ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ సైనా వశం
సిడ్నీ: ఏడాదిన్నర కాలంగా సూపర్ సిరీస్ టోర్నీల్లో విఫలమవుతున్న భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ ఈసారి ఒత్తిడిని అధిగమించి ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ ను కైవసం చేసుకుంది.ఈ సిరీస్ లోపూర్తిస్థాయి ఫిట్ నెస్ లో ఉండి, తన సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించిన సైనా టైటిల్ ను చేజిక్కించుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో సైనా 21-18, 21-11 తేడాతో కరోలినా మారిన్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించింది. ఈ తుదిపోరు కేవలం 43 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. ఈ ఏడాది ఆమెకు ఇది రెండో టైటిల్.
2012 అక్టోబరులో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ తర్వాత ఈ హైదరాబాద్ అమ్మాయి 17 సూపర్ సిరీస్ టోర్నీలలో బరిలోకి దిగింది. కానీ ఈ సూపర్ సిరీస్ టోర్నీలలో ఏ దాంట్లోనూ ఆమె ఫైనల్‌కు చేరుకోలేదు. ఎట్టకేలకు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా తన పూర్వ వైభవాన్ని చాటుకొని టైటిల్ సాధించింది. ప్రపంచ రెండో ర్యాంకర్, చైనా క్రీడాకారిణి టాప్ సీడ్ షిజియాన్ వాంగ్ శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సైనా నెహ్వాల్ 21-19, 16-21, 21-15తో అద్భుత విజయం సాధించి ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే.