marin
-
'ఫైనల్ ఫోబియా'ను నేను నమ్మను
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో నాలుగో పతకంతో తెలుగమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు చరిత్ర సృష్టించింది. టోర్నీలో అద్భుతంగా రాణించిన ఆమె, దురదృష్టవశాత్తూ వరుసగా రెండో ఏడాది కూడా రజతంతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇది ఆమెతో పాటు భారత అభిమానులను కూడా నిరాశ పర్చింది. అయితే కిందపడిన ప్రతీసారి అంతే వేగంగా పైకి లేవడం తనకు అలవాటేనని, సుదీర్ఘ కెరీర్లో ఇలాంటి ఓటములు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవన్న సింధు... మరోసారి స్వర్ణమే లక్ష్యంగా శ్రమిస్తానని పట్టుదలగా చెబుతోంది. సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక టోర్నీలలో గతంలో ఫైనల్లో పరాజయం ఎదురైనప్పుడల్లా తీవ్ర వేదనకు గురయ్యేదాన్నని, ఇప్పుడు స్థితప్రజ్ఞత అలవర్చుకున్నానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వ్యాఖ్యానించింది. ఈసారి వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమి తర్వాత కూడా అలాంటి భావోద్వేగాలను అధిగమించగలిగానని ఆమె చెప్పింది. చైనాలోని నాన్జింగ్లో జరిగిన మెగా ఈవెంట్లో రజత పతకం సాధించిన అనంతరం సింధు మంగళవారం స్వస్థలం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. టోర్నీ ఫలితం తదితర అంశాలపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడింది. విశేషాలు సింధు మాటల్లోనే... మారిన్ మళ్లీ దెబ్బ తీయడంపై... దాదాపు నెల రోజుల క్రితమే మలేసియా ఓపెన్‌లో మారిన్‌ను ఓడించాను. దాంతో పోలిస్తే ఈసారి ఆమె ఆటలో ఒక్కసారిగా దూకుడు పెరిగింది. నేను ఆటలో దూకుడు గురించి సన్నద్ధమయ్యాను కానీ ఆమె కోర్టులో కూడా కొత్తగా ప్రవర్తించింది. ఆమె శైలి కూడా భిన్నంగా కనిపించింది. నిబంధనల పరిధిలో ఉంటూనే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రణాళికతోనే ఆమె సిద్ధమై వచ్చిందని కూడా అర్థమైంది. నేను చివరకు అంపైర్లకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది కూడా. అయినా ఫలితం దక్కలేదు. నా ఆటకంటే కూడా ఆమె తన ప్రవర్తనతోనే నాపై ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌లో ఓటమిపై... తొలి గేమ్‌ను చేతులారా కోల్పోవడమే నేను ఫైనల్లో చేసిన తప్పు. దాదాపు 15 పాయింట్ల వరకు కూడా ఇద్దరం సమ ఉజ్జీలుగా ఉన్నాం. కొద్దిసేపు నేను ఏకాగ్రత కోల్పోయి వెనుకబడిపోయాను. గేమ్ గెలిచి ఉంటే నాకు మరో అవకాశం ఉండేది. ఇక రెండో గేమ్‌లోనైతే పూర్తిగా షటిల్‌పై నియంత్రణ కోల్పోయాను. ఇతర విషయాలను పక్కన పెడితే మారిన్ నిజానికి చాలా బాగా ఆడింది. ఆమెకే గెలిచే అర్హత ఉంది. పైగా చాలా రోజులు గాయాల వల్ల ఆటకు దూరమై ఇటీవల పునరాగమనం చేయడం వల్ల ఒక రకమైన కసి ఆమె ఆటలో కనిపించింది. ఓడినా నా ఆటలో లోపాలేమీ లేవు. మళ్లీ ఫైనల్లో ఓడిపోవడంపై... చాలా రోజులుగా చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. తుది పోరులో