Indian Open Super Series
-
Indian Open Super Series: సైనా, ప్రణయ్ ముందంజ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నమెంట్లో సైనా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా తొలి రౌండ్లో గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సైనా తొలి గేమ్‌ను 22–20తో గెల్చుకొని, రెండో గేమ్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి తెరెజా స్వబికోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సైనాను విజేతగా ప్రకటించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్లు కేయుర మోపాటి శుభారంభం చేయగా ... సామియా, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో ఓడిపోయారు. కేయుర 15–21, 21–19, 21–8తో స్మిత తోష్నివాల్ (భారత్)పై నెగ్గింది. సామియా 18–21, 9–21తో మాళవిక బన్సోద్ (భారత్) చేతిలో, సాయి ఉత్తేజిత 21–9, 12–21, 19–21తో తాన్యా (భారత్) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–14, 21–7తో పాబ్లో అబియాన్ (స్పెయిన్)పై, లక్ష్య సేన్ 21–15, 21–7తో అధామ్ హతీమ్ ఎల్గామల్ (ఈజిప్ట్)పై గెలిచారు. ప్రిక్వార్టర్స్‌లో సిక్కి–అశ్విని జంట మహిళల డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 21–7, 19–21, 21–13తో జనని–దివ్య (భారత్) జోడీపై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్‌లో శ్రీవేద్య గురజాడ (భారత్)–ఇషికా జైస్వాల్ (అమెరికా) జంట 21–9, 21–7తో మేఘ–లీలా లక్ష్మి (భారత్) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 21–10తో రవి–చిరాగ్ అరోరా (భారత్) జంటపై గెలిచింది. విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జోడీ 16–21, 16–21తో హీ యోంగ్ కాయ్ టెర్రీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ షురూ.. బరిలో సింధు, శ్రీకాంత్
న్యూఢిల్లీ: రెండేళ్లుగా కోవిడ్ పడగ విప్పడంతో రద్దయిన ‘ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్–500’ టోర్నమెంట్ ఈ ఏడాది నిర్వహణకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ మేటి ఈవెంట్లో సత్తా చాటేందుకు మాజీ చాంపియన్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సహా పలువురు స్టార్లు సై అంటున్నారు. అయితే భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ క్రియాశీలం కావడంతో థర్ట్ వేవ్ (కోవిడ్ మూడో ముప్పు) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కఠిన ప్రొటోకాల్ ప్రకారం పకడ్బందీగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఆర్గనైజర్లు గట్టి చర్యలు చేపట్టారు. కోర్టుల్లో ఆటగాళ్లు, కోర్టు వెలుపల సిబ్బంది తప్ప ప్రేక్షకుల స్టాండ్లలో ఎవరూ కనిపించరు. టీవీల్లో తప్ప వేదిక వద్ద చూసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఒమిక్రాన్ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ భారత స్టార్లు సహా విదేశీ టాప్ స్టార్లు, ప్రపంచ చాంపియన్ షట్లర్లు ఇండియా ఓపెన్ ఆడేందుకు ఇది వరకే భారత్ చేరుకున్నారు. ప్రపంచ పురుషుల చాంపియన్ లో కియన్ వీ (సింగపూర్), మలేసియా టాప్‌స్టార్స్ ఒంగ్ వి సిన్, టియో యియి, ఇండోనేసియా చాంపియన్లు మొహమ్మద్ అసాన్, హెండ్రా సెతివాన్ తదితరుల ఆటతో ఇందిరా గాంధీ స్టేడియం కళకళలాడనుంది. 2017 ఇండియా ఓపెన్ విజేత అయిన సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన ఉత్సాహంతో ఉండగా, 2015 చాంపియన్ శ్రీకాంత్ ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇద్దరు మరోసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాలనే పట్టు దలతో ఉన్నారు. సింధు తొలి రౌండ్లో సహచర క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియతో, పురుషుల టాప్ సీడ్ శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లో భారత సహచరుడు సిరిల్ వర్మతో తలపడనున్నాడు. -
సెమీస్‌కు చేరిన శ్రీకాంత్, కశ్యప్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్‌లు సెమీస్‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21-23, 21-11, 21-19 తేడాతో సాయి ప్రణీత్‌పై విజయం సాధించి సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నాడు.తొలి గేమ్‌ను సాయి ప్రణీత్ గెలిచినప్పటికీ, మిగతా రెండు గేమ్‌ల్లో శ్రీకాంత్ విజయం సాధించాడు. 62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ తన అనుభవాన్ని ఉపయోగించి గెలుపును అందుకున్నాడు. మరొకక్వార్టర్ ఫైనల్ పోరులో కశ్యప్21-16, 21-11 తేడాతో వాంగ్ జు వుయ్(చైనీస్ తైపీ)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. తొలి గేమ్‌ను కష్టపడి గెలిచిన కశ్యప్.. రెండో గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్నాడు. కాగా, ఒక సూపర్ సిరీస్‌లో కశ్యప్ సెమీస్‌కు చేరుకోవడం దాదాపు నాలుగేళ్లలో ఇదే తొలిసారి. -
ఒలింపిక్ చాంపియన్‌పై సింధు విజయనాదం
-
ఒలింపిక్ చాంపియన్‌పై సింధు విజయనాదం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కలను నెరవేర్చుకుంది. స్వదేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను సాధించింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ కరోలినా మారిన్(స్పెయిన్) పై 21-19, 21-16 తేడాతో సింధు(భారత్) నెగ్గింది. దీంతో గతేడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో ఓటమికి సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఇండియా ఓపెన్ టోర్నమెంట్ ఆరో ప్రయత్నంలో హైదరాబాద్ అమ్మాయి సింధు టైటిల్ కలను నిజం చేసుకుంది. తొలి గేమ్ ఆరంభంలో దూకుడుగా ఆడిన సింధు 6-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మారిన్ పుంజుకోవడంతో స్కోరు 17-16 అయింది. ఆపై సింధు, మారిన్ హోరీహారీగా పాయింట్లు రాబట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో సింధు 21-19తో తొలి గేమ్ సాధించింది. రెండో గేమ్‌లో మారిన్ పాయింట్ల తెరవకముందే సింధు 4 పాయింట్లు తనఖాతాలో వేసుకుంది. మారిన్ వేగం పెంచడంతో సింధు గేమ్ ప్లాన్ చేంజ్ చేసి పదునైన ర్యాలీలు, స్మాష్‌లతో ఒలింపిక్ విన్నర్ ను కంగారెత్తించింది. రెండో గేమ్‌ను 21-16తో నెగ్గిన సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుని సొంత దేశంలో తొలి సూపర్ సిరీస్ టైటిల్ ను ఒడిసి పట్టుకుంది. ప్రత్యర్థి పాయింట్లు సాధిస్తున్నా ఏ దశలోనూ సింధు ఒత్తిడికి లోను కాకపోవడం ఆమెకు అనుకూల ఫలితాలను తెచ్చింది. ఈ విజయంతో మారిన్ పై గెలుపోటముల రికార్డును 4-5తో సింధు మెరుగు పరుచుకుంది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను నెగ్గిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని.. ఈ విజయాల పరంపర కొనసాగించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
పీవీ సింధు తొలిసారిగా..
న్యూఢిల్లీ: తనను ఎంతో కాలం నుంచి ఊరిస్తోన్న ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌కు భారత స్టార్ షట్లర్ ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇండియా ఓపెన్‌లో ఆరోసారి ఆడుతున్న సింధు తొలిసారగి ఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో 2013లో సెమీఫైనల్‌కు చేరడమే ఇప్పటివరకూ సింధు ఉత్తమ ప్రదర్శన. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) పై 21-18, 14-21, 21-14 తేడాతో సింధు విజయం సాధించింది. ఈ గెలుపుతో సుంగ్ జీ హున్‌తో ముఖాముఖి పోరులో గెలుపోటముల రికార్డును 7–4తో సింధు మెరుగు పరుచుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21–16, 22–20తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్‌పై నెగ్గిన సింధు నేటి మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించింది. తొలిగేమ్‌లో ప్రత్యర్ధి సుంగ్ జీ హున్ నుంచి ప్రతిఘటన ఎదురైనా తొలి గేమ్‌ను అద్భుతమైన స్మాష్‌లతో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సుంగ్ జీ పుంజుకుని గేమ్ నెగ్గడంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌కు మ్యాచ్ వెళ్లింది. మూడో గేమ్‌లో ఏమాత్రం ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా సింధు 21-14తో గేమ్ తో పాటు మ్యాచ్ సొంతం చేసుకుంది. తొలిసారిగా టైటిల్ వేటకు అడుగుదూరంలో ఉన్న సింధు.. ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కరొలినా మారిన్ తో తలపడనుంది. -
ఇండియన్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్
న్యూఢిల్లీ:స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదంబి శ్రీకాంత్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 21-16, 21-13 తేడాతో జుయ్ సాంగ్ (చైనా)పై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి సెట్ ను అవలీలగా గెలుచుకున్న శ్రీకాంత్.. రెండో్ సెట్ ను గెలుచుకోవడానికి మాత్రం కాస్త సమయం తీసుకున్నాడు. అయితే తన అనుభవాన్ని ఉపయోగించిన శ్రీకాంత్ చివరికి జుయ్ సంగ్ ను బోల్తా కొట్టించి రెండో గేమ్ ను కూడా కైవశం చేసుకున్నాడు. -
ఇండియన్ ఓపెన్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన సైనా
హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన ఉత్సాహంలో ఉన్న సైనా.. వరుస సెట్లలో జపాన్‌కు చెందిన ప్రత్యర్థి యుకి హషిమొటోను ఓడించింది. మొదటి సెట్‌ను అలవోగా 21-15తో గెలుచుకున్న సైనా, రెండో సెట్లో ప్రత్యర్థికి ఆమాత్రం అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ సెట్‌ను 21- 11 తేడాతో గెలుచుకుని నేరుగా ఫైనల్స్‌లోకి వెళ్లింది. ఈ మ్యాచ్ కేవలం 43 నిమిషాల్లోనే ముగిసింది. ఫైనల్స్‌లో ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ నెంబర్ 3 ర్యాంకర్ ఇలనాన్ రచానోను ఢీకొంటుంది. -
నంబర్‌వన్ ‘అవకాశం’
టాప్ ర్యాంక్‌పై సైనా గురి న్యూఢిల్లీ: కెరీర్లో ఎనిమిది సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గినప్పటికీ... స్వదేశంలో మాత్రం అందని ద్రాక్షగా ఊరిస్తున్న ‘సూపర్’ విజయాన్ని దక్కించుకునేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈనెల 24 నుంచి 29 వరకు న్యూఢిల్లీలో జరిగే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా నెహ్వాల్, ప్రపంచ చాంపియన్, నాలుగో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)లకు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకునే అవకాశం కూడా ఉంది. టాప్ సీడ్ హోదాలో ఈ టోర్నీలో ఆడుతున్న సైనా ఫైనల్ చేరుకుంటే ఎలాంటి సమీకరణాలతో సంబంధంలేకుండా తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలుస్తుంది. ఒకవేళ సైనా క్వార్టర్ ఫైనల్లో లేదా అంతకుముందే ఓడిపోయి... కరోలినా మారిన్ ఫైనల్ చేరుకుంటే మాత్రం ఈ స్పెయిన్ అమ్మాయికి టాప్ ర్యాంక్ దక్కుతుంది.ఒకవేళ ఇదే జరిగితే... 2010 డిసెంబరు తర్వాత తొలిసారి చైనాయేతర క్రీడాకారిణి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచినట్టవుతుంది. ఇక ఇండియా ఓపెన్ ‘డ్రా’ పరిశీలిస్తే... సైనా స్థాయికి తగ్గట్టు ఆడితే ఫైనల్ చేరుకోవడం కష్టమేమీకాదు. తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో ఆడనున్న సైనాకు రెండో రౌండ్లో రుత్విక శివాని ప్రత్యర్థిగా ఉండవచ్చు. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ ప్లేయర్ పాయ్ యు పో, సెమీఫైనల్లో చైనా అమ్మాయి లియు జిన్ ఎదురవ్వొచ్చు.