నంబర్‌వన్ ‘అవకాశం’
టాప్ ర్యాంక్‌పై సైనా గురి
న్యూఢిల్లీ: కెరీర్‌లో ఎనిమిది సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గినప్పటికీ... స్వదేశంలో మాత్రం అందని ద్రాక్షగా ఊరిస్తున్న ‘సూపర్’ విజయాన్ని దక్కించుకునేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈనెల 24 నుంచి 29 వరకు న్యూఢిల్లీలో జరిగే ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా నెహ్వాల్, ప్రపంచ చాంపియన్, నాలుగో ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)లకు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకునే అవకాశం కూడా ఉంది. టాప్ సీడ్ హోదాలో ఈ టోర్నీలో ఆడుతున్న సైనా ఫైనల్ చేరుకుంటే ఎలాంటి సమీకరణాలతో సంబంధంలేకుండా తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలుస్తుంది.
ఒకవేళ సైనా క్వార్టర్ ఫైనల్లో లేదా అంతకుముందే ఓడిపోయి... కరోలినా మారిన్ ఫైనల్ చేరుకుంటే మాత్రం ఈ స్పెయిన్ అమ్మాయికి టాప్ ర్యాంక్ దక్కుతుంది.ఒకవేళ ఇదే జరిగితే... 2010 డిసెంబరు తర్వాత తొలిసారి చైనాయేతర క్రీడాకారిణి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచినట్టవుతుంది. ఇక ఇండియా ఓపెన్ ‘డ్రా’ పరిశీలిస్తే... సైనా స్థాయికి తగ్గట్టు ఆడితే ఫైనల్ చేరుకోవడం కష్టమేమీకాదు. తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో ఆడనున్న సైనాకు రెండో రౌండ్‌లో రుత్విక శివాని ప్రత్యర్థిగా ఉండవచ్చు. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ ప్లేయర్ పాయ్ యు పో, సెమీఫైనల్లో చైనా అమ్మాయి లియు జిన్ ఎదురవ్వొచ్చు.