వారియర్స్ బోణీ | Mumbai Rockets down Saina-less Awadhe Warriors in PBL opener | Sakshi
Sakshi News home page

వారియర్స్ బోణీ

Published Tue, Jan 5 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

వారియర్స్ బోణీ

వారియర్స్ బోణీ

ఢిల్లీ ఏసర్స్‌పై 4-3తో గెలుపు
►  సైనా, సాయిప్రణీత్ విజయం
►  ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
 లక్నో:
తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన అవధ్ వారియర్స్ (లక్నో) జట్టు... స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ రాకతో రెండో మ్యాచ్‌లోనే పుంజుకుంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ జట్టు 4-3 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఏసర్స్ జట్టుపై విజయం సాధించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున ముంబై రాకెట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ తమ జట్టు సొంతగడ్డపై జరిగిన పోటీలో మాత్రం బరిలోకి దిగింది. ఈ పోటీలో ‘ట్రంప్ మ్యాచ్’ రెండు జట్లకు కలిసొచ్చింది.
 
  పురుషుల తొలి సింగిల్స్‌లో తనోంగ్‌సక్ సేన్‌సోమ్‌బున్‌సుక్ (అవధ్ వారియర్స్) 13-15, 11-15తో టామీ సుగియార్తో (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు. దాంతో వారియర్స్ జట్టు 0-1తో వెనుకబడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 15-9, 15-10తో పీసీ తులసీ (ఢిల్లీ)పై గెలిచింది. వారియర్స్ జట్టు ఈ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొంది. దాంతో సైనా నెగ్గడంతో వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.
 
  మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో బోదిన్ ఇసారా-కాయ్ యున్ (వారియర్స్) ద్వయం 15-12, 15-14తో కీ కీట్ కీన్-తాన్ బూన్ హెయోంగ్ (ఢిల్లీ) జోడీపై గెలిచింది. దాంతో వారియర్స్ జట్టు ఆధిక్యం 3-1కి పెరిగింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ 15-12, 15-9తో ప్రపంచ 17వ ర్యాంకర్ రాజీవ్ ఉసెఫ్ (ఢిల్లీ ఏసర్స్)ను బోల్తా కొట్టించాడు.
 
  దాంతో వారియర్స్ జట్టు 4-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో హెంద్రా గుణవాన్-మనీషా (వారియర్స్) జోడీ 14-15, 15-13, 5-15తో అక్షయ్ దివాల్కర్-గాబ్రియెల్లా అడ్‌కాక్ (ఢిల్లీ ఏసర్స్) జంట చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను ఢిల్లీ ఏసర్స్ ‘ట్రంప్ మ్యాచ్’గా నిర్ణయించడంతో ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేరినా ఫలితం లేకపోయింది. తుదకు వారియర్స్ జట్టు 4-3తో విజయం దక్కించుకుంది. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో చెన్నై స్మాషర్స్‌తో ఢిల్లీ ఏసర్స్; ముంబై రాకెట్స్‌తో బెంగళూరు టాప్‌గన్స్ తలపడతాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement