సైనా జోరు...
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశం
17 సూపర్ సిరీస్ టోర్నీల తర్వాత ఈ ఘనత
సెమీస్‌లో రెండో ర్యాంకర్ వాంగ్‌పై గెలుపు
నేడు కరోలినాతో అమీతుమీ
సైనాxకరోలినా ఫైనల్
నేటి ఉదయం గం. 10.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం
సిడ్నీ: పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లో ఉంటే... సహజశైలిలో చెలరేగితే... ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించే సత్తా తన సొంతమని గతంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ నిరూపించింది. అయితే దాదాపు ఏడాదిన్నర కాలంగా ఆమెకు సూపర్ సిరీస్ టోర్నీలు కలసిరావడం లేదు.
కారణాలు ఏవైనా... 2012 అక్టోబరులో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ తర్వాత ఈ హైదరాబాద్ అమ్మాయి 17 సూపర్ సిరీస్ టోర్నీలలో బరిలోకి దిగింది. కానీ ఈ సూపర్ సిరీస్ టోర్నీలలో ఏ దాంట్లోనూ ఆమె ఫైనల్‌కు చేరుకోలేదు. ఎట్టకేలకు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైనా తన పూర్వ వైభవాన్ని చాటుకొని టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సైనా నెహ్వాల్ 21-19, 16-21, 21-15తో అద్భుత విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా తలపడుతుంది. కరోలినాతో కెరీర్‌లో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సైనా గెలిచింది.
గంటా 16 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ సమరంలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా తొలి గేమ్‌లో రెండుసార్లు (7-4; 14-10) ఆధిక్యంలోకి వెళ్లినా దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆధిక్యం దోబూచులాడినా కీలకదశలో సంయమనంతో ఆడిన సైనా తొలి గేమ్‌ను దక్కించుకుంది.
రెండో గేమ్‌లోనూ సైనా తన జోరు కొనసాగించింది. 15-13తో ఆధిక్యం సంపాదించింది. ఈ దశలో షిజియాన్ విజృంభించింది. సైనా దూకుడుకు కళ్లెం వేస్తూ వరుసగా ఏడు పాయింట్లు నెగ్గింది. అదే ఊపులో రెండో గేమ్‌ను కైవసం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది.
నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. ఈ దశలో సైనా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. కీలకదశలో స్మాష్‌లతో విరుచుకుపడింది. వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 19-15తో ముందంజ వేసింది. చివర్లో షిజియాన్ కొట్టిన స్మాష్ బయటకు వెళ్లడంతో సైనా విజయం ఖాయమైంది.