భయపడుతూ ఆడే ‘ఫైనల్ ఫోబియా’ అనే పదమే నాకు నచ్చనిది. నేను దానిని నమ్మను. అదే ఉంటే కెరీర్లో ఇన్ని విజయాలు దక్కకపోయేవి. వరల్డ్ చాంపియన్‌షిప్ అనేది మెగా ఈవెంట్. నాకు కఠినమైన ‘డ్రా’ ఎదురైంది. టోర్నీలో ముందుకు వెళుతున్నకొద్దీ బలమైన ప్రత్యర్థులు ఎదురవుతారు. దాదాపు అందరూ సమాన స్థాయివారే. అలాంటప్పుడు కొద్ది తేడాలో మ్యాచ్ పోతుంది. బరిలోకి దిగినప్పుడు ఎవరైనా 100 శాతం శ్రమిస్తారు. స్వర్ణం గెలిచేందుకే ప్రయత్నిస్తారు. తుది ఫలితం కొంత నిరాశపర్చినా ఈసారి అంతగా బాధ పడిపోలేదు. గత ఏడాది దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ఓడినప్పుడైతే తట్టుకోలేక బాగా ఏడ్చేశాను. ఈసారి అలాంటిదేమీ జరగలేదు. మున్ముందు కూడా కెరీర్లో ఇలాంటి క్షణాలు మళ్లీ మళ్లీ ఎదురు కావచ్చు. బాధ పడుతూ కూర్చుంటే ఆడలేం. ఓవరాల్‌గా టోర్నీలో ప్రదర్శనపై... వరల్డ్ చాంపియన్‌షిప్ కోసం నేను ఎన్నో విధాలుగా సిద్ధమయ్యాను. ఇతర విషయాల వైపు దృష్టి మళ్లకుండా ఏకాగ్రతతో సాధన చేశాను. చాంపియన్ కాగలననే నమ్మకంతోనే వచ్చాను. కానీ అలా జరగలేదు. ఇంకా కష్టపడితే వచ్చేసారి స్వర్ణం గెలవగలనేమో. అయితే సానుకూల దృష్టితో చూస్తే రెండు గొప్ప విజయాలు నాకు అమిత సంతృప్తినిచ్చాయి. క్వార్టర్ ఫైనల్లో నొజోమి ఒకుహారా, సెమీస్‌లో అకానె యామగూచిలను సాధికారికంగా ఓడించడం ఆనందం కలిగించింది. వీరిద్దరు గత కొంత కాలంగా సర్క్యూట్లో నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పేరుకు రెండు గేమ్‌ల మ్యాచ్‌లే అయినా వరుస ర్యాలీలతో ఈ మ్యాచ్‌లు కూడా చాలా కఠినంగా, సుదీర్ఘంగా సాగాయి. చివరకు నేనే విజేతగా నిలవగలిగాను. ఫైనల్లో మారిన్‌తో ఓటమి గురించే అంతా మాట్లాడుతున్నారు గానీ ఈ రెండింటిలో నేను అద్భుత ప్రదర్శన కనబర్చగలిగాను. వేరేగా ప్రాక్టీస్ చేయడంపై... నాకు తప్పేమీ అనిపించలేదు. ఇది కూడా ఒకరకంగా నా వ్యూహాల్లో భాగమే. అంతర్జాతీయ టోర్నీల్లో సైనా నెహ్వాల్‌తో ఎన్ని సార్లు తలపడే అవకాశం వస్తుందో ఎవరూ చెప్పలేరు కానీ నేను కోచింగ్‌లో కాస్త భిన్నంగా ప్రయత్నిద్దామని భావించా. ఇదే విషయాన్ని గోపీ సర్‌తో చెబితే ఆయన అంగీకరించారు. కోచింగ్‌కు సంబంధించి అన్ని విధాలా సహకారం అందించారు. ఇతర ఇండోనేసియా కోచ్‌లు, ఫిజియోలు... ఇలా అందరూ నాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ప్రాక్టీస్ చేసినా ఇబ్బంది లేదు. ఇక రాబోయే ఆసియా క్రీడలకు సిద్ధమయ్యేందుకు ఎక్కువ సమయం లేదు. అక్కడ కూడా చాలా పోటీ ఉంటుంది. మారిన్ తప్ప దాదాపు మిగిలిన టాప్ షట్లర్లంతా ఉంటారు. 