మారిన్‌కు అత్యధిక మొత్తం | Highest total for Marin | Sakshi
Sakshi News home page

మారిన్‌కు అత్యధిక మొత్తం

Published Thu, Nov 10 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

మారిన్‌కు అత్యధిక మొత్తం

మారిన్‌కు అత్యధిక మొత్తం

రూ. 61.5 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ హంటర్స్
భారత్ తరఫున ఖరీదైన క్రీడాకారుడిగా శ్రీకాంత్
రూ. 51 లక్షలకు కొనుగోలు చేసిన అవధ్ వారియర్స్
సింధుకు రూ. 39 లక్షలు, సైనాకు రూ. 33 లక్షలు

న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్ వేలం కార్యక్రమంలో విదేశీ క్రీడాకారుల హవా నడిచింది. భారత స్టార్స్‌కంటే ఎక్కువ మొత్తం వీరి ఖాతాలోకి వెళ్లడం విశేషం. రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విజేత, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)కు అందరికంటే అత్యధిక మొత్తం లభించింది. హైదరాబాద్ హంటర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 61.5 లక్షలు వెచ్చించి మారిన్‌ను సొంతం చేసుకుంది. మారిన్ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ జీ హున్‌కు భారీ మొత్తం లభించింది. సుంగ్ జీ హున్‌ను ముంబై రాకెట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్ ఆటగాడు జాన్ జార్గెన్‌సన్ ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. జార్గెన్‌సన్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు రూ. 59 లక్షలకు సొంతం చేసుకుంది.

పీబీఎల్ తొలి సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మలేసియా స్టార్ ప్లేయర్ లీ చోంగ్ వీ ఈసారి పీబీఎల్‌లో పాల్గొనడంలేదు. చైనా స్టార్స్ చెన్ లాంగ్, లిన్ డాన్ కూడా పీబీఎల్‌కు దూరంగా ఉన్నారు.
భారత్ తరఫున కిడాంబి శ్రీకాంత్‌కు అత్యధిక మొత్తం దక్కింది. అవధ్ వారియర్స్ రూ. 51 లక్షలకు శ్రీకాంత్‌ను కొనుగోలు చేసింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధును చెన్నై స్మాషర్స్ జట్టు... సైనా నెహ్వాల్‌ను అవధ్ వారియర్స్ తమ వద్దే ఉంచుకున్నాయి. సింధుకు రూ. 39 లక్షలు, సైనాకు రూ. 33 లక్షలు లభించనున్నాయి.

భారత్‌కే చెందిన ఇతర ప్లేయర్లు హెచ్‌ఎస్ ప్రణయ్ (రూ. 22 లక్షలు-ముంబై రాకెట్స్), గుత్తా జ్వాల (రూ. 10 లక్షలు-ఢిల్లీ ఏసర్స్), అశ్విని పొన్నప్ప (రూ. 15 లక్షలు-బెంగళూరు బ్లాస్టర్స్), పారుపల్లి కశ్యప్ (రూ. 8 లక్షలు-చెన్నై స్మాషర్స్)లను నామమాత్రం మొత్తానికే ఆయా జట్లు కొనుగోలు చేశాయి. పీబీఎల్-2 సీజన్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 14 వరకు భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో జరగనుంది.

మొత్తం ఆటగాళ్ల వివరాలు
అవధ్ వారియర్స్: కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, ఆదిత్య జోషి, ప్రాజక్త సావంత్, విషెమ్ గో, సావిత్రి అమిత్రపాయ్, వోంగ్ వింగ్ కీ విన్సెంట్, బోదిన్ ఇసారా, మార్కిస్ కిడో.

ముంబై రాకెట్స్: అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్, మనూ అత్రి, గుమ్మడి వృశాలి, మొహితా, అభిషేక్ యెలెగర్, లీ యోంగ్ డే, సుంగ్ జీ హున్, నాదెజ్దా జీబా, నిపిత్‌ఫోన్.

ఢిల్లీ ఏసర్స్: సన్ వాన్ హో, జాన్ జార్గెన్‌సన్, గుత్తా జ్వాల, నిచావోన్ జిందాపోల్, ఇవాన్ సొజోనోవ్, వ్లాదిమిర్ ఇవనోవ్, అక్షయ్ దేవాల్కర్, కె.మనీషా, ఆకర్షి కశ్యప్, సిరిల్ వర్మ.

హైదరాబాద్ హంటర్స్: కరోలినా మారిన్, వీ కియోంగ్ తాన్, చౌ హో వా, రాజీవ్ ఉసెఫ్, సాయిప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, సమీర్ వర్మ, కృష్ణప్రియ, మేఘన, తాన్ బూన్ హెయోంగ్.

బెంగళూరు బ్లాస్టర్స్: విక్టర్ అక్సెల్‌సన్, యో యోన్ సెయోంగ్, అశ్విని పొన్నప్ప, పోర్న్‌టిప్, రుత్విక శివాని, సౌరభ్ వర్మ, ప్రణవ్ చోప్రా, కో సుంగ్ హున్, సిక్కి రెడ్డి, బున్సాక్ పొన్సానా.

చెన్నై స్మాషర్స్: పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, టామీ సుగియార్తో, గ్యాబీ అడ్‌కాక్, తనంగోసక్, క్రిస్ అడ్‌కాక్, మాడ్‌‌స పీలెర్ కోల్డింగ్, సుమీత్ రెడ్డి, రమ్య తులసీ, అరుంధతి పంతవానె.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement