మారో మారో మారిన్‌... | Carolina Marin defeats PV Sindhu in tournament opener | Sakshi
Sakshi News home page

మారో మారో మారిన్‌...

Published Sun, Jan 1 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

మారో మారో మారిన్‌...

మారో మారో మారిన్‌...

హైదరాబాద్‌ గెలిచింది..
హైదరాబాదీ ఓడింది


ఒకవైపు సొంతగడ్డపై ఆడుతున్న సింధు... మరోవైపు స్థానిక జట్టు హైదరాబాద్‌ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరోలినా మారిన్‌... ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రేక్షకులంతా దాదాపు సమంగా చీలిపోయారు.  అయితే చివరకు ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినాదే పైచేయి అయింది.  తుదకు హైదరాబాద్‌ హంటర్స్‌ 4–3తో  సింధు ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్‌ను ఓడించి బోణీ చేసింది.   

సింధును చిత్తు చేసిన కరోలినా
తొలి మ్యాచ్‌లో హంటర్స్‌ శుభారంభం

ఒకవైపు సొంతగడ్డపై ఆడుతున్న సింధు... మరోవైపు స్థానిక జట్టు హైదరాబాద్‌ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరోలినా మారిన్‌... ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రేక్షకులంతా దాదాపు సమంగా చీలిపోయారు. ఇద్దరు స్టార్‌ ప్లేయర్ల పక్షం వహించారు. అయితే చివరకు ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినాదే పైచేయి అయింది. రెండు గేమ్‌లు హోరాహోరీగా సాగినా... నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం స్పెయిన్‌ స్టార్‌ చెలరేగిపోయింది. హంటర్స్‌ జట్టుకు శుభారంభాన్ని అందించింది. ఘనంగా ప్రారంభమైన ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)–2 టోర్నీలో అందరూ ఆశించిన వినోదం మొదటి మ్యాచ్‌లోనే దక్కింది. తుదకు హైదరాబాద్‌ హంటర్స్‌ 4–3తో చెన్నై
స్మాషర్స్‌ను ఓడించి బోణీ చేసింది.  

హైదరాబాద్‌: పీవీ సింధు వర్సెస్‌ కరోలినా మారిన్‌... రియో ఒలింపిక్స్‌ ఫైనల్‌ తర్వాత వీరిద్దరి మ్యాచ్‌ను భారత గడ్డపై చూడాలనుకున్న మన అభిమానులకు కొత్త సంవత్సరం మొదటి రోజునే ఆ అవకాశం లభించింది. ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) టోర్నీ రెండో సీజన్‌లో భాగంగా ఈసారి తమ ఫ్రాంచైజీలు హైదరాబాద్‌ హంటర్స్, చెన్నై స్మాషర్స్‌ తరఫున ఆదివారం వీరిద్దరు తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో మారిన్‌ (హంటర్స్‌) 11–8, 12–14, 11–2 స్కోరుతో పీవీ సింధుపై విజయం సాధించింది. ఇటీవలే దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ లీగ్‌ మ్యాచ్‌లో సింధు చేతిలో ఓడిన మారిన్, మరోసారి తన సామర్థ్యానికి తగిన ప్రదర్శనను కనబర్చడంతో సింధుకు నిరాశ తప్పలేదు. మారిన్‌ విజయంతో శుభారంభం చేసిన హంటర్స్‌ చివరకు ఈ పోరులో 4–3 పాయింట్ల తేడాతో చెన్నై స్మాషర్స్‌ను ఓడించింది. ప్రతి పోటీలో రెండు జట్లు ఒక్కో మ్యాచ్‌ను తమ ‘ట్రంప్‌’ మ్యాచ్‌గా ఎంపిక చేసుకుంటాయి. ‘ట్రంప్‌’ మ్యాచ్‌ ల్లో గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. ఇతర మ్యాచ్‌ల్లో మాత్రం ఒక్కో పాయింట్‌ దక్కుతాయి.

