సింధు పైచేయి సాధించేనా!
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది తొలి రోజే క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్ సిద్ధమైంది. నేటి (ఆదివారం) నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్, చెన్నై స్మాషర్స్ తలపడనున్నాయి. రియో ఒలింపిక్స్ ఫైనల్లో తలపడిన పీవీ సింధు, కరోలినా మారిన్ ఈసారీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. అయితే తెలుగు తేజం సింధు చెన్నై తరఫున ఆడుతోంది. ఒలింపిక్స్ స్వర్ణాన్ని అందకుండా చేసిన మారిన్‌పై ‘సొంత’ ప్రేక్షకుల మద్దతుతో ఈసారి పైచేయి సాధిస్తుందా? అనేది వేచి చూడాలి. కానీ తెలుగు అభిమానులు తమ నగరం పేరుతో ఉన్న హైదరాబాద్‌కు మద్దతిస్తారా.. లేక సింధు జట్టు చెన్నైకి అనుకూలంగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో, పారుపల్లి కశ్యప్ కూడా చెన్నైలో ఉన్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్‌కాక్, గాబ్రియెలా అడ్‌కాక్ (ఇంగ్లండ్) జంట కీలకం కానుంది. మరోవైపు హంటర్స్ జట్టులో సాయి ప్రణీత్, సమీర్ వర్మ తమ సత్తాను చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫామ్‌లో ఉన్న రాజీవ్ ఉసెఫ్ రూపంలో ఈ జట్టు చక్కటి అంతర్జాతీయ ఆటగాడిని కలిగి ఉంది. ఇక రెండోమ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్, డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ ఏసర్స్ తలపడతాయి. బెంగళూరు తరఫున రియో రజత పతక విజేత విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్), బూన్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్), సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్‌లో కీలకం. రుత్విక శివాని, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి కూడా ఈ జట్టుకు ఆడనున్నారు. ఢిల్లీలో డేన్ జాన్, సన్ వాన్ వో రూపంలో గట్టి సింగిల్స్ ఆటగాళ్లున్నారు.