Awadh Warriors
-
అవధ్ వారియర్స్ రెండో గెలుపు
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో అవధ్ వారియర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 5–0తో ముంబై రాకెట్స్‌ను చిత్తు చేసింది. తొలుత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో కొ సుంగ్ హ్యూన్–క్రిస్టినా పెడర్సెన్ (అవధ్ వారియర్స్) 9–15, 14–15తో కిమ్ స రంగ్–పియా జెబదియా (ముంబై) జంట చేతిలో ఓడింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన అవధ్ వారియర్స్ ప్లేయర్ బీవెన్ జాంగ్ 15–3, 15–4తో కుహూ గార్గ్ (ముంబై)పై గెలిచి జట్టుకు 2–1 ఆధిక్యాన్నిచ్చింది. పురుషుల తొలి సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డు’తో బరిలో దిగిన పారుపల్లి కశ్యప్ (ముంబై) 8–15, 10–15తో విన్సెంట్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడటంతో... ముంబై జట్టుకు ఒక పాయింట్ పెనాల్టీ పడింది. దాంతో అవధ్ వారియర్స్ 3–0తో ఆధిక్యంలో నిలిచింది.తర్వాత జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో అజయ్ జయరామ్ (అవధ్ వారియర్స్) 12–15, 15–6, 15–7తో లీ డాంగ్ కెయున్ (ముంబై)పై గెలిచాడు. ఇక చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌లో కొ సుంగ్ హ్యూన్– షిన్ బేక్ (అవధ్ వారియర్స్) జంట 14–15, 15–10, 15–14తో కిమ్ జి జుంగ్–కిమ్ స రంగ్ (ముంబై) జోడీపై గెలిచింది. నేటి నుంచి హైదరాబాద్ అంచె పోటీలు ప్రారంభమవుతాయి. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడుతుంది. -
హంటర్స్ ఖాతాలో తొలి గెలుపు
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో హైదరాబాద్ హంటర్స్‌కు తొలి విజయం లభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో హైదరాబాద్ హంటర్స్ 2–1తో అవధ్ వారియర్స్‌పై గెలుపొందింది. పురుషుల తొలి సింగిల్స్‌లో సౌరభ్ వర్మ (హైదరాబాద్) 14–15, 15–12, 15–10తో శుభాంకర్ డే (అవ«ద్)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ఇవనోవ్–సిక్కి రెడ్డి (హైదరాబాద్) ద్వయం 15–12, 15–14తో షిన్ బేక్–క్రిస్టీనా (అవధ్) జోడీపై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన అవధ్ వారియర్స్ ఓడిపోవడంతో... పీబీఎల్ నిబంధనల ప్రకారం వారి స్కోరుకు ఒక పాయింట్ పెనాల్టీ విధించారు. దాంతో హైదరాబాద్ 2–(–1)తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (హైదరాబాద్) 15–8, 15–8తో తన్వీ లాడ్ (అవధ్)పై విజయం సాధించడంతో హైదరాబాద్ 3–(–1)తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే హైదరాబాద్ విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల రెండో సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డుతో బరిలో దిగిన హైదరాబాద్ ప్లేయర్ డారెన్ లీయూ 14–15, 9–15తో విన్సెంట్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడిపోవడంతో... ఈసారి హైదరాబాద్‌కు పెనాల్టీ ఎదురైంది. దాంతో హైదరాబాద్ ఆధిక్యం 2–0కు తగ్గింది. చివరి మ్యాచ్ అయిన పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్–బెన్ లేన్ (హైదరాబాద్) జోడీ 12–15, 8–15తో కో సుంగ్ హ్యూన్–íÙన్ బేక్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడింది. నేటి మ్యాచ్‌లో పుణే 7 ఏసెస్‌తో బెంగళూరు రాప్టర్స్ తలపడుతుంది. -
సైనా, శ్రీకాంత్ గెలుపు