మారిన్‌ గెలుపుతో హైదరాబాద్‌ హంటర్స్‌ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో టామీ సుగియార్తో (చెన్నై) 11–6, 11–8తో భమిడిపాటి సాయిప్రణీత్‌ (హైదరాబాద్‌)ను ఓడించాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. చెన్నై స్మాషర్స్‌ జట్టు మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ను తమ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ మ్యాచ్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–గాబ్రిలీ అడ్‌కాక్‌ ద్వయం (చెన్నై) 11–7, 11–9తో హోయ్‌ వా చౌ–సాత్విక్‌ సాయిరాజ్‌ (హైదరాబాద్‌) జోడీని ఓడించింది. దాంతో చెన్నై 3–1తో ఆధిక్యంలో వెళ్లింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్‌లో రాజీవ్‌ ఉసెఫ్‌ (హైదరాబాద్‌) 6–11, 11–8, 11–6తో తనోంగ్‌సక్‌ సెన్‌సోమ్‌బూన్‌సుక్‌ (చెన్నై)పై గెలిచాడు. దాంతో చెన్నై ఆధిక్యం 3–2కి తగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌ పోరులో బూన్‌ హెయోంగ్‌ తాన్‌–వీ కియోంగ్‌ తాన్‌ (హైదరాబాద్‌) జంట 11–7, 11–8తో కోల్డింగ్‌–సుమీత్‌ రెడ్డి (చెన్నై) జోడీపై గెలిచింది. ఈ మ్యాచ్‌ను హంటర్స్‌ ‘ట్రంప్‌’ మ్యాచ్‌గా ఎంపిక చేసుకోవడం, విజయం కూడా సాధించడంతో ఓవరాల్‌గా హైదరాబాద్‌ 4–3తో విజయాన్ని ఖాయం చేసుకుంది.

మారిన్‌ దూకుడు...
సింధుతో జరిగిన మ్యాచ్‌లో కరోలినా తొలి పాయింట్‌ సాధించి శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. 4–4 వద్ద చక్కటి డ్రాప్‌ షాట్‌లో మారిన్‌ ముందంజ వేయగా, వెంటనే సింధు కోలుకుంది. అయితే 6–6 వద్ద సమంగా ఉన్న స్థితిలో మారిన్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించింది. సింధు కాస్త పోటీనిచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
రెండో గేమ్‌లో కూడా ముందుగా పాయింట్లు సొంతం చేసుకొని మారిన్‌ 3–0తో ముందంజ వేసింది. అయితే 2–5తో వెనుకబడి ఉన్న సమయంలో సింధు ఒక్కసారిగా చెలరేగిపోయింది. స్మాష్, డ్రాప్‌ షాట్‌లతో ప్రత్యర్థిని కోలుకోనీయకుండా చేసిన సింధు వరుసగా 5 పాయింట్లు స్కోర్‌ చేసి 7–5తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ఆ తర్వాత పోరు మరింత రసవత్తరంగా మారింది.

ఒకరితో మరొకరు పోటీ పడి ప్రతీ పాయింట్‌ కోసం శ్రమించడంతో స్కోరు సమమవుతూ వచ్చింది. మారిన్‌ 10–8 వద్ద మ్యాచ్‌ సొంతం చేసుకునే స్థితిలో నిలిచినా, సింధు పోరాడింది. తనదైన శైలిలో అద్భుతమైన స్మాష్‌తో స్కోరు సమం చేసిన సింధు, ఆ తర్వాత గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్‌లో మారిన్‌ ఆట ముందు సింధు సాధారణ ప్లేయర్‌గా మారిపోయింది. ఏకంగా 5–0తో ముందంజ వేసిన తర్వాత ప్రత్యర్థికి మొదటి పాయింట్‌ ఇచ్చిన మారిన్, తర్వాత కూడా మరో పాయింట్‌నే సింధుకు కోల్పోయింది. మారిన్‌ షాట్‌లకు సింధు వద్ద సమాధానం లేకుండా పోయింది. మారిన్‌ డ్రాప్‌ షాట్‌లతో పాటు లైన్‌ కాల్‌లను కూడా ఆమె సరిగ్గా అంచనా వేయగా... అన్నింటా పొరబడిన సింధు, సరైన రీతిలో స్పందించలేక  ప్రేక్షకురాలిగా మారిపోయింది.

పీబీఎల్‌–2లో నేడు
హైదరాబాద్‌ హంటర్స్‌ గీ అవధ్‌ వారియర్స్‌
రాత్రి గం. 7.00 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement