
వామ్మో... అన్ని కోట్లా!
ముంబై: ఒక్క ఒలింపిక్స్ రజతంతోనే పి.వి. సింధు రూ. 13 కోట్ల మేర నగదు నజరానా అందుకోవడంపై ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రియోలో సింధును ఓడించి బంగారు పతకం నెగ్గిన ఆమెకు స్పెయిన్ ప్రభుత్వం రూ. 70 లక్షలు అందజేసింది.
‘సింధుకు అందిన మొత్తం విని ఆశ్చర్యపోయాను. ఆమె కోట్లు గడించింది. నాకూ మా ప్రభుత్వం నుంచి నజరానా అందింది. కానీ నేను ఆమె అందుకున్న మొత్తంలో కేవలం పదో, పదిహేను శాతమో పొందాను. పతకాలు గెలిచిన క్రీడాకారులు ఇక్కడెంత పాపులరో నాకర్థమైంది’ అని మారిన్ చెప్పింది.
మారిన్ కోచ్ ఫెర్నాండో రివస్ కూడా ఇక్కడి భారీ పారితోషికాలపై ఆశ్చర్యపోయారు. ఒలింపిక్ చాంపియన్లపై కోట్లు గుమ్మరించడం గొప్ప విషయమన్నాడు. కరోలినా మారిన్ ప్రస్తుతం ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్(పీబీఎల్)లో ఆడుతోంది.