2014లో మన టీమ్ కాంస్యం సాధించింది. ఈసారి వ్యక్తిగతంగా, జట్టుగా కూడా మెరుగైన ఫలితం సాధించాలని పట్టుదలగా ఉన్నాం. హండోయో నిష్క్రమణ ప్రభావం... ముల్యో హండోయో చాలా అద్భుతమైన కోచ్. ఆయన ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. అందుకు ఆయనకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆయన ఎంతో నేర్పించి వెళ్లారు. ముల్యో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కారణాలేమైనా ఆయన వెళ్లిపోయారు. అయితే ముల్యో హండోయో లేకపోయినా... ఇప్పటికీ ఆయన నేర్పిన ఎన్నో అంశాలు చాలా సందర్భాల్లో మేం పాటిస్తూనే ఉంటాం. మిగతా విజయాలేవీ కనపడవా? ఎంతసేపు సింధు ఫైనల్ పరాజయాలపైనే స్పందిస్తారా. ఇక్కడ ఆమె సాధించిన సానుకూలాంశాలను చూడండి. ఓ క్రీడాకారిణి రెండు సార్లు ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఆషామాషీ కాదు. పరిస్థితులు, ఆ రోజు ఆమెకు కలిసిరాలేదంతే! ఫైనల్ పరాజయాలు చూసిన వారికి అంతకుముందు రౌండ్లలో ఆమె ప్రపంచ మేటి క్రీడాకారిణిలపై సాధించిన ఘన విజయాలు కనపడవా? క్వార్టర్స్‌లో ఒకుహారాను, సెమీస్‌లో యామగుచిని కంగుతినిపించింది. తుది పోరులో మారిన్... సింధు కంటే బాగా ఆడింది. పైగా ఆమె అసాధారణ ఫామ్‌లో ఉంది. ఇకపై మేం ప్రాక్టీస్‌లో మరింత కష్టపడతాం. కోచ్‌గా నాకు ఈ ప్రపంచ చాంపియన్‌షిప్ సంతృప్తినే మిగిల్చింది. సైనా కూడా బాగా ఆడింది. ప్రత్యేకించి డబుల్స్‌లో మన షట్లర్లు ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చారు. – చీఫ్ కోచ్ గోపీచంద్ -
సైనా, సింధులను ఓడించాలంటే..
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధులను ఓడించడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హైదరాబాద్ హంటర్స్ తరపున ఆడుతున్న కరోలినా మారిన్ స్పష్టం చేసింది. భారత్ కు చెందిన ఆ ఇద్దరు అత్యుత్తమ క్రీడాకారిణుల్ని ఓడించాలంటే తాను మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉందని మారిన్ తెలిపింది. తన పూర్తిస్థాయి ఆటను ప్రదర్శిస్తేనే వారిపై గెలుపు సాధ్యమని అభిప్రాయపడింది. 'సైనా, సింధు ఎవర్నీ తన ప్రత్యర్థి ఎంచుకున్నా వారిపై గెలవడం అంత సులభం కాదు. ఆ ఇద్దరూ కఠినమైన ప్రత్యర్థులే కాదు.. చాలా పోటీతత్వం ఉన్న క్రీడాకారిణులు. వారిని ఓడించాలంటే నా అత్యుత్తమ ఆటన ప్రదర్శించాల్సి ఉంది ' అని మారిన్ పేర్కొంది. పీబీఎల్ -2017 ఆరంభ వేడుకలు ఈరోజు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. పీబీఎల్ రెండో సీజన్ లో ఆరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఢిల్లీ ఏసర్స్, అవేధ్ వారియర్స్, ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ ,చెన్నై స్మాషర్స్ ప్రాంఛైజీలు తలపడనున్నాయి. అయితే చెన్నై స్మాషర్స్-హైదరాబాద్ హంటర్స్ మధ్య నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి గం.6.30 ని.లకు తొలి మ్యాచ్ జరుగనుంది. దీనిలో భాగంగా చెన్నై స్మాషర్స్ క్రీడాకారిణి పివి సింధు, హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి మారిన్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. రియో ఒలింపిక్స్ లో సింధును మారిన్ ఓడిస్తే, వరల్డ్ సూపర్ సిరీస్ టోర్నీలో మారిన్‌ను సింధు ఓడించింది. దాంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న మరో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. -
సింధు పైచేయి సాధించేనా!
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాది తొలి రోజే క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్ సిద్ధమైంది. నేటి (ఆదివారం) నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్, చెన్నై స్మాషర్స్ తలపడనున్నాయి. రియో ఒలింపిక్స్ ఫైనల్లో తలపడిన పీవీ సింధు, కరోలినా మారిన్ ఈసారీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. అయితే తెలుగు తేజం సింధు చెన్నై తరఫున ఆడుతోంది. ఒలింపిక్స్ స్వర్ణాన్ని అందకుండా చేసిన మారిన్‌పై ‘సొంత’ ప్రేక్షకుల మద్దతుతో ఈసారి పైచేయి సాధిస్తుందా? అనేది వేచి చూడాలి. కానీ తెలుగు అభిమానులు తమ నగరం పేరుతో ఉన్న హైదరాబాద్‌కు మద్దతిస్తారా.. లేక సింధు జట్టు చెన్నైకి అనుకూలంగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో, పారుపల్లి కశ్యప్ కూడా చెన్నైలో ఉన్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో క్రిస్ అడ్కాక్, గాబ్రియెలా అడ్కాక్ (ఇంగ్లండ్) జంట కీలకం కానుంది. మరోవైపు హంటర్స్ జట్టులో సాయి ప్రణీత్, సమీర్ వర్మ తమ సత్తాను చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫామ్‌లో ఉన్న రాజీవ్ ఉసెఫ్ రూపంలో ఈ జట్టు చక్కటి అంతర్జాతీయ ఆటగాడిని కలిగి ఉంది. ఇక రెండోమ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్, డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ ఏసర్స్ తలపడతాయి. బెంగళూరు తరఫున రియో రజత పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), బూన్సాక్ పొన్సానా (థాయ్‌లాండ్), సౌరభ్ వర్మ పురుషుల సింగిల్స్‌లో కీలకం. రుత్విక శివాని, అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి కూడా ఈ జట్టుకు ఆడనున్నారు. ఢిల్లీలో డేన్ జాన్, సన్ వాన్ వో రూపంలో గట్టి సింగిల్స్ ఆటగాళ్లున్నారు. -
మారిన్‌కు అత్యధిక మొత్తం
► రూ. 61.5 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ హంటర్స్ ► భారత్ తరఫున ఖరీదైన క్రీడాకారుడిగా శ్రీకాంత్ ► రూ. 51 లక్షలకు కొనుగోలు చేసిన అవధ్ వారియర్స్ ► సింధుకు రూ. 39 లక్షలు, సైనాకు రూ. 33 లక్షలు న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్ వేలం కార్యక్రమంలో విదేశీ క్రీడాకారుల హవా నడిచింది. భారత స్టార్స్‌కంటే ఎక్కువ మొత్తం వీరి ఖాతాలోకి వెళ్లడం విశేషం. రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విజేత, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)కు అందరికంటే అత్యధిక మొత్తం లభించింది. హైదరాబాద్ హంటర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 61.5 లక్షలు వెచ్చించి మారిన్‌ను సొంతం చేసుకుంది. మారిన్ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ జీ హున్‌కు భారీ మొత్తం లభించింది. సుంగ్ జీ హున్‌ను ముంబై రాకెట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్ ఆటగాడు జాన్ జార్గెన్‌సన్ ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. జార్గెన్‌సన్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు రూ. 59 లక్షలకు సొంతం చేసుకుంది. పీబీఎల్ తొలి సీజన్లో హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మలేసియా స్టార్ ప్లేయర్ లీ చోంగ్ వీ ఈసారి పీబీఎల్‌లో పాల్గొనడంలేదు. చైనా స్టార్స్ చెన్ లాంగ్, లిన్ డాన్ కూడా పీబీఎల్‌కు దూరంగా ఉన్నారు. భారత్ తరఫున కిడాంబి శ్రీకాంత్‌కు అత్యధిక మొత్తం దక్కింది. అవధ్ వారియర్స్ రూ. 51 లక్షలకు శ్రీకాంత్‌ను కొనుగోలు చేసింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధును చెన్నై స్మాషర్స్ జట్టు... సైనా నెహ్వాల్‌ను అవధ్ వారియర్స్ తమ వద్దే ఉంచుకున్నాయి. సింధుకు రూ. 39 లక్షలు, సైనాకు రూ. 33 లక్షలు లభించనున్నాయి. భారత్‌కే చెందిన ఇతర ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్ (రూ. 22 లక్షలు-ముంబై రాకెట్స్), గుత్తా జ్వాల (రూ. 10 లక్షలు-ఢిల్లీ ఏసర్స్), అశ్విని పొన్నప్ప (రూ. 15 లక్షలు-బెంగళూరు బ్లాస్టర్స్), పారుపల్లి కశ్యప్ (రూ. 8 లక్షలు-చెన్నై స్మాషర్స్)లను నామమాత్రం మొత్తానికే ఆయా జట్లు కొనుగోలు చేశాయి. పీబీఎల్-2 సీజన్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 14 వరకు భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో జరగనుంది. మొత్తం ఆటగాళ్ల వివరాలు అవధ్ వారియర్స్: కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, ఆదిత్య జోషి, ప్రాజక్త సావంత్, విషెమ్ గో, సావిత్రి అమిత్రపాయ్, వోంగ్ వింగ్ కీ విన్సెంట్, బోదిన్ ఇసారా, మార్కిస్ కిడో. ముంబై రాకెట్స్: అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, మనూ అత్రి, గుమ్మడి వృశాలి, మొహితా, అభిషేక్ యెలెగర్, లీ యోంగ్ డే, సుంగ్ జీ హున్, నాదెజ్దా జీబా, నిపిత్‌ఫోన్. ఢిల్లీ ఏసర్స్: సన్ వాన్ హో, జాన్ జార్గెన్‌సన్, గుత్తా జ్వాల, నిచావోన్ జిందాపోల్, ఇవాన్ సొజోనోవ్, వ్లాదిమిర్ ఇవనోవ్, అక్షయ్ దేవాల్కర్, కె.మనీషా, ఆకర్షి కశ్యప్, సిరిల్ వర్మ. హైదరాబాద్ హంటర్స్: కరోలినా మారిన్, వీ కియోంగ్ తాన్, చౌ హో వా, రాజీవ్ ఉసెఫ్, సాయిప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, సమీర్ వర్మ, కృష్ణప్రియ, మేఘన, తాన్ బూన్ హెయోంగ్. బెంగళూరు బ్లాస్టర్స్: విక్టర్ అక్సెల్సన్, యో యోన్ సెయోంగ్, అశ్విని పొన్నప్ప, పోర్న్‌టిప్, రుత్విక శివాని, సౌరభ్ వర్మ, ప్రణవ్ చోప్రా, కో సుంగ్ హున్, సిక్కి రెడ్డి, బున్సాక్ పొన్సానా. చెన్నై స్మాషర్స్: పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, టామీ సుగియార్తో, గ్యాబీ అడ్కాక్, తనంగోసక్, క్రిస్ అడ్కాక్, మాడ్స పీలెర్ కోల్డింగ్, సుమీత్ రెడ్డి, రమ్య తులసీ, అరుంధతి పంతవానె. -
సైనా కథ ముగిసె...
జకార్తా: గతంలో తనకెంతో కలిసొచ్చిన ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. మూడుసార్లు టైటిల్ సాధించి (2009, 2010, 2012), మరోసారి రన్నరప్‌గా (2011) నిలిచిన ఈ టోర్నీలో సైనా వరుసగా మూడో ఏడాది క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా 22-24, 11-21తో ఓడిపోయింది. మారిన్ చేతిలో సైనాకిది మూడో పరాజయం కావడం గమనార్హం. తొలి గేమ్‌లో రెండుసార్లు గేమ్ పాయింట్లు చేజార్చుకున్న సైనా... రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. క్వార్టర్స్‌లో ఓడిన సైనాకు 5,400 డాలర్ల (రూ. 3 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి
-
ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి
బర్మింగ్‌హోమ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో 16-21, 21-14, 21-7 తేడాతో సైనా నెహ్వాల్ ఓటమి చెంది అభిమానులను నిరాశ పరిచింది. ఆద్యంతం ఉత్కంఠం రేపిన ఫైనల్ మ్యాచ్ లో సైనా నెహ్వాల్ పోరాడి ఓడింది. అయితే తొలిసెట్లో సైనా నెహ్వాల్ గెలిచి ట్రోఫీపై ఆశలు పెంచినా.. మిగతా రెండు సెట్లలో మాత్రం సైనాకు చుక్కెదురైంది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత్ తరుపున ఫైనల్ కు చేరిన క్రీడాకారిణిగా సైనా చరిత్ర సృష్టించినా.. చివరి అడ్డంకిని మాత్రం దాటకలేకపోయింది.