పీవీ సింధు తొలిసారిగా..
న్యూఢిల్లీ: తనను ఎంతో కాలం నుంచి ఊరిస్తోన్న ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌కు భారత స్టార్ షట్లర్ ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇండియా ఓపెన్‌లో ఆరోసారి ఆడుతున్న సింధు తొలిసారగి ఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో 2013లో సెమీఫైనల్‌కు చేరడమే ఇప్పటివరకూ సింధు ఉత్తమ ప్రదర్శన. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో రెండో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) పై 21-18, 14-21, 21-14 తేడాతో సింధు విజయం సాధించింది. ఈ గెలుపుతో సుంగ్ జీ హున్‌తో ముఖాముఖి పోరులో గెలుపోటముల రికార్డును 7–4తో సింధు మెరుగు పరుచుకుంది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 21–16, 22–20తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్‌పై నెగ్గిన సింధు నేటి మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించింది. తొలిగేమ్‌లో ప్రత్యర్ధి సుంగ్ జీ హున్ నుంచి ప్రతిఘటన ఎదురైనా తొలి గేమ్‌ను అద్భుతమైన స్మాష్‌లతో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సుంగ్ జీ పుంజుకుని గేమ్ నెగ్గడంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌కు మ్యాచ్ వెళ్లింది. మూడో గేమ్‌లో ఏమాత్రం ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా సింధు 21-14తో గేమ్ తో పాటు మ్యాచ్ సొంతం చేసుకుంది. తొలిసారిగా టైటిల్ వేటకు అడుగుదూరంలో ఉన్న సింధు.. ఫైనల్లో స్పెయిన్ ప్లేయర్ కరొలినా మారిన్ తో తలపడనుంది.