ఒలింపిక్ చాంపియన్‌పై సింధు విజయనాదం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కలను నెరవేర్చుకుంది. స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను సాధించింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్(స్పెయిన్) పై 21-19, 21-16 తేడాతో సింధు(భారత్) నెగ్గింది. దీంతో గతేడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో ఓటమికి సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్ ఆరో ప్రయత్నంలో హైదరాబాద్ అమ్మాయి సింధు టైటిల్ కలను నిజం చేసుకుంది.
తొలి గేమ్ ఆరంభంలో దూకుడుగా ఆడిన సింధు 6-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మారిన్ పుంజుకోవడంతో స్కోరు 17-16 అయింది. ఆపై సింధు, మారిన్ హోరీహారీగా పాయింట్లు రాబట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో సింధు 21-19తో తొలి గేమ్ సాధించింది. రెండో గేమ్‌లో మారిన్ పాయింట్ల తెరవకముందే సింధు 4 పాయింట్లు తనఖాతాలో వేసుకుంది. మారిన్ వేగం పెంచడంతో సింధు గేమ్ ప్లాన్ చేంజ్ చేసి పదునైన ర్యాలీలు, స్మాష్‌లతో ఒలింపిక్ విన్నర్ ను కంగారెత్తించింది. రెండో గేమ్‌ను 21-16తో నెగ్గిన సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుని సొంత దేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ ను ఒడిసి పట్టుకుంది. ప్రత్యర్థి పాయింట్లు సాధిస్తున్నా ఏ దశలోనూ సింధు ఒత్తిడికి లోను కాకపోవడం ఆమెకు అనుకూల ఫలితాలను తెచ్చింది. ఈ విజయంతో మారిన్ పై గెలుపోటముల రికార్డును 4-5తో సింధు మెరుగు పరుచుకుంది.
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని.. ఈ విజయాల పరంపర కొనసాగించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.