అవధ్ చేతిలో ఢిల్లీ ‘మైనస్’ ఓటమి ∙పీబీఎల్–2 లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అవధ్ వారియర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో వారియర్స్ 6–(–1)తో ఢిల్లీ ఏసర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. అవధ్ తరఫున సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు అదరగొట్టారు. పురుషుల డబుల్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విషెమ్ గో–మార్కిస్ కిడో (అవధ్) జోడి 11–4, 11–4తో వ్లాదిమిర్ ఇవనోవ్–అక్షయ్ దివాల్కర్ (ఢిల్లీ) జంటపై గెలిచింది. అనంతరం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌ను అవధ్ ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఇందులో సైనా నెహ్వాల్ (అవధ్) 14–12, 11–7తో నిచావోన్ జిందాపొల్ (ఢిల్లీ)పై అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సైనా జోరు పెంచింది. దీంతో ప్రత్యర్థి జిందాపొల్ ఏ దశలోనూ ఆమెకు పోటీనివ్వలేకపోయింది. ట్రంప్ విజయంతో బోనస్ పాయింట్ సాధించిన వారియర్స్ 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (అవధ్) 11–9, 11–13, 11–9తో జానొ జోర్గెన్సెన్ (ఢిల్లీ)పై చెమటోడ్చి నెగ్గాడు. తర్వాత జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో బోదిన్ ఇసారా–సావిత్రి అమిత్రాపాయ్ (అవధ్) జోడి 12–10, 11–5తో వ్లాదిమిర్ ఇవనోవ్–గుత్తాజ్వాల (ఢిల్లీ) జంటపై నెగ్గింది. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్ పోరు ఢిల్లీకి ట్రంప్ మ్యాచ్ కాగా ఇందులోనూ పరాజయాన్నే చవిచూడటంతో మైనస్ 1 తో చిత్తయింది. వాంగ్ వింగ్ కి విన్సెంట్ (అవధ్) 11–8, 11–6తో సొన్ వాన్ హో (ఢిల్లీ)పై గెలిచి వారియర్స్‌కు పరిపూర్ణ విజయాన్ని అందించాడు. -
వారెవ్వా... వారియర్స్
♦ సైనా జట్టుకు రెండో విజయం ♦ బెంగళూరుకు మూడో ఓటమి ♦ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లక్నో: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి... వెనుకబడిన దశలో అవధ్ వారియర్స్ జట్టు అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. వరుసగా రెండు ‘ట్రంప్ మ్యాచ్’ల్లో నెగ్గి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో రెండో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. బెంగళూరు టాప్‌గన్స్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ (లక్నో) జట్టు 4-1తో గెలుపొందింది. తొలి మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-ఖిమ్ వా లిమ్ ద్వయం 15-13, 11-15, 15-13తో బోదిన్ ఇసారా-మనీషా జంట (అవధ్ వారియర్స్)ను ఓడించి బెంగళూరుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 46వ ర్యాంకర్ సమీర్ వర్మ 15-13, 15-14తో ప్రపంచ 34వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్ (అవధ్ వారియర్స్)ను బోల్తా కొట్టించడంతో బెంగళూరు 2-0తో ముందంజ వేసింది. అవధ్ వారియర్స్‌కు విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. బెంగళూరు జట్టు‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకున్న మ్యాచ్‌లో తనోంగ్సక్ (వారియర్స్) 15-11, 15-10తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు)ను ఓడించాడు. ఫలితంగా వారియర్స్ ఖాతాలో ఒక పాయింట్ చేరగా... బెంగళూరు జట్టు ఒక పాయింట్‌ను చేజార్చుకుంది. దాంతో స్కోరు 1-1తో సమమైంది. ‘ట్రంప్ మ్యాచ్’గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 15-10, 13-15, 15-8తో సూ దీ (బెంగళూరు)పై గెలుపొందడంతో అవధ్ వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరడంతోపాటు 3-1తో విజయం ఖాయమైపోయింది. ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో బోదిన్ ఇసారా-కాయ్ యున్ (అవధ్ వారియర్స్) జంట 15-12, 15-6తో హూన్ థిన్ హౌ-ఖిమ్ వా లిమ్ (బెంగళూరు) జోడీని ఓడించడంతో వారియర్స్ ఓవరాల్‌గా 4-1తో విజయాన్ని దక్కించుకుంది. గురువారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్‌తో హైదరాబాద్ హంటర్స్ జట్టు తలపడుతుంది. -
వారియర్స్ బోణీ
► ఢిల్లీ ఏసర్స్‌పై 4-3తో గెలుపు ► సైనా, సాయిప్రణీత్ విజయం ► ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లక్నో: తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన అవధ్ వారియర్స్ (లక్నో) జట్టు... స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ రాకతో రెండో మ్యాచ్‌లోనే పుంజుకుంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ జట్టు 4-3 పాయింట్ల తేడాతో ఢిల్లీ ఏసర్స్ జట్టుపై విజయం సాధించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున ముంబై రాకెట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న సైనా నెహ్వాల్ తమ జట్టు సొంతగడ్డపై జరిగిన పోటీలో మాత్రం బరిలోకి దిగింది. ఈ పోటీలో ‘ట్రంప్ మ్యాచ్’ రెండు జట్లకు కలిసొచ్చింది. పురుషుల తొలి సింగిల్స్‌లో తనోంగ్సక్ సేన్‌సోమ్‌బున్‌సుక్ (అవధ్ వారియర్స్) 13-15, 11-15తో టామీ సుగియార్తో (ఢిల్లీ) చేతిలో ఓడిపోయాడు. దాంతో వారియర్స్ జట్టు 0-1తో వెనుకబడింది. రెండో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 15-9, 15-10తో పీసీ తులసీ (ఢిల్లీ)పై గెలిచింది. వారియర్స్ జట్టు ఈ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొంది. దాంతో సైనా నెగ్గడంతో వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో బోదిన్ ఇసారా-కాయ్ యున్ (వారియర్స్) ద్వయం 15-12, 15-14తో కీ కీట్ కీన్-తాన్ బూన్ హెయోంగ్ (ఢిల్లీ) జోడీపై గెలిచింది. దాంతో వారియర్స్ జట్టు ఆధిక్యం 3-1కి పెరిగింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ 15-12, 15-9తో ప్రపంచ 17వ ర్యాంకర్ రాజీవ్ ఉసెఫ్ (ఢిల్లీ ఏసర్స్)ను బోల్తా కొట్టించాడు. దాంతో వారియర్స్ జట్టు 4-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది. ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో హెంద్రా గుణవాన్-మనీషా (వారియర్స్) జోడీ 14-15, 15-13, 5-15తో అక్షయ్ దివాల్కర్-గాబ్రియెల్లా అడ్కాక్ (ఢిల్లీ ఏసర్స్) జంట చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను ఢిల్లీ ఏసర్స్ ‘ట్రంప్ మ్యాచ్’గా నిర్ణయించడంతో ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేరినా ఫలితం లేకపోయింది. తుదకు వారియర్స్ జట్టు 4-3తో విజయం దక్కించుకుంది. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో చెన్నై స్మాషర్స్‌తో ఢిల్లీ ఏసర్స్; ముంబై రాకెట్స్‌తో బెంగళూరు టాప్‌గన్స్ తలపడతాయి. -
తొలి పోరులో అవధ్, ముంబై ఢీ
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ప్రారం భ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవధ్ వారియర్స్, ముంబై రాకెట్స్‌ను ఎదుర్కోనుంది. జనవరి 2 నుంచి 17 వరకు పీబీఎల్ జరుగుతుంది. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన ‘ట్రంప్ మ్యాచ్’ను ఈ రెండు జట్లు ఎలా ఉపయోగించుకుంటాయనేది ఇతర జట్లు ఆసక్తిగా పరిశీలించనున్నాయి. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఏర్పాట్లకు సరైన సమయం లేకపోవడంతో చెన్నై స్మాషర్స్ తమ సొంత మ్యాచ్‌లను లక్నో, హైదరాబాద్‌లలో ఆడుతుంది. జనవరి 9, 10, 11 తేదీలలో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. 15 లీగ్ మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నమెంట్లో ఫైనల్‌కు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది.