సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మధ్య హైదరాబాద్ హంటర్స్ గర్జించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో హైదరాబాద్ 4–3 స్కోరుతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. మొదట పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో మార్కిస్ కిడో– యూ ఇయాన్ సియాంగ్ (హంటర్స్) 9–15, 10–15తో మథియాస్ బోయె– కిమ్ సా రంగ్ చేతిలో ఓటమి చవిచూసింది.
పురుషుల సింగిల్స్ హంటర్స్‌కు ట్రంప్ మ్యాచ్ కాగా లీ హ్యూన్ ఇల్ 15–7, 15–13తో శుభాంకర్ డేపై గెలుపొందడంతో హైదరాబాద్ 2–1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది అయితే తర్వాత రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ట్రంప్‌గా ఎంచుకుంది. ఈ పోరులో సాయిప్రణీత్ (హంటర్స్) 8–15, 10–15తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో హైదరాబాద్ 2–3తో వెనుకబడింది.
అనంతరం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ (హంటర్స్) 15–8, 15–14తో గిల్మోర్‌పై గెలుపొందడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈ దశలో కీలకమైన మిక్స్‌డ్ డబుల్స్‌లో పియా జెబదియా–సాత్విక్ సాయిరాజ్ (హంటర్స్) 15–11, 15–12తో సిక్కిరెడ్డి–కిమ్ సా రంగ్‌పై విజయం సాధించడంతో హైదరాబాద్ పీబీఎల్‌లో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment