సైనా, సింధులను ఓడించాలంటే..
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధులను ఓడించడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హైదరాబాద్ హంటర్స్ తరపున ఆడుతున్న కరోలినా మారిన్ స్పష్టం చేసింది. భారత్ కు చెందిన ఆ ఇద్దరు అత్యుత్తమ క్రీడాకారిణుల్ని ఓడించాలంటే తాను మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉందని మారిన్ తెలిపింది. తన పూర్తిస్థాయి ఆటను ప్రదర్శిస్తేనే వారిపై గెలుపు సాధ్యమని అభిప్రాయపడింది. 'సైనా, సింధు ఎవర్నీ తన ప్రత్యర్థి ఎంచుకున్నా వారిపై గెలవడం అంత సులభం కాదు. ఆ ఇద్దరూ కఠినమైన ప్రత్యర్థులే కాదు.. చాలా పోటీతత్వం ఉన్న క్రీడాకారిణులు. వారిని ఓడించాలంటే నా అత్యుత్తమ ఆటన ప్రదర్శించాల్సి ఉంది ' అని మారిన్ పేర్కొంది.
పీబీఎల్ -2017 ఆరంభ వేడుకలు ఈరోజు హైదరాబాద్లో జరుగనున్నాయి. పీబీఎల్ రెండో సీజన్ లో ఆరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఢిల్లీ ఏసర్స్, అవేధ్ వారియర్స్, ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ ,చెన్నై స్మాషర్స్ ప్రాంఛైజీలు తలపడనున్నాయి. అయితే చెన్నై స్మాషర్స్-హైదరాబాద్ హంటర్స్ మధ్య నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం రాత్రి గం.6.30 ని.లకు తొలి మ్యాచ్ జరుగనుంది. దీనిలో భాగంగా చెన్నై స్మాషర్స్ క్రీడాకారిణి పివి సింధు, హైదరాబాద్ హంటర్స్ క్రీడాకారిణి మారిన్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రియో ఒలింపిక్స్ లో సింధును మారిన్ ఓడిస్తే, వరల్డ్ సూపర్ సిరీస్ టోర్నీలో మారిన్ను సింధు ఓడించింది. దాంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న మరో మ్యాచ్పై ఆసక్తి నెలకొంది.