Indian Open Super Series: సైనా, ప్రణయ్‌ ముందంజ  | Saina Nehwal-HS Prannoy-Lakshya Sen Enter 2nd Round India Open Badminton | Sakshi
Sakshi News home page

Indian Open Super Series: సైనా, ప్రణయ్‌ ముందంజ 

Published Thu, Jan 13 2022 1:30 AM | Last Updated on Thu, Jan 13 2022 10:58 AM

Saina Nehwal-HS Prannoy-Lakshya Sen Enter 2nd Round India Open Badminton - Sakshi

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించింది. ఇండియా ఓపెన్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో సైనా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత లక్ష్య సేన్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కూడా తొలి రౌండ్‌లో గెలిచి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్‌ సైనా తొలి గేమ్‌ను 22–20తో గెల్చుకొని, రెండో గేమ్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి తెరెజా స్వబికోవా (చెక్‌ రిపబ్లిక్‌) గాయం కారణంగా వైదొలిగింది. దాంతో సైనాను విజేతగా ప్రకటించారు.

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్లు కేయుర మోపాటి శుభారంభం చేయగా ... సామియా, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్‌లో ఓడిపోయారు. కేయుర 15–21, 21–19, 21–8తో స్మిత తోష్నివాల్‌ (భారత్‌)పై నెగ్గింది. సామియా 18–21, 9–21తో మాళవిక బన్సోద్‌ (భారత్‌) చేతిలో, సాయి ఉత్తేజిత 21–9, 12–21, 19–21తో తాన్యా (భారత్‌) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రణయ్‌ 21–14, 21–7తో పాబ్లో అబియాన్‌ (స్పెయిన్‌)పై, లక్ష్య సేన్‌ 21–15, 21–7తో అధామ్‌ హతీమ్‌ ఎల్గామల్‌ (ఈజిప్ట్‌)పై గెలిచారు.

ప్రిక్వార్టర్స్‌లో సిక్కి–అశ్విని జంట
మహిళల డబుల్స్‌ విభాగంలో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 21–7, 19–21, 21–13తో జనని–దివ్య (భారత్‌) జోడీపై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్‌లో శ్రీవేద్య గురజాడ (భారత్‌)–ఇషికా జైస్వాల్‌ (అమెరికా) జంట 21–9, 21–7తో మేఘ–లీలా లక్ష్మి (భారత్‌) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–14, 21–10తో రవి–చిరాగ్‌ అరోరా (భారత్‌) జంటపై గెలిచింది. విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణప్రసాద్‌ జోడీ 16–21, 16–21తో హీ యోంగ్‌ కాయ్‌ టెర్రీ–లో కీన్‌ హీన్‌ (సింగపూర్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement