బ్లాస్టర్స్ 6– (–1) తేడాతో ముంబైపై అసాధారణ విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, సింగిల్స్ ఇలా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు క్రీడాకారులే సత్తాచాటారు. ప్రత్యర్థి ఆటగాళ్లను వరుసబెట్టి ఓడించారు. మొదట జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–కిమ్ సా రంగ్ జోడి 15–8, 10–15, 15–10తో ఎం.ఆర్.అర్జున్–గ్యాబ్రియెలా స్టొయెవా (ముంబై)పై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లో కిర్‌స్టీ గిల్మోర్ 15–14, 15–8తో బీవెన్ జంగ్ (ముంబై)ను కంగుతినిపించింది. పురుషుల సింగిల్స్‌ను బెంగళూరు ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది.
ఇందులో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ 15–6, 15–13తో సన్ వాన్ హో (ముంబై)పై గెలవడంతోనే బెంగళూరు బ్లాస్టర్స్ 4–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు ప్లేయర్లు పట్టు సడలించకపోవడంతో ముంబైకి కష్టాలు తప్పలేదు. రెండో పురుషుల సింగిల్స్ ముంబైకి ట్రంప్ కాగా ఇందులోనూ సమీర్ వర్మ 15–9, 8–15, 6–15తో చోంగ్ వీ ఫెంగ్ (బెంగళూరు) చేతిలో కంగుతిన్నాడు. చివరి పురుషుల డబుల్స్‌లో మథియాస్ బోయె–కిమ్ సా రంగ్ ద్వయం 9–15, 15–10, 15–14తో లీ యంగ్ డే–బూన్ హియోంగ్ తన్ (ముంబై) జంటపై గెలిచింది. నేడు (మంగళవారం) జరిగే పోరులో అవధ్ వారియర్స్‌తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ తలపడనుంది.
బెంగళూర్ 6, ముంబై మైనస్ 1
Published Tue, Jan 2 2018 12:48 AM | Last Updated on Tue, Jan 2 2018 12:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment