న్యూఢిల్లీ: రెండేళ్లుగా కోవిడ్ పడగ విప్పడంతో రద్దయిన ‘ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్–500’ టోర్నమెంట్ ఈ ఏడాది నిర్వహణకు సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ మేటి ఈవెంట్‌లో సత్తా చాటేందుకు మాజీ చాంపియన్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సహా పలువురు స్టార్లు సై అంటున్నారు. అయితే భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ క్రియాశీలం కావడంతో థర్ట్ వేవ్ (కోవిడ్ మూడో ముప్పు) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ఈ నేపథ్యంలో కరోనా కఠిన ప్రొటోకాల్ ప్రకారం పకడ్బందీగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఆర్గనైజర్లు గట్టి చర్యలు చేపట్టారు. కోర్టుల్లో ఆటగాళ్లు, కోర్టు వెలుపల సిబ్బంది తప్ప ప్రేక్షకుల స్టాండ్లలో ఎవరూ కనిపించరు. టీవీల్లో తప్ప వేదిక వద్ద చూసేందుకు ఎవరికీ అనుమతి లేదు. ఒమిక్రాన్ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ భారత స్టార్లు సహా విదేశీ టాప్ స్టార్లు, ప్రపంచ చాంపియన్ షట్లర్లు ఇండియా ఓపెన్ ఆడేందుకు ఇది వరకే భారత్ చేరుకున్నారు. ప్రపంచ పురుషుల చాంపియన్ లో కియన్ వీ (సింగపూర్), మలేసియా టాప్‌స్టార్స్ ఒంగ్ వి సిన్, టియో యియి, ఇండోనేసియా చాంపియన్లు మొహమ్మద్ అసాన్, హెండ్రా సెతివాన్ తదితరుల ఆటతో ఇందిరా గాంధీ స్టేడియం కళకళలాడనుంది.
2017 ఇండియా ఓపెన్ విజేత అయిన సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన ఉత్సాహంతో ఉండగా, 2015 చాంపియన్ శ్రీకాంత్ ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇద్దరు మరోసారి ఈ టోర్నీలో టైటిల్ సాధించాలనే పట్టు దలతో ఉన్నారు. సింధు తొలి రౌండ్లో సహచర క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియతో, పురుషుల టాప్ సీడ్ శ్రీకాంత్ కూడా తొలి రౌండ్లో భారత సహచరుడు సిరిల్ వర్మతో తలపడనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment