సైనా కథ ముగిసె...
జకార్తా: గతంలో తనకెంతో కలిసొచ్చిన ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. మూడుసార్లు టైటిల్ సాధించి (2009, 2010, 2012), మరోసారి రన్నరప్‌గా (2011) నిలిచిన ఈ టోర్నీలో సైనా వరుసగా మూడో ఏడాది క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా 22-24, 11-21తో ఓడిపోయింది.
మారిన్ చేతిలో సైనాకిది మూడో పరాజయం కావడం గమనార్హం. తొలి గేమ్‌లో రెండుసార్లు గేమ్ పాయింట్లు చేజార్చుకున్న సైనా... రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. క్వార్టర్స్‌లో ఓడిన సైనాకు 5,400 డాలర్ల (రూ. 3 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.